Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇండ్ల స్థలాలు ఇచ్చేవరకూ పోరాటం

ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకూ పోరాటం

- Advertisement -

ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా
పెద్దఎత్తున పాల్గొన్న వెలుగుమట్ల నిర్వాసితులు
సీపీఐ(ఎం) బృందంతో అదనపు కలెక్టర్‌ చర్చలు
అర్హులందరికీ స్థలాలిస్తామని హామీ
సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉధృతంగా ఆందోళన : సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఖమ్మం అర్బన్‌ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ స్థలాలు, ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట భారీఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సహా వందలాది మంది పాల్గొన్నారు. ధర్నా చౌక్‌లో జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లోని వారి నివాసాల నుంచి పేదలను తొలగించి, ఇప్పటికీ సరైన పునరావాసం కల్పించకపోవడం దారుణమని అన్నారు. నెలల తరబడి నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇంటి స్థలం ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధర్నాలో పాల్గొన్న నిర్వాసితులు తమ సమస్యలను వెల్లడిస్తూ.. తాత్కాలిక షెడ్లలో, అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తున్నామని, పిల్లల చదువులు దెబ్బతిం టున్నాయని, జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ధర్నా చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ ప్రధాన గేటు వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి ఆందోళన నిర్వహించారు. తరువాత సీపీఐ(ఎం) ప్రతినిధి బృందంతో ఖమ్మం అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొత్తం 729 కుటుంబాలు ఇండ్లు కోల్పోయినట్టు గుర్తించామని తెలిపారు. అందులో 300 మందికి ఇప్పటికే ఇండ్ల స్థలాలు కేటాయించామని, మరికొందరికి వారి స్వగ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. అయితే, కేటాయింపుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని, అనర్హులు కూడా లబ్ది పొందిన అంశాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిపై పున్ణపరిశీలన (రీ-ఎంక్వయిరీ) నిర్వహిస్తున్నామని చెప్పారు. 729 కుటుంబాల జాబితాను సీపీఐ(ఎం)కి అందజేస్తామని, అందులో అర్హులు తప్పిపోయి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక నెలలో పూర్తిస్థాయిలో విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్‌ హామీతో నిర్వాసితులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీపీఐ(ఎం) నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి వై.విక్రమ్‌, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్‌, షేక్‌ మీరా సాహెబ్‌, ఎస్‌.నవీన్‌రెడ్డి, మండల కార్యదర్శులు షేక్‌ నాగులు మీరా, బోడపట్ల సుదర్శన్‌, డివిజన్‌ నాయకులు బేగం, భాగం అజిత, ఏవి రెడ్డి, కూచిపూడి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -