– ఉపాధి హామీ బలహీనపరిచే ప్రయత్నాలు, హామీల అమలులో విఫలం
– ఆర్. వెంకట్రాములు
నవతెలంగాణ – కామారెడ్డి : దేశ ప్రజలను రోడ్డున పడేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలనే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలకు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ జెండా ఆవిష్కరించగా, అనంతరం సంఘం అమరవీరులకు సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచి ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. చట్టం పేరును మార్చడం కూడా అదే చర్యలో భాగమని విమర్శించారు. దేశ సంపదలో సగం భాగాన్ని ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పథకానికి తగిన నిధులు కేటాయించకుండా కేంద్ర బాటలోనే నడుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఇవ్వడం, పేదలు వేసుకున్న గుడిసెలకు హక్కు పత్రాలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు ఉత్సాహంగా సాగుతున్నాయని, రాష్ట్ర కమిటీ వాటిని అభినందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, రైతు సంఘం నాయకులు దశరథ్, మోహన్, పేరం నర్సవ్వ, ప్రవీణ్, బాల్ సింగ్ నాయక్, వెంకట్ రమణ, కమల తదితరులు పాల్గొన్నారు.



