Tuesday, January 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికుల ప్రాథమిక హక్కుల రక్షణకే 12న సమ్మె

కార్మికుల ప్రాథమిక హక్కుల రక్షణకే 12న సమ్మె

- Advertisement -

ప్రజాస్వామ్య సంస్థలపై మోడీ ప్రభుత్వం దాడి
కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు తొత్తుగా కేంద్రం : ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌ కౌర్‌


నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో కార్మిక హక్కులను హరిస్తూ తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు విడనాడాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన జాతీయ కార్మిక, కర్షక సంఘాలు నిర్వహించనున్న సమ్మె మోడీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక కావాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌ కౌర్‌ పిలుపునిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సమావేశాలకు హాజరైన ఆమె.. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల ప్రాథమిక హక్కుల రక్షణకు, దేశ ప్రజాస్వామ్య-లౌకిక స్వరూపాన్ని రక్షించడానికి ఈ సమ్మెకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం చిరు వ్యాపారాలు, వాణిజ్యం, ఉపాధిని అందించే ఎంఎస్‌ఎంఈల బదులుగా విదేశీ కంపెనీలకు రాయితీలు, పరపతి ఇవ్వడంలో బిజీగా ఉందన్నారు. మోడీ పాలనలో పార్లమెంటరీ ప్రక్రియ అపహాస్యంలా మారిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తుందని, భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను ”చట్టబద్ధంగా” రద్దు చేయడానికి ఎన్నికల చట్టం, 2023 ఓ నిదర్శనం అని ఆందోళన వ్యక్తం చేశారు.

పాలక వర్గానికి గుణపాఠం.. సమ్మె
పెట్టుబడిదారులు, కంపెనీ యజమానులకు, కార్పొరేట్లకు తొత్తులుగా మారిన పాలకవర్గానికి ఫిబ్రవరి 12న జరిగే సమ్మె గట్టి గుణపాఠం కావాలని అమర్జిత్‌ కౌర్‌ అన్నారు. దేశంలో అన్ని రంగాల్లోనూ పరిస్థితి దిగజారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను అరికట్టడానికి, బలహీనపరచడానికి, దాడి చేయడానికి, కార్మిక వర్గ ఉద్యమాన్ని నియంత్రించేందుకు నాలుగు లేబర్‌కోడ్‌లను రూపొందించిందని చెప్పారు. లేబర్‌ కోడ్‌లను పార్లమెంటులో ఆమోదించినప్పటి నుంచి దేశ కార్మికులు ఐదు భారీ సార్వత్రిక సమ్మెలను నిర్వహించారని, దీనిలో 25 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని తెలిపారు. లేబర్‌ కోడ్‌లను రద్దు చేయకపోతే కేంద్ర కార్మిక సంఘాలు రంగాల వారీ ఆందోళనతో పాటు సార్వత్రిక సమ్మె వంటి బలమైన ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 65 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, ప్రయివేట్‌ కంపెనీలకు రెగ్యులర్‌ కార్మికులను నిలిపివేయడం, కొత్త పోస్టుల సృష్టిపై నిషేధాన్ని ఎత్తివేయడం తదితర డిమాండ్లను పూర్తిగా విస్మరించారని తెలిపారు.

లేబర్‌ కోడ్‌లతో ఎంప్లాయిమెంట్‌ మెరుగుదల పచ్చి అబద్ధం
ప్రాథమిక సేవలు కుప్పకూలిపోతున్నాయని, కలుషితమైన తాగునీటితో ప్రజలు మరణిస్తున్నారని కౌర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్యం వ్యాపారీకరణ చెందడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. డిమాండ్‌ బేస్డ్‌గా కాకుండా సప్లయ్ బేసుడు విధానాన్ని కేంద్రం ముందుకు తీసుకొస్తోందని, దీని వల్ల అనేక మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్‌కోడ్‌లతో ఎంప్లాయిమెంట్‌ మెరుగుదల అవుతుందనేది పచ్చి అబద్ధమని అన్నారు. కంపెనీ యజమానులకు దోచిపెట్టే విధానమే నాలుగు కార్మిక కోడ్‌లు అని అన్నారు. ఖమ్మం కేంద్రంగా ఈఎస్‌ఐ హాస్పిటల్‌ని నెలకొల్పాలని తెలంగాణ వేజ్‌ బోర్డు మెంబర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్‌ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు, కార్పొరేటర్‌, బీజీ క్లెమెంట్‌ రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు, జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, ఉపాధ్యక్షులు సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -