ఆయిల్‌ఫామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలనే విజ్ఞప్తి విస్మరణ
పసుపు బోర్డుకు నిధుల కేటాయింపు నిల్
కొకొనట్ బోర్డు ఏర్పాటు ప్రకటనే లేదు
ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఆయిల్ సాగును ప్రోత్సహించేందుకుగానూ ఆయిల్‌ఫామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలనే విజ్ఞప్తిని, కోట్లాది మంది రైతుల ఆశలను మోడీ సర్కారు పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సింది పోయి దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం, అలాగే పసుపును హై వ్యాల్యూ క్రాప్‌గా గుర్తించకపోవడం తెలంగాణ పసుపు రైతులకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొన్నారు.
కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయమై కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతాంగానికి మరో ఎదురుదెబ్బగా మారిందని తెలిపారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు రైతులపై మరింత భారం మోపనున్నాయని వాపోయారు. రైతులకు కనీస మద్దతు ధరల హామీ చట్టం తీసుకురావడంలో మరోమారు విఫలమైందని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కేంద్ర బడ్జెట్‌లోని ప్రధాన లోపమని ఎత్తిచూపారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో తెలంగాణకు వచ్చే నిధుల్లో కోత విధించడం రాష్ట్రానికి తీరని అన్యాయం అని స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమైందనీ, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



