ఘనచరిత్ర కలిగిన నగరం గుంటూరు. తెలుగు ప్రాంతంలోనే గుంటూరు నగరానికి విశిష్టమైన స్థానముంది. కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన సోమయాజి కూడా గుంటూరు నగరాన్ని కీర్తించాడు. గుర్రం జాషువా లాంటి మహాకవులు, కొండా వేంకటప్పయ్య లాంటి గొప్ప దేశభక్తులు.. ఎస్.జానకి లాంటి మహా గాయనీమణులు.. ఇలా ఎందరెందరో మహనీయులు, చరితార్థులు గుంటూరు నగరంలో పుట్టినవారే. అలాంటి గుంటూరు గొప్పతనాన్ని చాటి చెప్పే పాటను కిట్టు విస్సాప్రగడ రాశాడు. 2021 లో వినోద్ అనంతోజు దర్శకత్వంలో వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ సినిమా అందరిని ఇట్టే ఆకట్టుకుంది. ఆ సినిమాలోని కథ, మాటలు, సన్నివేశాలు.. అన్నీ బాగుంటాయి. పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. సినిమా ప్రారంభంలో వచ్చే గుంటూరు పాట అత్యద్భుతం. కిట్టు విస్సాప్రగడ ఉరకలెత్తుతున్న పాటల కెరటం. తన పాటలతో ఉప్పెనలాగా దూసుకువస్తున్నాడు. నేటి మేటి గీతరచయిత. ఆయన రాసిన అన్ని పాటలూ సాహిత్యపు విలువలతో భాసిస్తాయి. ఈ పాట కూడా చాలా చాలా బాగా రాశాడు.
సినిమా కథ పరంగా చూసినట్లయితే.. హీరో అతని మిత్రుడు గుంటూరు పట్టణంలో బండిపైన తిరుగుతుంటారు. వాళ్ళు ఏదో అత్యవసరపని మీద ఒక షాప్‌కి వెళుతుంటారు. అప్పుడే తెల్లారుతుంది. గుంటూరు నగరం సూర్యకిరణాల వెలుగులతో కాంతివంతంగా కనబడుతుంటుంది. వైభవంగా ప్రకాశిస్తుంటుంది. ఆ సమయంలో వచ్చే పాట ఇది.
తెల్లారిందో లేదో.. ఊరంతా ముస్తాబై కనబడుతుంది. కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరే గుంటూరు. చారిత్రక వైభవం కలిగిన నగరమది. ఆధునికత తొణికిసలాడే గొప్ప గొప్ప భవనాలు కూడా ఉన్నాయి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు అన్నీ గుంటూరులో కనబడతాయి. అన్ని కులాలు వాళ్ళు, జాతులవాళ్ళు, మతాలు, తెగలు.. ఇలా అందరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటారు. ఐకమత్యంగా ఉంటారు. అంతే కాదు.. కక్షలు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు కూడా పెంచుకుంటారు. స్నేహముంది. మోసముంది.. అన్నీ కలగలిసిన నగరం గుంటూరు నగరం.
అలాంటి నగరం ఎప్పుడూ రద్దీగా కనబడుతుంది. రద్దీలో ఎప్పుడు యుద్ధాలే.. గొడవలే. స్కూల్‌కి టైమవుతుందని, ఆఫీస్‌కి వెళ్ళాలని, ఏదో పని ఉందని.. ఇలా జనమంతా హడావుడిగా రోడ్డుమీదికి వచ్చినవాళ్ళే.. రద్దీలో గొడవలు పడేవాళ్ళే. ఎవ్వరూ తగ్గరు. నేను ముందంటే నేను ముందు. అందరికీ ఆరాటం, బతుకుకై పోరాటం.. ఇలా మరపురాని నగరంగా గుంటూరు నగరం దర్శనమిస్తుంటుంది.
అందరూ పొట్టపోసుకుని బతికేవాళ్ళే. బండిపై వస్తువులు పెట్టి అమ్ముకునేవాళ్ళు, దుకాణాల్లో తక్కువరేటుకు వస్తువులు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మే వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, కొబ్బరికాయల కొట్టువాళ్ళు..ఇలా ఎన్నో వ్యాపారాల వాళ్ళుంటారు. రోజంతా ఎండలో ఉండి.. వస్తువులు అమ్మి అమ్మి.. తిరిగి..తిరిగి.. వాళ్ళ చొక్కాలు చెమటలతో తడిసిపోతుంటాయి. రోజంతా పనిచేసి అలసి ఇంటికి వెళుతుంటారు. మళ్ళీ తెల్లారగానే యుద్ధం మొదలవుతుంటుంది.
ఇలా ఎన్నో సరదాలతో, కోపాలతో, తాపాలతో గుంటూరు నగరం కనబడుతుంది. గుంటూరు అంటేనే కారానికి స్పెషల్.. గుంటూరు కారం అనే పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయింది. అందుకే గుంటూరు మంచిగా ఉంటే మమకారాలు పంచుతుంది. కొట్లాటకు వస్తే కారాలు నూరుతుంది. వ్యాపారాలు సాగే దారుల్లో బేరాలాడుతూ జనం వస్తువులు కొనడం చూస్తుంటాం. ఖరీదైన వస్తువులు, చౌకధర కలిగినవి..ఇలా ఎన్నెన్నో మన కంటికి కనబడుతుంటాయి.
గుంటూరులో ప్రతి వీధి విశేషమే. ప్రతి దుకాణం స్పెషలే. నోరూరించే మిర్చి, బజ్జి అడుగడుగునా కనబడుతుంటాయి. దారం నుంచి చీరలు, సారెలు దాకా…అన్నీ పట్నం బజారులో దొరుకుతుంటాయి. గుంటూరుకు దగ్గర్లో ఉన్న పల్లెటూరు వాళ్ళంతా వచ్చి ఎన్నో సరుకులు కొనుక్కొని వెళుతుంటారు. మనల్ని రమ్మని గాలం వేసి మరీ ఆ పట్నం బజారు పిలిచిందా? అన్నట్టుగా అనిపిస్తుంటుంది. అన్ని సరుకులు, వస్తువులు అక్కడ దొరుకుతాయి. అలాగే.. పులిహోరకు, వేడి వేడి దోసకు కేరాఫ్ అడ్రస్ బ్రాడీపేట. సుబ్బానిమామ అయితే బిర్యానికి స్పెషల్.. గుంటూరులోని ఆరవలైనులో వంకాయ బజ్జి దొరుకుతుంది. బృందావనం హోటల్‌లో గోంగూర చికెను ప్రత్యేకంగా చేస్తుంటారు. రోజూ ఎంతోమంది వచ్చి తింటుంటారు. సంగడి గుంటలో మసాల ముంల స్పెషల్.. కొత్తపేటలో మాల్ పూరి.. లక్ష్మీపురంలో చిట్టి ఇడ్లీ, మూడువంతెనల దగ్గర చెక్క పకోడీ వేడివేడిగా చేసిస్తారు. పొడికారంలో నెయ్యి వేసి పెడుతుంటే నోరు అద్భుతమైన రుచుల నిలయంగా మారిపోతుంది. ఇలా ఇన్ని రుచికరమైన వంటలకు, ఆహార పదార్థాలకు గుంటూరులోని ప్రతి వీథి చిరునామాగా నిలుస్తుంది. ఇన్ని తిన్నాక గుటక పడకపోతే, అరగకపోతే సబ్జా గింజలతో చేసిన సోడా దొరుకుతుంది. అది తాగితే హాయిగా అరుగుతుంది. ఇలా ప్రతి చోటా.. ప్రతి దారిలోనా నోరూరే పదార్థాలే. ఇది లేదు అనే మాట రాదు గుంటూరులో. అడిగిందే వెనువెంటనే దొరుకుతుంది. తనివితీరని సరదాలకు, సంతోషాలకు చిరునామా గుంటూరే. గుంటూరు వెళ్ళి మన సరదాలను తీర్చుకుందామంటున్నాడు కవి.
గుంటూరు నగర విశిష్టతను, ప్రఖ్యాతిని ఈ పాటలో ఎంతో గొప్పగా చెప్పాడు కిట్టు విస్సాప్రగడ. గుంటూరు నగరాన్ని చూడని వాళ్ళకైనా వెంటనే చూసేయాలనిపిస్తుంది ఈ పాట వింటే. గుంటూరు నగరంలో ఉంటున్న వాళ్ళకి చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ పాట వింటే.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682