వారి సమ్మె న్యాయమైంది- మద్దతు పెంచుదాం
కార్మిక శాఖ జోక్యం చేసుకోవాలి
వేతనం రూ.16వేలు ఇవ్వాలి : సీఐటీయూ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కష్టానికి తగ్గ జీతం ఇవ్వక పోతే తిరగబడతాం. తొమ్మిది రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న పోరాటాన్ని ఆపేది లేదు. జీతాలు పెంచే వరకు పోరాటాన్ని ఆపం’ అంటూ నాచారంలోని షాహి ఎక్స్‌పోర్టు ప్రయివేట్ లిమిటెడ్(గార్మెంట్) పరిశ్రమ మహిళా కార్మికులు తెగేసి చెబుతున్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోరాటం స్ఫూర్తిదాయమైంది. ఆ ఉద్యమానికి కార్మిక సంఘాల మద్దతును పెంచాల్సిన అవసరముందని’ కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాల్‌రాజు, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్. పద్మ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ, రమ, కె. ఈశ్వర్‌రావు, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, పి. శ్రీకాంత్, పి. సుధాకర్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు భరత్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, ఐఎఫ్‌టీయూ నాయకులు శివబాబు పాల్గొన్నారు.
షాహి కార్మికులకు రూ.16వేల వేతనం ఇవ్వాలనీ, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలనీ, యాజమాన్యం వేధింపులు ఆపాలనీ, క్యాంటీన్ సౌకర్యం కల్పించాలనీ, ఒకరోజు సెలవు పెడితే రూ.ఎనిమిదొందలు కట్ చేసే పద్ధతిని ఆపాలనీ, బోనస్ 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ చుక్క రాములు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. షాహి పరిశ్రమలో 17 ఏండ్ల నుంచి పనిచేస్తున్న 16వందల మంది మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలని తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా..కార్మిక శాఖ , యాజమాన్యం పట్టించుకోక పోవటం సరికాదని సంఘాల నాయకులు తప్పు బట్టారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం శతవిధాలా ప్రయత్నించిందనీ, కార్మికులపై యాజమాన్యం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వేతనాలు పెంచేలా చర్యలు తీసుకునేందుకు కార్మిక శాఖ అధికారులను ఆదేశించి, సమ్మెను నివారించాలని వారు కోరారు. సమ్మెలో ఉన్న మహిళా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదనీ, సమస్యను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నాయకులు తెలిపారు. పనికి టార్గెట్లు విధిస్తున్నారనీ, పూర్తి చేయని కార్మికుల వేతనాల్లో కోతలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భోజన విరామ, విశ్రాంతి, మూత్రశాలలకు వెళ్ళే సమయాన్ని కూడా కుదిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. జీతాలు పెంచాలని కోరుతున్న మహిళా కార్మికులను తొలగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.
వీరికి నామమాత్రంగా రూ.తొమ్మిది వేల నుంచి రూ.11,200ల వరకు మాత్రమే వేతనం చెల్లించటం అన్యాయమని విమర్శించారు. ఒకరోజు సెలవు పెడితే వేతనం నుంచి రూ.ఏడు నుంచి, రూ. ఎనిమిదొందల వరకు కట్ చేస్తున్నారని తెలిపారు. శనివారం సెలవు పెడితే.. ఆదివారాలకు కలిపి రెండు రోజుల వేతనం కట్ చేస్తున్నారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఏర్పాటు చేయాల్సిన క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశ్రమను సందర్శించి తనిఖీలు చేసి కార్మిక చట్టాలు అమలు జరిపే విధంగా తగిన ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
జేసీఎల్ వద్ద చర్చలు..
రౌండ్ టేబుల్ అనంతరం కార్మిక నాయకులు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లి జేసీఎల్ సమక్షంలో మంగళవారం షాహి ఎక్స్‌పోర్ట్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యానికి కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులకు మధ్య చర్చలు జరిగాయి. కాగా ఆ చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి.



