Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్‌పీఈ యాక్ట్‌ను పునరుద్ధరించాలి

ఎస్‌పీఈ యాక్ట్‌ను పునరుద్ధరించాలి

- Advertisement -

లేబర్‌ కోడ్‌లను రద్దుచేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి : టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.భానుకిరణ్‌
లేబర్‌ కమిషనరేట్‌ ముందు ధర్నా

నవతెలంగాణ – ముషీరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయడంతోపాటు సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌(ఎస్‌పీఈ) యాక్ట్‌ను పునరుద్ధరించాలని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌ (టీఎంఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.భాను కిరణ్‌ అన్నారు. లేబర్‌ కోడ్స్‌ రద్దు, ఎస్‌పీఈ యాక్ట్‌ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రెజెంటేటీవ్స్‌ యూనియన్‌ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ.రాజుభట్‌ అధ్యక్షతన చిక్కడపల్లి లోని కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భానుకిరణ్‌ మాట్లాడుతూ.. లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌పీఈ యాక్ట్‌ను పునరుద్ధరించే వరకు టీఎంఎస్‌ఆర్‌యూ సభ్యులందరూ సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మెడికల్‌ రిప్రజెంటేటీవ్స్‌ హక్కుల పరిరక్షణకు భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి ఏ.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎస్‌పీఈ యాక్ట్‌ను పోరాడి సాధించుకుంటామని, భవిష్యత్‌లో జరిగే పోరాటాల్లో టీఎంఎస్‌ సర్వీస్‌ సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌పై అధిక పని భారం మోపుతూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పని గంటలు, టార్గెట్లు, ఉద్యోగ భద్రత, వేతనాలు వంటి అంశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ పరిస్థితులకు ముగింపు పలకాలంటే ఎస్‌పీఈ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ధర్నాలో యూనియన్‌ కోశాధికారి దుర్గాప్రసాదరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏఎన్‌.చారి, జగదీశ్వర చారి, లోకేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌ కార్యదర్శి రాజ్‌ కుమార్‌, కూకట్‌పల్లి కార్యదర్శి జి.కిషోర్‌, సికింద్రాబాద్‌ కార్యదర్శి టివి.సతీష్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజ్‌, ఐఎఫ్‌టీయూ నాయకులు పద్మ, విజయ్, ఏఐఎఫ్‌టీయూ నాయకులు మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -