Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రానికి దక్కింది గుండుసున్నా...

రాష్ట్రానికి దక్కింది గుండుసున్నా…

- Advertisement -

– కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీల వైఫల్యం
– రాష్ట్రానికి మరోసారి మోడీ సర్కార్‌ రిక్తహస్తం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు.. మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎంపీలు… ఇంతమంది ఉన్నా, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా. వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు నిధుల్లేవు.. విభజన హామీల ఊసే లేదు… కొత్త ప్రాజెక్టులు లేవు.. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధుల్లేవు.. వెరసి ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం మరోసారి రిక్తహస్తాన్నే చూపింది. తెలంగాణకు అక్కడి నుంచి నిధులు తెప్పించటంలో ఇటు బీజేపీ ఎంపీలు విఫలమైతే.. పార్లమెంటులో మోడీ సర్కార్‌ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగట్టడం ద్వారా రాష్ట్రానికి చాలినన్ని నిధులు వచ్చేలా చూడటంలో అటు కాంగ్రెస్‌ ఎంపీలు ఫెయిలయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తులు చేసినా వారు పట్టించుకోలేదు. వాస్తవానికి 2014లో మోడీ సర్కార్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంపై వివక్ష కొనసాగుతూనే ఉంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు ట్రిబుల్‌ ఐటీ, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. అయినా కేంద్రం మనసు కరగలేదు సరికదా.. జీఎస్టీలో మన వాటాగా రావాల్సిన నిధులను సైతం సక్రమంగా విడుదల చేయకుండా కొర్రీలేయటం పరిపాటిగా మారింది. తెలంగాణ అవసరాలు, అభివృద్ధి పథకాల అమలుకు వీలుగా నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వినతులను మోడీ సర్కారు బుట్టదాఖలు చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయాలంటూ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. కొత్త రైల్వే లైన్లు, జాతీయ రహదారుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సహకరించాలంటూ కోరినా కేంద్రం పెడచెవిన పెట్టటం గమనార్హం. ఇలాంటి అంశాలన్నింటిపై దృష్టి సారించి, కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి చెందిన మిగతా ఎంపీలు కూడా పార్లమెంటులో ఈ అంశాలను ఏనాడూ ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు సైతం ఇలాంటి అంశాలను లోక్‌సభ, రాజ్యసభలో లేవనెత్తటం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఢిల్లీ, హైదరాబాద్‌ల్లోని అధికార పార్టీలు తమ పాత్రను పూర్తిగా విస్మరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -