చిన్న రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం
పరిహారానికి ప్రణాళిక రూపొందించాలి
ఆర్బీఐకి న్యాయస్థానం ఆదేశం
న్యూఢిల్లీ : సైబర్ దోపిడీ (డిజిటల్ మోసాల) ద్వారా రూ.54 వేలకోట్లకు పైగా స్వాహా కావడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘దోపిడీ, దొంగతనం’గా అభివర్ణించింది. సైబర్ మోసాలపై ఆర్బీఐ, బ్యాంకులు, టెలీకమ్యూనికేషన్ శాఖ (డీఓటీ)తో సంప్రదించి నాలుగు వారాల్లోగా ప్రామాణిక ఆపరేటింగ్ (ఎస్‌ఓటీ) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు చిన్న రాష్ట్రాల బడ్జెట్ల మొత్తం కన్నా డిజిటల్ మోసం ద్వారా స్వాధీనం చేసిన నగదు ఎక్కువని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చి, జస్టిస్ ఎన్‌వి అంజరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది.
బ్యాంకు అధికారుల కుట్ర లేదా నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి నేరాలు జరగవచ్చని వివరించింది. ఆర్బీఐ, బ్యాంకుల నుంచి సకాలంలో చర్యలు అవసరమని సూచించింది. ఆర్బీఐ, టెలికాం శాఖ (డీఓటీ) సూచనలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు వారాల్లోగా ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని రూపొందించాలని హోంశాఖను ఆదేశించింది. సైబర్-ఆధారిత మోసాలను నిరోధించడానికి డెబిట్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టేలా ఎస్‌ఓపీని ఆర్బీఐ రూపొందించిందని తెలిపింది.
సైబర్ అరెస్ట్ కేసులను గుర్తించాలని సీబీఐని ఆదేశించింది. గుర్తించిన డిజిటల్ అరెస్టు కేసుల్లో దర్యాప్తును కొనసాగించడానికి సీబీఐకి అనుమతినివ్వాలని గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలను కోరింది. డిజిటల్ అరెస్ట్ కేసుల్లో పరిహారం అందించడానికి ఒక ప్రణాళికను (ఫ్రేమ్ వర్క్‌ను) రూపొందించడానికి ఆర్బీఐ, డీఓటీ ఇతరులు సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించింది. బాధితులకు పరిహారం మంజూరు చేయడంలో ఆచరణాత్మక, ఉదారవాద విధానం అవసరమని తెలిపింది. నాలుగు వారాల తర్వాత తదుపరి విచారణ చేపడతామని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీలోపు తాజా స్టేటస్ నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించింది.



