బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫొటోలు, వీడియోలు కండ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమని తెలిపారు. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్‌చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమేనని తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ ఉప ఎన్నికలంటే భయపడుతున్నట్టు అర్థమైపోయిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం వణికిపోతున్నట్టు తేలిపోయిందని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. పట్టపగలే పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.



