Sunday, July 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు'పసుపు'నకు దక్కని 'మద్దతు'

‘పసుపు’నకు దక్కని ‘మద్దతు’

- Advertisement -

– లాభం లేని ఈనామ్‌..!
– మొక్కుబడిగా సరుకు నమోదు వివరాలు
– యథావిధిగా కొనసాగుతున్న దోపిడీ
– ఎనుమాములలో రైతులకు అడుగడుగునా అన్యాయమే.. నాణ్యత ఉన్నా.. ధర లేకపాయె
నవతెలంగాణ- కాశిబుగ్గ

ఎన్ని కష్టాలు ఎదురైనా పండించిన పంటకు సరైన మద్దతు ధర వస్తే పడిన శ్రమనంతా మర్చిపోతాడు రైతన్న. కానీ అన్నదాతలకు అడుగడుగునా మోసం.. అవమానాలే ఎదురవుతున్నాయి. సాగులో విత్తనాల కోసం మార్కెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి పంట డబ్బులతో బయటపడే వరకు అంతా దోపిడీనే.. ఏండ్లుగా వ్యవసాయ మార్కెట్‌లో నడుస్తున్న తంతు ఇది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవడానికి తద్వారా రైతు గరిష్ట ధర పొందడానికి కేంద్రం ఈనామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) విధానం ప్రవేశపెట్టింది. కానీ, ఈ విధానం అమలులో లోపాల వల్ల రైతులకు మద్దతు ధర దక్కకపోగా దోపిడీ యథావిధిగా కొనసాగుతోంది.

తాము పండించిన పంటకు ఏ దేశంలో ఎంత గిరాకీ ఉందో.. దేశీయ మార్కెట్‌లో ఎంత ధర పలుకుతుందో రైతులకు తెలియాలి. అలాగే, కొనుగోలు చేయాలని భావిస్తున్న పంట ఏ మార్కెట్‌లో ఉందో.. ఎంత పరిమాణంలో ఉందో వ్యాపారులకు తెలియాలి. వీటన్నింటి కోసం దేశంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం చేసి ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది ”ఈనామ్‌” ప్రధాన ఉద్దేశం. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. రైతులతోపాటు మార్కెట్‌కు సంబంధించిన ఖరీదుదారులు, కమీషన్‌ ఏజెంట్లు ఇతరుల వివరాలు ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. మార్కెట్‌కు వచ్చిన సరుకులను వ్యాపారులు ఆన్‌లైన్‌ టెండర్‌ ద్వారానే కొనుగోలు చేయాలి. నిర్ణీత సమయంలోనే టెండర్స్‌ పూర్తి చేసి ఖరారైన వాటి వివరాలు ప్రకటించాలి. గరిష్ట ధరలు రైతులకు తెలిపేలా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి. సరుకు తూకం వేయడం.. మార్కెట్‌ కమీషన్‌ వాసులు రైతులకు డబ్బు చెల్లించడం.. అన్నీ ఎలక్ట్రానిక్‌ విధానంతోనే ఉండాలి. అంతర్జాతీయ వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేయాలంటే ప్రయోగశాలలు తప్పనిసరి. సుమారు 69 రకాల వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు ఇప్పటికే ఈనామ్‌ పోర్టల్‌లో ఉంచారు. తెలంగాణలో ఇప్పటివరకూ 44 మార్కెట్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్‌ విధానాన్ని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా 2016, ఏప్రిల్‌ 14న ప్రారంభించారు. ఇందులో పసుపుతోపాటు మక్కలు, శనగలు, పెసర్లు తదితర పంట ఉత్పత్తులను చేర్చారు. అయినప్పటికీ రైతులకు మద్దతు ధర అందకపోగా అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. మార్కెట్‌ లెక్కల ప్రకారం 2022-23లో మార్కెట్‌కు మొత్తం 46,232 క్వింటాళ్ల పసుపు రాగా, గరిష్ట ధర క్వింటాకు రూ.7,500 పలికింది. కనిష్ట ధర రూ.1600, మోడల్‌ ప్రైస్‌ రూ.5,160 లభించింది. 2023-24లో మొత్తం 40,882 క్వింటాళ్ల పసుపు రాగా గరిష్ట ధర రూ.13వేలు, కనిష్ట ధర రూ.4,050 పలకగా, మోడల్‌ ప్రైస్‌ రూ.8135 పలికినట్టు మార్కెట్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2024 ఏప్రిల్‌ నుంచి శుక్రవారం (తేదీ :25-07-2025) వరకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మొత్తం 32,615 క్వింటాళ్ల పసుపు రాగా, గరిష్ట ధర రూ.9459, కనిష్ట ధర రూ.8వేలు, మోడల్‌ ధర రూ.9వేలు లభించింది.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఈనామ్‌ విధానం పూర్తిస్థాయి లో అమలు చేయడం వల్ల తమకు ఆర్థిక నష్టం ఉంటుందని గ్రహిం చిన కొందరు అడ్తిదారులు ఈనామ్‌ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తు న్నారు. రైతాంగాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారు. ఈనామ్‌ విధానం వల్ల సిండికేట్‌గా మారకుండా పంట నాణ్యతను బట్టి ధర లభిస్తుంది. ఈనామ్‌పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి పకడ్బంధీగా అమలు చేస్తే రైతుకు లాభమే.
– మోర్తాల చందర్‌రావు, ఏఐకేఎఫ్‌ జాతీయ కార్యదర్శి

ఈనామ్‌తో రైతుకు గరిష్ట ధర
ఈనామ్‌ విధానం వల్ల రైతుకు గరిష్ట ధర లభిస్తుంది. ఈ విధానంలో క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌ విధానం ద్వారా జరగడం వల్ల ఎలాంటి అవకతవకలకూ అవకాశం ఉండదు. రైతుకు ఇష్టమైతేనే తన పంటను అమ్ముకోవచ్చు. స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించే అవకాశం ఉండదు.
– గుగులోతు రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి

మద్దతు ధర రావడం లేదు
నాణ్యత ఉన్నా మద్దతు ధర దక్కడం లేదు. 15 బస్తాల పసుపు తీసుకొస్తే క్వింటాకు రూ.9500 లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధర తగ్గింది. ఒకే రకమైన నాణ్యత గల పంటకు ధరలలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తాము పంటలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నా గరిష్ట ధర రావడం లేదు.
– సింగతి రంజిత్‌,
రైతు రంగాపూర్‌- దుగ్గొండి, వరంగల్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -