Monday, October 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునిమ్స్‌లో నల్లుల బాధ

నిమ్స్‌లో నల్లుల బాధ

- Advertisement -

గ్రౌండ్‌ ఫ్లోర్లలో పందికొక్కులు..పైఅంతస్తుల్లో ఎలుకల స్వైరవిహారం
లైట్‌ ఆర్పితే చుట్టేస్తున్న బొద్దింకలు
కంపుకొడుతున్న టాయిలెట్లు
బాత్‌రూముల్లో వృధాగా పోతున్న నీళ్లు
మెడికల్‌ షాపుల నిలువుదోపిడీ
వైద్యసేవలు భేష్‌…నిర్వహణే వరెస్ట్‌

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌ ఆస్పత్రిలో వైద్య సేవలకు విశేష పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. పేషెంట్లకు మెరుగైన వైద్యం, శస్త్ర చికిత్సలు అద్భుతంగా జరుగుతాయి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి నగరి బీరప్ప నిమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక, ఇక్కడి వైద్యసేవల్లో అనేక మార్పులు వచ్చాయి. ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద సంఖ్యలో పేదలకు వైద్యసేవల్ని అందిస్తున్నారు. విసుగు, విరామం లేకుండా ఇక్కడి వైద్యులు, పీజీ విద్యార్థులు. నర్సింగ్‌ స్టాఫ్‌, వర్కర్స్‌ రోగుల బాగోగులు చూడటంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు.

నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
నిమ్స్‌లో ఆస్పత్రి భవనాలు, వార్డుల నిర్వహణ లోనే అనేక లోపాలు కనిపిస్తున్నాయి. నిమ్స్‌ పరిపాలనా భవనం, మిల్లీనియం బ్లాక్‌, స్పెషాలిటీ బ్లాకుల్లో పేషెంట్ల వార్డులు కూడా ఉన్నాయి. అన్ని చోట్ల నల్లులు, దోమలు రోగులు, వారి సహాయకుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. లైట్‌ ఆర్పి, పడుకుంటే బొద్దింకలు మనుషులు కనిపించనంతగా కమ్మేస్తున్నాయి. రోగుల కోసం తెచ్చే ఆహార పదార్థాలపై నల్లులు, బొద్దింకలు పారాడుతున్నాయి. స్పెషాలిటీ బ్లాక్‌లో రిజిస్ట్రేషన్‌ కౌంటర్ల వెనుక ఉన్న బాత్‌రూముల్లో పందికొక్కులు పరుగులు పెడుతున్నాయి. ఇక్కడి క్యాత్‌ వార్డ్‌ సహా పలు అంతస్తుల్లో ఎలుకలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మిలీనియం బ్లాక్‌, పరిపాలనా భవనంలోనూ ఇదే పరిస్థితి. బాత్‌రూముల్లో నల్లాలు పనిచేయక, వేల లీటర్ల నీరు వృధాగా పోతూనే ఉంది. అనేక చోట్ల టాయిలెట్ల ఫ్లష్‌ట్యాంకులు పనిచేయట్లే దు. పలుచోట్ల యూరినల్స్‌ వాడేందుకు వీల్లేకుండా ప్లాస్టిక్‌ కవర్లు కప్పిపెట్టారు. దానితో పేషెంట్లు, సహాయకులు ఆ పక్కనే మూత్రవిసర్జన చేస్తున్నారు. ఫలితంగా వాష్‌రూములు కంపు కొడుతున్నాయి.

సిబ్బంది వినియోగించే బాత్‌రూములకు తాళాలు వేసుకోవడంతో, రోగులు, సహాయకుల అవస్థలు వారికి తెలియట్లేదు. రోగుల మంచాలు తుప్పుపట్టి, రంద్రాలు పడ్డాయి. వాటిపైనే పరుపులు వేయడంతో బ్యాలెన్స్‌ కుదరక రోగులు నడుమునొప్పితో అవస్థలు పడుతున్నారు. నిమ్స్‌ ప్రాంగణంలోని క్యాంటీన్లలోనూ పరిశుభ్రత కనిపించట్లేదు. మెయిన్‌ గేట్‌ వద్ద ఉన్న క్యాంటీన్‌లో ఎంగిలి ప్లేట్లు కడిగే చోటే, టేబుళ్లువేసి కస్టమర్లకు సర్వీస్‌ అందిస్తున్నారు. ఆస్పత్రి లోపల ఉన్న క్యాంట ీన్‌లోనూ ఎలాంటి శుభ్రత లేదు. ఎమర్జెన్సీ బ్లాక్‌ ఎదురుగా రోగుల సహా యకుల కోసం వేసిన షెడ్డు దగ్గరే ఆస్పత్రి చెత్తనంతా పడేసి, డంపింగ్‌ యార్డుగా మారుస్తున్నారు. అక్కడే టీ స్టాల్‌, సమోసాలు విక్రయిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కూడా అక్కడే. చెత్త కంపు, వాహన కాలుష్యం మధ్యే దోమలతో సహాయకులు సహజీవనం చేయక తప్పట్లేదు. మెయిన్‌ గేట్‌, లోపలి క్యాంటీన్ల దగ్గరా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం అందించే రూ.5 భోజనం (అన్నపూర్ణ) క్యాంటిన్‌లో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు లేవు. పరిసరాల పరిశుభ్రత లేదు. కార్‌ పార్కింగ్‌ స్థలంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతమంతా మట్టి ప్రదేశం కావడంతో కార్లు వచ్చి వెళ్లేటప్పుడు భోజనంతో పాటు అక్కడి దుమ్ము, ధూళిని కూడా పేదలు తినాల్సి వస్తున్నది.

మెడికల్‌ షాపుల దోపిడీ
నిమ్స్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ షాపుల దోపిడీ అంతా ఇంతా కాదు. డాక్టర్‌ ప్రిస్క్రి ప్షన్‌తో ఇక్కడి మెడికల్‌ షాపుల్లో కొనే మందులకు, ప్రాంగణం బయట కొనే మందులకు కనీసం 30 నుంచి 50 శాతం ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. జనరిక్‌ మెడికల్‌ షాపుల్లో దొరికే మందుల్ని కూడా ఎమ్మార్పీ రేట్లకు అమ్మేస్తున్నారు. ఆస్పత్రిలో జనరిక్‌ మెడికల్‌ షాప్‌ ఏర్పాటు కాకుండా, ఇక్కడి మెడికల్‌ మాఫియా వ్యవహరిస్తున్నదనే విమర్శ ఉంది. ఆస్పత్రిలో వైద్యం ఎంత బాగున్నా, అక్కడి నిర్వహణా పరిస్థితులు, దోపీడీ పేదల ఆత్మాభిమానాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కచ్చితంగా ఆస్పత్రి పాలకమండలిపైనే ఉంది. ఆ మేరకు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -