– ఎస్కేఎంతో కలిసి మండల స్థాయిల్లో భారీ నిరసనలు
– 26 నుంచి ఆగస్టు 5 వరకు క్యూబా సంఘీభావ ప్రచారం
– సంఘీభావ నిధిని సేకరించి క్యూబాకు అందజేత : ఏఐకేఎస్ కేంద్ర కమిటీ నిర్ణయాలు
– వాణిజ్య ఒప్పందాలతో దేశీయ రైతుల జీవనోపాధికి ముప్పు
– వాణిజ్య ఒప్పందంపై అమెరికాకు మోడీ ప్రభుత్వం లొంగిబాటు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జులై 9న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. కేరళలోని కన్నూర్‌లోని ఈకె నయనార్ అకాడమీలో మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) కేంద్ర కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల హక్కుల రక్షణలో పోరాటాలను తీవ్రతరం చేయడానికి, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరోధించడానికి, ప్రస్తుత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పాలన ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి కార్మికవర్గంతో ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి వ్యూహాలపై వివరంగా చర్చించారు.
తొలుత ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశంలోని రైతుల కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గౌరవిస్తూ సభ్యులందరూ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆహ్వాన కమిటీ చైర్మెన్ ఇ. పి. జయరాజన్ స్వాగత ప్రసంగం చేశారు. అశోక్ ధావలే అధ్యక్ష ప్రసంగం చేస్తూ ఉద్యమం ముందున్న కీలకమైన రాజకీయ సవాళ్లను, లక్ష్యాలను వివరించారు. రైతులు, శ్రామిక ప్రజలపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులను సమీకరించాల్సిన అవసరాన్ని, కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సంయుక్తంగా 9న నిర్వహించే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రైతులు, వ్యవసాయ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు.
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ ముసాయిదా నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిణామాలను వివరించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులను పట్టి పీడిస్తున్న తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని విశ్లేషించారు. జులై 9 నాటికి సంతకం చేయనున్న యునైటెడ్ కింగ్‌డమ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ), అమెరికాతో రాబోయే ఒప్పందంపై నివేదిక విమర్శనాత్మకంగా ప్రస్తావిం చారు. ఈ ఎఫ్‌టీఏలు కీలకమైన వ్యవసాయ ఉత్పతు ్తలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గిస్తా యని, కొన్ని సార్లు తొలగిస్తాయని తెలిపారు. ఇది లక్షలాది మంది దేశీయ రైతుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు. ఏఐకేఎస్ కోశాధికారి పి. కృష్ణ ప్రసాద్ లెక్కలు, ఆర్థిక విషయాలకు సంబంధించిన వివరాలను ప్రవేశపెట్టారు.
వాణిజ్య ఒప్పందాలతో దేశీయ రైతుల జీవనోపాధికి ముప్పు
జులై 9న మండల స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా (ఏఐకేఎస్)తో కలిసి భారీ నిరసనలు నిర్వహించాలని, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని వ్యవసాయ సంక్షోభం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను సమావేశంలో చర్చించారు. కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలలోని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వ విధానాలైన కార్మిక చట్టాలు, 12 గంటల పని దినం, భూమి సేకరణ మొదలైన వాటిని ముందుకు తీసుకెళ్తున్నాయని కూడా సమావేశం గుర్తించింది.
రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈ వ్యవస్థాపకుల ప్రయోజనాలను తుంగలో తొక్కి, సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించి, పార్లమెంటును పక్కను పెట్టే యూకే (ఇప్పటికే సంతకం చేసిన), యూఎస్‌ఏ, ఈయూ మొదలైన వాటితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యలను సమావేశం హెచ్చరించింది. ఈ ఒప్పందాలు కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గిస్తాయని, లేదా తొలగిస్తాయని పేర్కొంది. దీనివల్ల లక్షలాది మంది దేశీయ రైతుల జీవనోపాధికి ముప్పు కలుగుతోందని విమర్శించింది.
26 నుంచి ఆగస్టు 5 వరకు క్యూబా సంఘీభావ ప్రచారం
అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా 26 నుంచి ఆగస్టు 5 వరకు క్యూబా సంఘీభావ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. సంఘీభావ నిధిని సేకరించి క్యూబాకు అందజేయాలని సూచించింది. కార్మిక వ్యతిరేక కార్మిక కోడ్ల ఉపసంహరణ, విద్యుత్ ప్రయివేటీకరణ, స్మార్ట్ మీటర్లను ఆపాలి, ఎంఎస్‌పీ, రుణ మాఫీ, భూమి హక్కులు, ఉపాధి హామీ, స్థానిక సమస్యలు వంటి రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై కూడా పోరాడాలని ఈ సమావేశం నిర్ణయించింది.
ప్రజల భద్రతను, వ్యవసాయ భూములను అడవి జంతువుల ముప్పు నుంచి రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని సవరించడానికి బీజేపీ ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండించింది. మానవ ఆవాసాలపై వన్యప్రాణుల దాడులను నిరోధించడానికి విస్తృత స్థాయి ఐక్య కార్యాచరణ బృందాలకు పిలుపునిచ్చింది.
జార్ఖండ్‌లో అఖిల భారత భూ హక్కుల సదస్సు
రాబోయే నెలల్లో రాష్ట్ర స్థాయి భూమి హక్కుల సమావేశాల తరువాత జార్ఖండ్‌లో అఖిల భారత భూ హక్కుల సదస్సు జరుగుతుందని తెలిపింది. రైతు మహిళలు, రైతు యువత రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత నిర్మాణ కన్వెన్షన్ జరుగుతుందని పేర్కొంది. ఏఐకేఎస్ ఒక కొత్త మైలురాయిని దాటిందని, గత ఐదేండ్లుగా తన పరిధిని క్రమంగా పెంచుకున్న తర్వాత, అండమాన్ నికోబార్ దీవులు సహా 27 రాష్ట్రాలలో విస్తరించిందని తెలిపింది. ప్రస్తుతం ఏఐకేఎస్ సభ్యత్వం 1,53,5,100 కు చేరిందని పేర్కొంది.
రైతుల హక్కుల రక్షణకు పోరాటాలు తీవ్రతరం
రైతుల హక్కుల రక్షణకు పోరాటాలను తీవ్రతరం చేయాలని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే పిలుపు ఇచ్చారు. కన్నూర్‌లో జరిగిన భారీ ప్రదర్శన, బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇ.పి జయరాజన్ బహిరంగ సభకు అధ్యక్షత జరిగిన ఈ బహిరంగ సభలో విజ్జూ కృష్ణన్, డాక్టర్ అశోక్ ధావలే, ఎంపీ అమ్రా రామ్, ఏఐకేఎస్ కేరళ అధ్యక్షుడు ఎం. విజయకుమార్, ప్రధాన కార్యదర్శి వల్సన్ పనోలి, సహాయ కార్యదర్శి ప్రకాశన్ మాస్టర్ ప్రసంగించారు.