Saturday, January 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమరో ఇద్దరికి స్పీకర్‌ క్లీన్‌చిట్‌

మరో ఇద్దరికి స్పీకర్‌ క్లీన్‌చిట్‌

- Advertisement -

ఇంకా ముగ్గురిపై కొనసాగనున్న విచారణ
దానం రాజీనామా తప్పదా ?

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఒకరోజు ముందే తీర్పు ప్రకటించారు. ఇంకా ముగ్గురిపై విచారణ కొనసాగుతున్నది. మొత్తం పది మంది శాసన సభ్యులకుగాను స్పీకర్‌ ఇప్పటికే ఏడుగురికి అనర్హత విషయంలో క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టయింది. పార్టీ మారినట్టు ఏలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వారంతా బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నట్టు తీర్పులో పేర్కొన్నారు. ఈ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో రాజకీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ రోజైన గురువారం పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్యపై బీఆర్‌ఎస్‌ అనర్హత పిటిషన్లను స్పీకర్‌ తిరస్కరించారు.

పార్టీ మారినట్టు ఆధారాల్లేవనీ, వీరిద్దరిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్టు ఆయన తేల్చారు. అలాగే ఇంతకుముందు ఐదుగురిపై కూడా స్పీకర్‌ ఇలాంటి నిర్ణయమే తీసుకున్న విషయం తెలిసిందే. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కాలే యాదయ్య తదితరులు 2024 లో కాంగ్రెస్‌లో చేరినట్టు బీఆర్‌ఎస్‌ ఆరోపించిన విషయం విదితమే. అంతేగాక వీరిపై బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. తాజాగా శుక్రవారం మరో రెండు వారాల సమయం ఇస్తూ సుప్రీం ఆదేశాలిచ్చింది.

దానంపై వేటు తప్పకపోవచ్చు !?
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పకపోవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. దానం పార్టీ మారడమేగాక సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున లోక్‌సభ బరిలో నిలిచి ఓడిపోయారని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆయన పరిస్థితి ప్రస్తుతం అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకున్న దానం నాగేందర్‌, ఇప్పుడు పదవీగండాన్ని ఎదుర్కొంటున్నారు. అలాగే కడియం శ్రీహరి సైతం తన కూతురు కడియం కావ్య వరంగల్‌ నుంచి ఎంపీగా పోటీ చేసిన సందర్భంగా ఆమె నామినేషన్‌ పత్రంలో సంతకం పెట్టారు. ఇది కూడా ఆయన పదవికి ముప్పుతెస్తుందనే ప్రచారం రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా జరుగుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -