కార్పొరేట్ మతతత్వ రాజకీయాలపై సుద్దాల అశోక్ తేజ
ప్రజల తిరుగుబాటు, ధిక్కార స్వరమే స్ఫూర్తి
కనుల పండుగగా ‘శ్రామిక ఉత్సవ్’
విశాఖ : శ్రామిక జన సంస్కృతిపై మనువు విసిరిన బల్లెంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ మతతత్వ రాజకీయాలను ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అభివర్ణించారు. సీఐటీయూ మహాసభ సందర్భంగా సోమవారం సాయంత్రం విశాఖ సాగర తీరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వెనుకగల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘స్త్రీ, పురుష సమానత్వం’ అనే థీమ్‌తో జరిగిన ‘శ్రామిక ఉత్సవ్’ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్వేగ భరితంగా మాట్లాడిన ఆయన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు అమలుచేస్తున్న విఛ్చిన్నకర పోకడలను కవితాత్మకంగా, తీవ్రంగా విమర్శించారు. మానవాళి మనుగడకు కీలకమైన భూగోళం పుట్టుకలోనే భిన్నత్వం ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘భూగోళ మట్టిలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉంది. మనల్ని మాత్రం ఏక మత గుత్తాధిపత్యంలో మగ్గమంటున్నారు. ఇది చెల్లదు’ అని చెప్పారు. ఈ మాటలు అన్నందుకు కొన్ని శక్తులు దాడులు చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు.
‘నేడో, రేపో, ఆ మర్నాడో ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే, అటువంటి వాటికి ప్రజా కవులు, రచయితలు భయపడరు, వెనకడుగు వేయరని అన్నారు. అణచివేతపై ప్రజల తిరుగుబాటు, ధిక్కార స్వరమే ప్రజా రచయితలకు స్ఫూర్తినిస్తుందని, తనకు కూడా అంతేనని చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఏండ్ల తరబడి చేస్తున్న పోరాటాన్ని ఆయన ప్రస్తావించారు. తాను రాసిన ‘ఎవడురా అమ్మేది… ఎవడురా కొనేది’ పాటకు ఆ కార్మికుల పోరాటమే స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఆ పోరాటానికి సంబంధించిన అనేక విషయాలను సీఐటీయూ ఏపీ నేత సిహెచ్ నర్సింగరావు తనకు మూడు రోజుల పాటు వివరించారని చెప్పారు. ప్రజల తిరుగుబాటు, శ్రమజీవులు, మహిళల ధిక్కార స్వరాలనే అక్షరాలుగా మలచి తను ఎన్నో పాటలు రాసినట్లు తెలిపారు. సమాజంలో జరిగే దోపిడీ, పీడనలపై ప్రజా కవులు కచ్చితంగా స్పందిస్తారని అన్నారు. మిగతా కవుల్లో ‘సిరా’ మాత్రమే ఉంటుందని, ప్రజాకవుల్లో మాత్రమే రక్తం, చెమట సిరాగా మారి పాటైనా, గేయమైనా బయటకొస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన బాల్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.



