Saturday, April 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపోరు ఉధృతం

పోరు ఉధృతం

- Advertisement -

కువైట్‌ చమురు రిఫైనరీలో మంటలు
అమెరికా ఎఫ్‌-35ని కూల్చేశాం : ఇరాన్‌
తదుపరి లక్ష్యాలు బ్రిడ్జిలు, ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ ప్లాంట్లే : ట్రంప్‌ హూంకరింపు
మధ్యప్రాచ్యంలో పాక్షికంగా ధ్వంసమైన అతి పెద్ద బ్రిడ్జి
గల్ఫ్‌లోని ఎనిమిది కీలక వంతెనలు ఐఆర్‌జీసీ టార్గెట్‌

నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
పశ్చిమాసియాలో నెలరోజుల క్రితం మొదలైన యుద్ధం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. ఇజ్రాయిల్‌-అమెరికా, ఇరాన్‌ సేనల మధ్య పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇజ్రాయిల్‌పైనే కాకుండా కువైట్‌, బహ్రెయిన్‌ వంటి గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. కువైట్‌లో ప్రభుత్వ చమురు రిఫైనరీ మినా అల్‌-అహ్మదీపై డ్రోన్లతో ఇరాన్‌ దాడి చేయడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వాటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ తెలిపింది. కువైట్‌లోని డీశాలినేషన్‌ (సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే కేంద్రం) ప్లాంటుపై కూడా ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేసింది.

కాగా అమెరికాకు చెందిన మరో ఎఫ్‌-35 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్‌ ప్రకటించింది. ఈ దాడిలో విమాన పైలట్‌ ప్రాణాలతో బతికి బయటపడే అవకాశాలు లేవని తెలిపింది. ఇరాన్‌ దాడిలో అమెరికా యుద్ధ విమానం కూలిపోవడం ఇది రెండోసారి. అయితే తాజా దాడిపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇదిలావుండగా టెల్‌ అవీవ్‌, ఓడరేవు నగరమైన ఇలత్‌లపై దూర శ్రేణి క్షిపణులతో దాడి చేశామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అబూధాబీలోని హబ్‌షన్‌ గ్యాస్‌ కేంద్రంపై జరిగిన వైమానిక దాడిని అడ్డుకునే క్రమంలో శకలాలు భూమిపై పడ్డాయి. ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఘటన జరిగిన తర్వాత గ్యాస్‌ కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అమెరికా-ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో ఇరాన్‌కు చెందిన క్వెషమ్‌ దీవిలోని ఓ ఓడరేవు దెబ్బతిన్నది. రాయిటర్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రం దీనిని ధ్రువీకరిం చింది. దాడి కారణంగా ఓడరేవులో కార్యకలాపాలు గురువారం తాత్కాలికంగా నిలిచి పోయాయి. పోర్ట్‌ ప్రాంతం నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. మరోవైపు ఇరాన్‌ ప్రతీకార దాడులతో గల్ఫ్‌దేశాల్లో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. సౌదీలో ఉన్న అమెరికాకు చెందిన కీలక రాడార్‌ వ్యవస్థను ఇరాన్‌ దెబ్బతీసింది. మరో ఎఫ్‌..35 విమానా న్ని కూల్చేసింది. అయితే అధి ఎఫ్‌ 35 ఈగా నిర్ధారించారు. పైలెట్‌ను ఇరాన్‌ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఒత్తిడి పెంచుతున్న ట్రంప్‌… లొంగబోమన్న ఇరాన్‌
నయానో భయానో ఒప్పందం కుదుర్చుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇరాన్‌లోని బ్రిడ్జిలు, ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ ప్లాంట్లపై బాంబు దాడులు చేస్తామని బెదిరించారు. ‘ఇరాన్‌లో ఇంకా మిగిలిన ఆస్తులేమైనా మిగిలి ఉంటే వాటిని ధ్వంసం చేసే పనిని మా సైన్యం ఇంకా ప్రారంభించలేదు. తదుపరి లక్ష్యం బ్రిడ్జిలు. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ ప్లాంట్లు’ అంటూ ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఏం చేయాలో ఇరాన్‌ నాయకత్వానికి తెలుసు. ఆ పని చేయడం కూడా తెలుసు. త్వరపడండి’ అని అందులో హెచ్చరికలు చేశారు. బ్రిడ్జి కూల్చివేతపై ట్రంప్‌ సంతోషం వ్యక్తం చేశారు.

‘ముందున్నది మొసళ్ల పండుగ’ అంటూ ఇరాన్‌ నాయకత్వాన్ని బెదిరించే ధోరణితోనే ట్రూత్‌ సోషల్‌లో ఆయన ఆ పోస్ట్‌ పెట్టినట్టు కన్పిస్తోంది. దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్‌ ఆ పోస్టుకు జత చేశారు. ఇలాంటివే మరిన్ని దాడులు జరుగుతాయని హూంకరించారు. ఆలస్యం కాకముందే తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని సుద్దులు చెప్పారు. ఈ ఘటనపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తీవ్రంగా స్పందించారు. ‘పౌర మౌలిక సదుపాయాలపై దాడి చేయడాన్ని చూస్తుంటే గందరగోళంలో ఉన్న శత్రువు ఓటమికి, నైతిక పతనానికి ఈ ఘటన సంకేతంగా కన్పిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేసినంత మాత్రాన ఇరాన్‌ ప్రజలు లొంగబోరని స్పష్టం చేశారు.

హార్ముజ్‌పై పిల్లిమొగ్గలు
హార్మ్ముజ్‌ జలసంధిని తెరవాలంటూ నిన్నటి వరకూ గట్టిగా పట్టుపట్టిన ట్రంప్‌ ఇప్పుడు కొంత మెత్తపడినట్టు తెలుస్తోంది. హర్మూజ్‌ను ఇరాన్‌ మూసివేసినప్పటికీ ఆ దేశంపై సైనిక చర్యను ముగించాలని తాను కోరుకుంటున్నానని ఆయన తన సహాయకులకు చెప్పారని సమాచారం. జలసంధిని బలప్రయోగంతో తెరిపించాలన్న ట్రంప్‌ ప్రతిపాదనను చైనా, రష్యాలు ఇప్పటికే వ్యతిరేకించగా తాజాగా బహ్రెయిన్‌ వాటితో జత కలిసింది. జలసంధిలో చమురు నౌకల సురక్షిత ప్రయాణంపై పర్యవేక్షణ కోసం ఇరాన్‌, ఒమన్‌లు ఓ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి.

అమెరికా వైమానిక బలమే టార్గెట్‌
అమెరికా వైమానిక దళం విజయాలకు కారణమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ విరుచుకు పడుతోంది. గత నెల 27న సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరంపై ఇరాన్‌ జరిపిన దాడిలో అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ-3 సెంట్రీ (ఎయిర్‌ బార్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌) యుద్ధ విమానం దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతకుముందు మార్చి 13న ఐదు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్‌ రీఫ్యూయలింగ్‌ విమానాలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 28న పోరు ప్రారంభమైనప్పటి నుంచి బహ్రెయిన్‌, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈలలోని కనీసం ఏడు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ దాడులు జరిపింది.

ఈ దాడులలో రాడార్‌ వ్యవస్థలు, ఉపగ్రహ కమ్యూనికేషన్స్‌ అండ్‌ మిషన్‌ వ్యవస్థలు, కీలక విమానాలు ధ్వంసమయ్యాయి. ఇవన్నీ మధ్యప్రాచ్యంలో దాడులను పసిగట్టేందుకు, విమానాల రీఫ్యూయలింగ్‌కు, గగనతల దాడులకు అమెరికా దళాలు ఆధారపడుతున్న మౌలిక సదుపాయాలే. యుద్ధ ప్రారంభ సమయంలో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్‌ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ దాడులు జరిపింది. ఖతార్‌, యూఏఈలలోని రాడార్‌ వ్యవస్థలపై దాడులు చేసింది. ఆ తర్వాత క్షిపణి రక్షణకు చెందిన మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయి. సౌదీలోని అమెరికా రాడార్‌ వ్యవస్థపైనా ఇరాన్‌ విరుచుకుపడింది.

కువైట్‌కు బహ్రెయిన్‌ నుంచి డ్రోన్‌ నిరోధక వ్యవస్థ
కువైట్‌ రిఫైనరీపై ఇరాన్‌ దాడి చేసిన నేపథ్యంలో గల్ఫ్‌లో బ్రిటన్‌, కువైట్‌ ప్రయోజనాలను కాపాడే విషయంలో సాయపడాలని బహ్రెయిన్‌ నిర్ణయించింది. కువైట్‌కు రాపిడ్‌ సెంట్రీ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను పంపుతోంది. ఈ వ్యవస్థ తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను కూల్చివేస్తుంది. కువైట్‌ యువరాజు ప్రిన్స్‌ సబహ్‌ అల్‌-ఖలీద్‌ అల్‌ సబహ్‌తో శుక్రవారం ఉదయం బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ టెలిఫోన్‌ సంభాషణ జరిపారు. కువైట్‌ చమురు రిఫైనరీపై జరిగిన ఇరాన్‌ డ్రోన్‌ దాడిని ఆయన ఖండించారు.

పశ్చిమాసియా యుద్ధంలో లక్ష్యాలు ఇవే
పశ్చిమాసియా యుద్ధంలో అమాయక ప్రజలు చవిచూస్తున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులు, వాటికి ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలపై టెహ్రాన్‌ చేపట్టిన ప్రతీకార దాడులలో పాఠశాలలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలు, జనావాస ప్రాంతాలే లక్ష్యంగా మారుతున్నాయి. ఫలితంగా వేలాది మంది ప్రజలు చనిపోవడమో లేదా క్షతగాత్రులై జీవచ్ఛవాలుగా మారడమో జరుగుతోంది. సైనిక సంబంధమైన కేంద్రాలు, స్థావరాలే కాదు…పౌర మౌలిక సదుపాయాలు కూడా ధ్వంసమవుతున్నాయి. ఇరాన్‌లో ఇప్పటి వరకూ సుమారు 90 వేల జనావాస ప్రదేశాలపై దాడులు జరగగా రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు పోరు లెబనాన్‌కు కూడా పాకింది. హెజ్బొల్లాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులలో భారీగానే ప్రాణనష్టం జరుగుతోంది.

ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ జరిపిన ప్రతీకార దాడులలో కనీసం 19 మంది చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. అమెరికా స్థావరాలకు ఆతిథ్యమిస్తున్న గల్ఫ్‌ దేశాలపై కూడా ఇరాన్‌ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకూ పాతిక మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైన రోజున ఇరాన్‌లోని మినాబ్‌లో ఉన్న షజారహ్‌ తయాబెహ్‌ బాలికల పాఠశాలపై క్షిపణి దాడి జరగగా కనీసం 170మంది బలయ్యారు. వీరిలో 7-12 ఏండ్ల మధ్య వయస్కు లైన బాలికల సంఖ్యే అధికంగా ఉంది. అదే రోజు అమెరికా ప్రయోగించిన ఓ కొత్త క్షిపణి సైనిక కాంపౌండ్‌ సమీపంలో ఉన్న జనావాసా లపై పడడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రయోగించిన క్రూయిజ్‌ క్షిపణి సుమారు 200 మందిని పొట్టనపెట్టుకుంది. వీరిలో అత్యధికులు చిన్నారులే.

టెహ్రాన్‌లోని రెసాలత్‌ జిల్లాలో ఓ బహుళ అంతస్థుల భవనంపై గత నెల 9న జరిగిన వైమానిక దాడిలో యాభై మంది చనిపోగా అనేక మంది గూడును కోల్పోయారు. ఆర్థిక మౌలిక సదుపాయాలు, రవాణా కేంద్రాలు కూడా అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులలో దెబ్బతిన్నాయి. చివరికి విద్యా సంస్థలను కూడా యుద్ధోన్మాదులు వదలలేదు. ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇస్ఫహాన్‌లోని వర్సిటీ, మలేక్‌ అష్తార్‌ యూనివర్సిటీ, ఇమామ్‌ హుస్సేన్‌ విశ్వవిద్యాలయంపై దాడులు జరిగాయి. ఇక ఆరోగ్య కేంద్రాలపై జరిగిన దాడులకు లెక్కే లేదు. బాంబు దాడుల కారణంగా ఇరాన్‌లోని అనేక ఆస్పత్రులు, వైద్య కేంద్రాలు దెబ్బతిన్నాయి. యుద్ధం తొలి దశలో ఆరోగ్య కేంద్రాలపై కనీసం 13 దాడులు జరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలియజేసింది. ఇజ్రాయిల్‌, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరిపిన ప్రతీకార దాడులలో కూడా గణనీయంగానే ప్రాణనష్టం జరిగింది.

గందరగోళంలో ఆ రెండు దేశాలు : అరాగ్చి
”నిర్మాణ పనులు పూర్తి కాని వంతెనలు, ప్రజలు వినియోగించే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినంత మాత్రాన ఇరాన్‌ ప్రజలు సరెండర్‌ కారు. మా శత్రువులు (అమెరికా – ఇజ్రాయిల్‌) ఓడిపోయారని ఇలాంటి దాడులతో తేటతెల్లం అవుతోంది. ఆ రెండు దేశాలు మాచేతిలో నైతికంగా ఓడిపోయి గందరగోళంలో పడ్డాయి” అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి ఒక ట్వీట్‌ చేశారు.
తమ దేశంపై జరిగే ప్రతీ దాడికి, ఇరాన్‌ ఐఆర్‌జీసీ ప్రతిదాడులతోనే సమాధానం చెబుతోంది. ఇజ్రాయిల్‌, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ అటాక్‌ చేస్తోంది. దీంతో ఈ యుద్ధం ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది.

హార్ముజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు స్తంభించి భారత్‌ సహా ఆసియా దేశాలన్నీ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా పట్టించుకోకుండా అమెరికా ఈ యుద్దాన్ని సాగదీస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంపై సైనికంగా తన పట్టును నిలుపుకునేందుకు పాకులాడుతోంది. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన దాడులు చేస్తామని గురువారం ఉదయమే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం వల్ల ఇంకా ఎలాంటి ఆందోళనకర పర్యవ సానాలను చూడాల్సి వస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

వార్‌ ఆఫ్‌ బ్రిడ్జెస్‌
అప్పుడు యురేనియం నిల్వలని ఆరోపణ.. ఇప్పుడు వంతెనలపై యుద్ధం
ఇరాన్‌లోని ఎత్తైన వంతెనను కూల్చేసిన అమెరికా
గల్ఫ్‌లోని 8 బ్రిడ్జిలతో ఐఆర్‌జీసీ హిట్‌ లిస్ట్‌

నువ్వు ఒక్కటి కొడితే.. నేను ఎనిమిది కొడతానంటోంది ఇరాన్‌ ప్రభుత్వం. యురేనియం నిల్వలు ఉన్నాయంటూ మొదలుపెట్టిన యుద్ధం కాస్త..వార్‌ ఆఫ్‌ బ్రిడ్జెస్‌గా మారిపోనున్నది.
ఇరాన్‌, అమెరికా – ఇజ్రాయిల్‌ యుద్ధంలో ఇప్పుడు వంతెనలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఏప్రిల్‌ 2న ఇరాన్‌లోని కరజ్‌ నగరంలో ఉన్న అత్యంత ఎత్తైన (136 మీటర్లు) వంతెన బీ 1ను అమెరికా – ఇజ్రాయిల్‌ వాయుసేనలు బాంబులతో కూల్చేశాయి. ఆ వెంటనే బీ1 వంతెన కూలుతున్న వీడియోతో అమెరికా ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా ఒక హెచ్చరిక సందేశాన్ని విడుదల చేశారు.

ఆ వంతెనను ఇక ఎన్నడూ వినియోగించలేరని ఆయన తెలిపారు. ఇరాన్‌లో ఇంకా చాలా జరగబోతోందన్నారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరాన్‌కు ట్రంప్‌ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతీకారాన్ని తీర్చుకుంటామని ఏప్రిల్‌ 3న ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. గల్ఫ్‌, జోర్డాన్‌ పరిధిలోని 8 ప్రధాన వంతెనలు తమ హిట్‌ లిస్టులో ఉన్నాయని వెల్లడించింది. దీంతో పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

అచ్చం అలాగే ప్రతీకారం తీర్చుకుంటాం : ఐఆర్‌జీసీ
ఐఆర్‌జీసీ విడుదల చేసిన 8 వంతెనల హిట్‌ లిస్టు వివరాలతో ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. కరజ్‌ నగరంలోని బీ1 వంతెనను అమెరికా – ఇజ్రాయిల్‌ దళాలు కూల్చినందుకు, అచ్చం అదే రీతిలో ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు సిద్ధమని ఐఆర్‌జీసీ వెల్లడించింది. దీంతో గల్ఫ్‌దేశాల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చమురు నిక్షేపాలపై ఇరాన్‌ విరుచుకు పడుతుంటేనే.. అల్లాడిపోతున్నాయి. అమెరికాను మరింత కష్టాల్లోకి నెట్టేలా జలనిల్వలు, గ్యాస్‌ నిల్వలను వదిలే ప్రస్తకేలేదని ఇరాన్‌ హెచ్చరికలు గల్ఫ్‌దేశాలను కంటి మీద కునుకేలేకుండా చేస్తున్నాయి. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్న తీరుపై ఆ దేశాల పాలకులు మరింత ఆందోళన చెందుతున్నారు.

అమెరికా ఆర్మీ చీఫ్‌ రాజీనామా
పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగుతున్న వేళ అమెరికా సైనిక దళాల ప్రధానాధికారి రాండీ జార్జ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయాల్సిందిగా జార్జ్‌కు రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ ఆదేశించారని సీబీఎస్‌ వార్తా సంస్థ తెలిపింది. దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విజన్‌కు అనుగుణంగా పనిచేసే అధికారినే హెగ్‌సేథ్‌ కోరుకుంటున్నందున ఈ చర్య తీసుకున్నారని ఆ వార్తా సంస్థ చెప్పింది. 2023లో జో బైడెన్‌ ప్రభుత్వ హయాంలో జార్జ్‌ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆయన 2027 వరకూ ఆ బాధ్యతలో కొనసాగాల్సి ఉంది.

అటార్నీ జనరల్‌కు ఉద్వాసన
అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీకి ట్రంప్‌ ఉద్వాసన పలికారు. నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఆమెపై గతంలో ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆమె దేశభక్తి కలవారని, విధేయత చూపే స్నేహితురాలని కొనియాడారు. అయితే శ్వేతసౌధంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న వారికి ఆమె ఉద్వాసన ఆశ్చర్యం కలిగించదు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారంలో బాండీ పనితీరుపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌ ఉదంతంపై న్యాయ శాఖ జరుపుతున్న విచారణకు సంబంధించి బాండీ వాంగ్మూలం ఇవ్వాలని ప్రతినిధి సభకు చెందిన ప్రధాన దర్యాప్తు కమిటీ ఇటీవల ఆమెను ఆదేశించింది. తాను (ట్రంప్‌) ఎంచుకున్న లక్ష్యాలపై విచారణ జరిపేందుకు న్యాయ శాఖకు అపరిమిత నియంత్రణ ఉండాలని ట్రంప్‌ తరచుగా డిమాండ్‌ చేశారు. అయితే న్యాయ శాఖ ఆ పని చేయడం లేదంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యం కారణంగా తమ ప్రతిష్ట, విశ్వసనీయత దెబ్బతింటున్నాయని ట్రంప్‌ ఆరోపించారు.

టెహ్రాన్‌లో కీలకమైన వంతెనకు నష్టం
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తో కరజ్‌ నగరాన్ని అనుసంధానించే బీ1 వంతెనపైకి గురువారం అమెరికా – ఇజ్రాయిల్‌ వాయుసేనలు రెండుసార్లు బాంబులను జారవిడిచినట్టు ఫార్స్‌ న్యూస్‌ కథనాల్లో ప్రస్తావించారు. ఈ దాడిలో 8 మంది పౌరులు చనిపోగా, 95 మందికి గాయాల య్యాయని ఇరాన్‌లోని అల్‌ బోర్జ్‌ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ ఘొద్రతుల్లా సైఫ్‌ వెల్లడించారు. బీ1 వంతెనపై దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. బాంబు దాడి జరిగిన వెంటనే, వంతెనలోని ప్రధాన భాగాలు కూలిపోవడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వంతెన టెహ్రాన్‌ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఐఆర్‌జీసీ హిట్‌ లిస్టులోని 8 వంతెనలివే..
షేక్‌ జాబెర్‌ అల్‌ అహ్మద్‌ సబా సముద్ర వంతెన – కువైట్‌
షేక్‌ జాయెద్‌ వంతెన – యూఏఈ
అల్‌ మఖ్తా వంతెన – యూఏఈ
షేక్‌ ఖలీఫా వంతెన – యూఏఈ
కింగ్‌ ఫహద్‌ కాజ్‌ వే : సౌదీ అరేబియా, బహ్రయిన్‌ దేశాలను కలిపే వంతెన
కింగ్‌ హుసేన్‌ వంతెన – జోర్డాన్‌
దామియా వంతెన – జోర్డాన్‌
అబ్దౌన్‌ వంతెన – జోర్డాన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -