Sunday, October 5, 2025
E-PAPER
Homeసందర్భంగోండుల సూర్యుడు….. కొమరం భీమ్‌

గోండుల సూర్యుడు….. కొమరం భీమ్‌

- Advertisement -

భీమ్‌ నేతత్వంలో గోండుల విప్లవోద్యమం దినదినం తీవ్రమై సర్కారు కుర్చీ కాళ్లనే విరగ్గొట్టే ప్రమాద పరిస్థితులు తలెత్తడంతో నిజాం నవాబుకు ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ మౌల్‌ వి అబ్దుల్‌ సత్తార్‌ భీమ్‌ ప్రజా యుద్ధం పై నివేదిక ఇచ్చాడు. గోండు రాజ్యం ఏర్పాటుకు త్వరలో జిల్లా కేంద్రం అయిన జనగాం(ఆసిఫాబాద్‌) ను భీమ్‌ ముట్టడించి దాన్ని స్వాధీనం చేసుకుంటాడనీ. దీంతో నిజాం నవాబుకు వణుకు పుట్టి ఆసిఫాబాద్‌ నుంచి వెంటనే ఆదిలాబాద్‌కు జిల్లా కేంద్రాన్ని మార్చాడు.

1724 నుంచి 1940 (1948) వరకు అనగా అసఫ్జా నిజాం ఉల్మూల్క్‌ నుంచి 9వ (చివరి) నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ బహదూర్‌ దాకా 9 మంది నిజాం నవాబుల సుమారు 224 ఏళ్ల దుష్ట పాలన కాలంలో నిజాం హైదరాబాద్‌ రాజ్యంలోని ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ అటవీ ప్రాంత గ్రామాల్లో అడవి బిడ్డలకు అడవి మీద ఏమాత్రం అధికారం లేదు. అడవిలో కనీసం పుల్ల కూడా ముట్టుకోరాదు. కట్టుకునేందుకు గోచీలు తప్ప అంగీలు లేవు. అడవి బిడ్డలు చేసుకున్న కష్టఫలాన్ని ఉద్యోగులు గద్దల్లా తన్నుకు పోతారు. దీంతో నిత్యం వారు ఆకలితో అలమటిస్తారు.

అధికారులు, పోలీసులు, పట్వారీలు, పటేళ్లు, దొరలు, పెత్తందార్ల దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు, అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు, చిత్రహింసలు అంతా ఇంతా కావు. హింసించి బలవంతంగా డబ్బులు దోచుకునేవారు. ఇలా అడవి బిడ్డలు రాక్షస పాలనలో అనుభవిస్తున్న కష్టాలు చూసి సర్కారుపై కొమరం భీమ్‌ రగిలిపోయాడు. తన గోండు జాతి జనులను కాపాడుకోవడానికి దుష్ట నిజాం నవాబుతో యుద్ధానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గోండులందరిని ఏకం చేయాలనుకున్నాడు. వాళ్ల హక్కులను అడవులపై వారికి గల అధికారాలను నిజాం నవాబు పై యుద్ధం చేసి గెలుచుకొని వారికి సుఖశాంతులను ఇవ్వాలని తనకు తాను కర్తవ్య బోధ చేసుకున్నాడు.

తన అనుచరులైన కురిసెంగ సాము, జుమ్నాక పైకు, కుమార లింగు, ఆత్రం రఘు, మడావి సోము, జాకో, కరిపెత్త బాదు, రాజు పటేల్‌, సీడం భూజీరావు, సోనేరావులతో కూడిన 500 మంది సైనికులను తయారు చేశాడు. వారికి ఆయుధాలుగా తుపాకులు, కత్తులు, గుత్పలు ఇచ్చాడు. అడవి బిడ్డల హక్కులైనా ఆదివాసీల స్వయంపాలన ”జల్‌ జంగల్‌ జమీన్‌” సాధన నినాదంతో పదేళ్లకు పైగా 1931 నుంచి 1940 అక్టోబర్‌ 8 దాకా అమరత్వం పొందే వరకు ఆసిఫాబాద్‌ పరిసర ప్రాంతాలైన జోడేఘాట్‌, బాబే జరి, పట్నాపూర్‌, టోకెన్ల వాడ, చల్‌ భరిడి, శివ గూడా, భీమన్‌ గోంది, కల్లెగావ్‌, అంకుతాపూర్‌, నర్సాపూర్‌, కోషగూడ, లైన్‌ టవల్‌ అనే 12 గూడేల ఆదివాసీల స్థితిగతులను మార్చి వారికి బంగారు జీవితాలను ప్రసాదించడానికి తిరుగులేని గిరిల్ల యుద్ధ వ్యూహంతో సమరం సాగించాడు.

ఎక్కడికక్కడ గోండు వీరులు అధికారుల అరాచకాలను ప్రతిఘటించటం, శిక్షించడం దెబ్బకు దెబ్బ హత్యకు హత్య వ్యూహాలతో నిజాం సర్కారును హడలెత్తించారు. భీమ్‌ నేతత్వంలో గోండుల విప్లవోద్యమం దినదినం తీవ్రమై సర్కారు కుర్చీ కాళ్లనే విరగ్గొట్టే పరిస్థితులు తలెత్తడంతో నిజాం నవాబుకు ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ మౌల్‌ వి అబ్దుల్‌ సత్తార్‌ భీమ్‌ ప్రజా యుద్ధం పై నివేదిక ఇచ్చాడు. గోండు రాజ్యం ఏర్పాటుకు త్వరలో జిల్లా కేంద్రం అయిన జనగాం(ఆసిఫాబాద్‌) ను భీమ్‌ ముట్టడించి దాన్ని స్వాధీనం చేసుకుంటాడనీ. దీంతో నిజాం నవాబుకు వణుకు పుట్టి ఆసిఫాబాద్‌ నుంచి వెంటనే ఆదిలాబాద్‌కు జిల్లా కేంద్రాన్ని మార్చాడు.

ఈ నేపథ్యంలో భీంను తన విప్లవోద్యమాన్ని విరమింప చేసి లొంగ తీసుకోవడానికి నిజాం నవాబు 30 ఎకరాల భూమి సర్కారు ఉన్నత కొలువు ఇస్తానని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు. దీన్ని భీమ్‌ దఢచిత్తంతో తిరస్కరించాడు. దీంతో భీమ్‌ వధకు నవాబు ప్రత్యేక సైన్యాన్ని కలెక్టర్‌ అబ్దుల్‌ సత్తార్‌ నాయకత్వంలో పంపాడు. ఆధునిక ఆయుధాలు కలిగి ఉన్న, 100 మంది పోలీసులు ఉన్న, డిఎస్పి బ్రిగెడుతో కూడిన నిజాం ముస్కర సైన్యంతో భీమ్‌ గోండు సైన్యం ప్రత్యక్ష యుద్ధానికి దిగింది.

మొదటి రోజు యుద్ధంలో భీమ్‌దే పై చేయి అయింది. యుద్ధంలో అలసిన భీమ్‌ జోడేఘాట్‌ గుట్టల్లో రహస్య ప్రదేశంలో గాఢ నిద్రలో ఉండగా సొంత గోండు జాతియుడు కుర్దు తనను సర్కారు పటేల్ను చేసిందని కుటీల బుద్ధితో జాతి ద్రోహానికి పాల్పడి పోలీసులకు పట్టించాడు. దీంతో నిజాం పోలీసులు దుర్మార్గంగా 1940 అక్టోబర్‌ 8 కాలరాత్రి అమానుషంగా భీమ్‌ ను కాల్చగా అమరుడైనాడు. భారతమాత తెలంగాణ మాత మెడల్లో మణిహారమై మెరిసాడు. అతనితోపాటు 100 మంది గోండు వీరులను సహితం కాల్చి చంపారు. గోండుల సూరీడు భీమ్‌ హస్తమయంతో గోండుల జీవితాల్లో మళ్లీ చీకట్లు కమ్మించామని నిజాం పాలకులు సంబరపడ్డారు.

కానీ భీమ్‌ వదిలిన రణ పతాకాన్ని ఎత్తి పట్టుకొని వెడ్మా రాము నాయకత్వంలో గోండులు రణం చేసి భీమ్‌ ఆశయం అయిన ఆదివాసీల స్వయం పాలన ‘జల్‌- జంగల్‌- జమీన్‌’ లను సాధించుకున్నారు. తదనంతర ప్రభుత్వాలు భీమ్‌ పాలసీని అమలు చేస్తూ వచ్చాయి. ఐ టి డి ఏ లతో ఆదివాసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపి ఉద్ధరిస్తున్నాయి. కొమురం భీం 1901 అక్టోబర్‌ 22న పుట్టాడు. 39 ఏళ్ల వయసులో గోండుల కోసం సాగించిన విప్లవోద్యమంలో నేలకొరిగాడు. మా మిత్రులు ప్రముఖ దర్శక నిర్మాత అల్లాని శ్రీధర్‌ కొమరం భీమ్‌ చిత్రాన్ని నిర్మించి భీమ్‌ విరోచిత గాథను ప్రపంచానికి తెలిపారు. ఈ చిత్రం జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు గాను ఎంపిక కాగా శ్రీధర్‌ కు 2 నంది అవార్డులను తెచ్చి పెట్టింది.

  • తాళ్లపల్లి యాదగిరి గౌడ్‌, 9949789939
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -