ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలి
మహిళలకు నగదు బదిలీ పెంచాలి
భారత్‌పై ప్రపంచ బ్యాంక్ ఒత్తిడి
స్వాగతించిన కేంద్రం
న్యూఢిల్లీ : భారత్‌లో ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేయాలని ప్రపంచ బ్యాంక్ ఒత్తిడి చేస్తోంది. వృద్ధి పేరిట ప్రయివేటు రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని షరతులను విధిస్తోంది. వచ్చే 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే ఆర్థిక సేవల రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టాలని ప్రపంచ బ్యాంక్ తన ‘ఫైనాన్షియల్ సెక్టార్ అసెసమెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌ఎస్‌ఏపీ)’ రిపోర్ట్‌లో ఆదేశాలు జారీ చేసింది. భారత్ ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా మౌలిక వసతులను కలిగి ఉందని పేర్కొంది. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు విస్తృతమైన ఆర్థిక సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఎపి అనేది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్‌ల ఉమ్మడి కార్యక్రమం. ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు ఎఫ్‌ఎస్‌ఏపీ పేరుతో ప్రపంచ దేశాల్లో ప్రయివేటీకరణను వేగవంతం చేయడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తాయి. భారత్‌లో ప్రయివేటు మూలధన సేకరణను పెంచేందుకు ఆర్థిక రంగ సంస్కరణలకు మరింత ఊతమివ్వాలని ప్రపంచ బ్యాంక్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
బ్యాంక్ ఖాతాల వినియోగాన్ని, ముఖ్యంగా మహిళల్లో మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. అంటే విద్యా, వైద్యం, అహారం తదితర రంగాల్లోనూ నగదు బదిలీ పెంచడం ద్వారా ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేయాలని ప్రధాన ఉద్దేశ్యంగా స్పష్టమవుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగ భాగస్వామ్యాలు (పీపీపీ) పెరగాలని సూచించింది. బ్యాంక్‌లు, బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు నియంత్రణ, పర్యవేక్షణ నిబంధలను కఠినతరం చేయాలని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. వీటిపై మరింత మెరుగైన పర్యవేక్షణ కోసం క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ నియమావళిని మరింత బలోపేతం చేయాలని పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో భారత ఈక్విటీ, ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లు తదితర క్యాపిటల్ మార్కెట్ జిడిపిలో 144 శాతం నుంచి 175 శాతానికి పెరిగాయని.. ఇందుకు క్యాపిటల్ మార్కెట్లోని మౌలిక వసతులు, భారీగా పెరిగిన మదుపరులు వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయని పేర్కొంది. మూలధన సమీకరణకు మరింత దోహదపడేలా రుణ విస్తరణ వ్యవస్థ అభివృద్ధి, రిస్క్ షేరింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటైజేషన్ వేదికను అభివృద్ధి చేయాలని వరల్డ్ బ్యాంక్ నివేదిక సూచించింది.
తలాడించిన ఆర్థిక శాఖ
ప్రపంచ బ్యాంక్ ఆదేశాలకు కేంద్రం తలాడించింది. ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (ఎఫ్‌ఎస్‌ఎపి) 2024 నివేదికను అధికారికంగా స్వాగతిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘ప్రపంచ బ్యాంక్ ఈ అంచనా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మార్గదర్శకంగా ఉంటుంది.’ అని పేర్కొంది.



