Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగిన ఆటో చక్రాలు

ఆగిన ఆటో చక్రాలు

- Advertisement -

సీఎన్‌జీ గ్యాస్‌ కొరత
వారంలో రూ.30 పెంచిన ప్రయివేట్‌ కంపెనీలు
గంటల కొద్దీ పెట్రోల్‌ పంపుల వద్ద క్యూ
జీవనోపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు
రోజుకు రూ.300 గిట్టుబాటు కాని వైనం
ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్న కార్మికులు

అంతర్జాతీయంగా ఎక్కడా సంక్షోభం వచ్చినా దాని ప్రభావం ముందు సామాన్యుడు ఎదుర్కొవాల్సిందే.. ఇరాన్‌, ఆమెరికా, ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం రోజు కూలీ-నాలీ చేసుకుని పూట గడుపుకునే పేదోడిపై పడుతోంది. అక్కడ యుద్ధంతో ఇక్కడ ప్రజలు ఆకలి కేకలతో ఆలమటిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్‌ కొరతతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. సీఎన్‌జీ గ్యాస్‌ కొరతతో ఆటో చక్రాలు ఆగాయి. దాంతో ఆటో కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. గ్యాస్‌ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో కార్మికులపై కథనం.

నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రజలు ఎక్కువగా ట్రాన్స్‌పోర్టు రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఐటీ కారిడార్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌, హెల్త్‌ హబ్‌ ఉండటంతో ఇక్కడ ఆటో కార్మికులకు మంచి ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంతంలో కేవలం రంగారెడ్డి జిల్లా ప్రజలు మాత్రమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఉపాధి కోసం వచ్చిన నిరుద్యోగులంతా ఈ రంగంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో సీఎన్‌జీ గ్యాస్‌తో నడిపించే ఆటోలు సుమారు 50 వేల వరకు ఉన్నాయి.

వివిధ రకాల క్యాబ్‌లు, వాహనాలు సీఎన్‌జీతో నడిచేవి మరో 50 వేలకు పైగా ఉన్నాయని సమాచారం. క్యాబ్‌లు ఎక్కువగా ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులను తీసుకెళ్లడం, ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌ కు తీసుకువచ్చేందుకు నడుస్తుంటాయి. అయితే వారం రోజులుగా అంతర్జాతీయంగా క్రుడాయిల్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఆటో, క్యాబ్‌లపై పడింది. వారం రోజుల కింద సీఎన్‌జీ గ్యాస్‌ ధర రూ.63 ఉంటే.. ప్రస్తుతం ప్రయివేటు పంపుల్లో రూ.93కు పెంచారు. కేజీ సీఎన్‌జీ మీద సుమారు రూ.30 పెరిగింది. దాంతో ఆటో కార్మికులు ఆటోలు నడిపించలేని పరిస్థితి ఏర్పడింది.

గంటల కొద్దీ నిరీక్షణ
సీఎన్‌జీ గ్యాస్‌ ఫిల్‌ చేయించుకోవడానికి పెట్రోల్‌ పంపుల వద్ద ఉదయం 5 గంటలకు వెళ్లి క్యూలో ఉంటే తమ సీరియల్‌ వచ్చే పరిస్థితి లేదు. తమ లైన్‌ వచ్చే వరకు గ్యాస్‌ దొరుకుతుందో లేదో అనేది స్పష్టత లేక ఆటో డ్రైవర్లు ఆందోళన పడుతున్నారు. అయితే పెట్రోల్‌ పంపుల్లో కూడా గ్యాస్‌ సరిపడా లేకపోవడంతో.. సిలిండర్‌ ఫిల్‌ చేసే క్రమంలో ఎక్కువ ప్రెషర్‌తో ఫిల్‌ చేసే పరిస్థితి లేక ఆటో డ్రైవర్లు ఉదయం, సాయంత్రం పెట్రో పంపుల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. అయితే అన్ని చోట్ల సీఎన్‌జీ గ్యాస్‌ లేదు. దాంతో ఆటోలు, వివిధ రకాల వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి.

టైమ్‌ ప్రకారం పంపులు ఓపెన్‌
గ్యాస్‌ ఫిల్‌ చేసుకోవడానికి పెట్రోల్‌ పంపులు టైమ్‌ ప్రకారం మాత్రమే ఓపెన్‌ చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు ఓపెన్‌ చేస్తే ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత క్లోజింగ్‌ బోర్డు పెడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే ఓపెన్‌ చేస్తున్నారు. అసలు ఈ సమయంలోనే ఆటోలకు గిరాకీ ఉంటుంది. ఆదే సమయంలో పంపులు ఓపెన్‌ చేస్తుండటంతో గిరాకీ దెబ్బతింటుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దోపిడీ చేస్తున్న ప్రయివేటు పంపులు
సీఎన్‌జీ గ్యాస్‌ వారం కింద రూ.63 ఉంటే ప్రస్తుతం ప్రయివేటు పెట్రోల్‌ పంపులు రూ.93కు పెంచేశాయి. రిలియన్స్‌, నాయార, ఇలా అనేక ప్రయివేటు పంపులు ప్రభుత్వం రంగ సంస్థల కంటే సుమారు రూ.25 నుంచి 30 వరకు సీఎన్‌జీ గ్యాస్‌ను విక్రయిస్తున్నాయి. దాంతో ఆటోవాలాలపై ఆర్థిక భారం పడుతోంది. గ్యాస్‌ రేట్లు పెంచడంతో తాము ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గ్యాస్‌ కొరత లేకుండా చూడాలని ఆటో కార్మికులు కోరుతున్నారు.

గంటల కొద్దీ నిరీక్షణ
ఆటో డ్రైవర్‌గా ఏండ్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న. ఎప్పుడూ సుఖంగా బతికిందే లేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య మమ్మల్ని వేధిస్తోంది. స్కూల్‌ పిల్లలను స్కూల్లో వదిలేందుకు మాట్లాడుకున్న.. ఉదయం 7 గంటలకు వెళ్లాలి.. కానీ గ్యాస్‌ లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న. ఉదయం 5 గంటలకు వెళ్లి లైన్‌లో ఉంటే సమయానికి గ్యాస్‌ దొరికే పరిస్థితి లేదు. పిల్లలను సమయానికి స్కూల్లో వదిలిపెట్టలేకపోతున్నా. ప్రభుత్వం ఆలోచన చేయాలి.. గ్యాస్‌ కొరత లేకుండా చేయాలి. -శ్రీకాంత్‌, శివరాంపల్లి ఆటో డ్రైవర్‌

ప్రభుత్వాల నిర్లక్ష్యం ఆటో కార్మికులపై ప్రభావం
ప్రభుత్వాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం సామాన్య ప్రజలపై ప్రభావం పడుతోంది. ఆటో కార్మికుల జీవనం దినదిన గండంగానే ఉంటుంది. దానికి తోడు గ్యాస్‌ కొరత వారి బతుకులను మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెడుతోంది. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి. గ్యాస్‌ సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
-కాలే రాజు, ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌, రంగారెడ్డి జిల్లా కోశాధికారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -