– మహిళలపై దాడులు, అణచివేత తీవ్రతరం
– కార్పొరేట్ మీడియాను నియంత్రిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్
– ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ చొరబాటు
– విభజించి పాలించు నినాదంతో బీజేపీ ముందుకు
– ఇలాంటి తరుణంలో పోరాటాల తీవ్రతను పెంచాలి
– 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు : ఐద్వా నూతన ప్రధాన కార్యదర్శి కనినిక బోస్ ఘోష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో వేగంగా మనువాద భావజాల వ్యాప్తి విస్తరణ జరుగుతున్నదనీ, ఈ నేపథ్యం లోనే మహిళలపై దాడులు పెరగడంతో పాటు అణచివేత తీవ్రతరమవుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) నూతన ప్రధాన కార్యదర్శి కనినిక బోస్ ఘోష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లేబర్‌కోడ్‌లు తీసుకురావడాన్నీ, నరేగా చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్నీ, రైతాంగ చట్టాలను మార్చడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమ్మెలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని మల్లు స్వరాజ్యం వేదిక(ఆర్టీసీ కళ్యాణమండపం ఆడిటోరియం)లో 14వ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహాసభలు ముగిశాయి. నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ప్రతి నిధులనుద్దేశించి కనినిక బోస్ ఘోష్ మాట్లా డారు. కార్పొరేట్ మీడియాను ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తున్నదనీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నవారిని జొప్పిస్తు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా అంటేనే సర్వమత సమ్మేళనం అనీ, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల పేరిట ప్రజలను విభజించి పాలించు నినాదంతో బీజేపీ ముందుకెళ్తున్నదని విమ ర్శించారు. మరోవైపు రాజకీయ, ఆర్థిక, మత విషయాల పరంగా మహిళపై జరుగుతున్న అణచివేత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రోజురోజుకీ నిరుద్యోగ సమస్య తీవ్రమ వుతున్నదని వాపోయారు. అదే సమయంలో ప్రజల హక్కుల మీద దాడి జరుగుతున్న తీరును వివరించారు. న్యాయవ్యవస్థలోనూ రాజకీయ జోక్యం పెరిగిపోతున్న తీరుపైనా, అఖ్లాక్, రోహిత్ వేముల, ఉమేర్ ఖాలిద్, దేశవ్యాప్తంగా తదితర వ్యక్తులపై జరిగిన దాడులను ప్రస్తావించారు. ఇలాంటి తరుణంలో లౌకికతత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలో పోరాటాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
అందరికీ విద్య, వైద్యం అందివ్వాలి… సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనే నినాదాలతో ఐద్వా లక్ష్య సాధన దిశగా బలమైన పోరాటాలు రూపొంది స్తామని హామీనిచ్చారు. తెబాగ, పునప్ర- వాయలార్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో ముందుంటామన్నారు. ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కమిటీకీ, ఆహ్వానసంఘానికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.



