– నిండుకుండల్లా రిజర్వాయర్లు
– మునిగిన లోతట్టు ప్రాంతాలు
– జలమయమైన రహదారులు
– శ్రీశైలం వద్ద రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
– భద్రాచలంలో పెరుగుతున్న నీటిమట్టం
– పొంచిఉన్న మున్నేరు ముంపు ముప్పు
– హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
నవతెలంగాణ-విలేకరులు
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలన్నీ అతలాకుతలం అయ్యాయి. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. మురికి కాలువలు, డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వరదనీరు భారీగా ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి ఇక్కడి నీటిమట్టం 22 అడుగులకు చేరింది. గత వారం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకోగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటి నుంచి క్రమంగా మళ్లీ తగ్గిన గోదావరి ఇప్పుడు మళ్లీ పరవళ్ళు తొక్కుతోంది. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాద్రి రామాలయం వద్ద ఉన్న ప్రధాన స్లూఈజ్‌ను పరిశీలించారు. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, యాత్రీకులు స్నానాల ఘాట్ వద్దకు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. దీనితో ఇక్కడి నుంచి నీళ్లను దిగువకు విడుదల చేస్తున్నారు. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరడంతో, భద్రాచలం వద్ద మరో రెండ్రోజులపాటు గోదావరిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నదని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
నిండుకుండల్లా ప్రాజెక్టులు
ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ భారీగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. వాటిలో జలకళ ఉట్టిపడుతోంది. నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదిలాగే కొనసాగితే మరో మూడ్రోజుల్లో నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, గురువారం రాత్రికి 577 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 1,21,400 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సాగర్ కుడికాలువ ద్వారా 511 క్యూసెక్కులు, ఎడుమ కాలువ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 3,972 క్యూసెక్కులు, ఎస్‌ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు మొత్తంగా 6,283 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 1,01,785 క్యూసెక్కుల మీరు వస్తుండగా శ్రీశైలం డ్యామ్ రెండు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద తగ్గడంతో గేట్లను మూసివేశారు. జూరాల సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా 8.9 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లోÛ్ల 57 వేల క్యూసెక్కులు వస్తుండగా విద్యుత్ కోసం 38,803 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. నెట్టెంపాడుకు 750, బీమాకు 650, కోయిల్‌సాగర్‌కు 315, కుడి కాలువకు 820, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు మొత్తం 42,134 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు
ఖమ్మం నగరంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రానికి 9 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఖమ్మం కాలువొడ్డు- నాయుడుపేట మధ్య తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చప్టాపై నుంచి నీరు ప్రవహిస్తోంది. వరదను అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర రాజధానిలో…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం రాత్రి నుంచి ముసురు పట్టింది. గురువారం సాయంత్రానికి కుంభవృష్టిని తలపించింది. రహదారులన్నీ జలమయమై, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మియాపూర్, మాదాపూర్, టీహబ్, నాలెడ్జ్ సిటీ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
జిల్లాల్లో…
నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలంలో కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ఇండ్లు కూలిపోవడంతో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండి అలుగుపారు తున్నాయి. పాకాల సరస్సుకు వరద నీరంతా చేరడంతో నిండుకుండలా మారింది. హనుమకొండ జిల్లా పరకాలలో చలివాగు అలుగుపోస్తుంది. పంటపొలాలు నీట మునిగాయి. చత్తీస్‌గఢ్, ఒడిశాతో పాటు తెలంగాణలోనూ కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లలోకి వరదనీరు చేరుతోంది. మరో రెండ్రోజులు ఇలాగే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద
హైదరాబాద్‌లో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట)కు వరద కొనసాగుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. ప్రస్తుతం హిమాయత్‌సాగర్ జలాశయానికి 300 క్యూసెక్కుల వరద చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. గురువారం సాయంత్రానికి 1761.05 అడుగులకు చేరింది. మరో రెండు అడుగుల మేర వరద చేరితే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. ప్రస్తుతానికి ఈసీ వాగులో వరద ప్రవాహం భారీగానే కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్ జలాశయానికి కూడా వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం జలాశయానికి 100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు కాగా.. గురువారం సాయంత్రానికి 1782.80 అడుగులకు చేరింది.
అప్రమత్తంగా ఉండండి
– లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి
– ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి : కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం సీఎంవో అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నివారణ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు, అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలన్నారు. ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
రాష్ట్రాన్ని వీడని ముసురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES