ప్రారంభించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షిషా
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఉర్దూ అకాడమి చైర్మెన్ తాహెర్‌బిన్ హందన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌తో కలిసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడా స్ఫూర్తికి చిహ్నమైన క్రీడాజ్యోతిని వెలిగించి, పోటీలను అధికారికంగా ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని అతిథులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులు ఓటమికి కుంగిపోకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. క్రీడాకారుల సౌకర్యార్థం స్టేడియంలో గతంలో ఉన్న వసతుల లేమిని గుర్తించి, తన వంతుగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్టు తెలిపారు.
మెరుగైన వసతులు ఉన్నప్పుడే క్రీడాకారులు ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేసి పథకాలు సాధించగలరని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి గొప్ప వేదికలని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ స్నేహపూర్వక వాతావరణంలో పోటీ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సారంగపాణి, జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, కార్యదర్శి రాజేష్, డీవైఎస్‌ఓ శ్రీనివాస్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్దన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ మల్లెపూల నర్సయ్య, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, వివిధ జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



