నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఆదివాసి గిరిజన గ్రామాలలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నందున ఇంటి పరిసరాలలో, డ్రైనేజీలలో, వీధులలో వర్షపు నీరు నిలువ ఉన్నచోట దోమలు వృద్ధి చెంది దోమ కాటు వలన మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున నీరు నిల్వ ఉండకుండా గిరిజన కుటుంబాలు తగిన జాగ్రత్తలు తీసుకోని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తూ ఉండాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన గ్రామాలలో దోమలు వృద్ధి చెందే పరిసరాలలో దోమల మందు పిచికారి చేయాలని, అలాగే ప్రతి ఇంటిలోపల దోమల మందు చల్లే సమయంలో సంబంధిత సిబ్బంది గిరిజనులకు అవగాహన కల్పించి దోమలు వ్యాప్తి చెందకుండా దోమల మందు పిచికారి చేయాలని, అందుకు గిరిజన ప్రజలు తప్పనిసరిగా సిబ్బందికి సహకరించాలని తెలిపారు. టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు వచ్చినవారు ప్రైవేట్ హాస్పిటల్‌కి, ల్యాబ్‌కి వెళ్ళినట్లయితే అధిక ఫీజులు వసూలు చేసే అవకాశం ఉన్నందున, వ్యాధులు ప్రబలిన గ్రామాల యొక్క సమాచారం వైద్యశాఖ వారికి అందించినట్లయితే ఆయా గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. సంబంధిత వైద్య సిబ్బంది పట్టణ ప్రాంతాలలో టైర్లు పంచర్లు వేయు షాపులను గుర్తించి, వారికి ముందుగానే నోటీసు అందించి పాత టైర్లు లేకుండా చూడాలని, అలాగే సురక్షితమైన మంచినీళ్లు అందే విధంగా చర్యలు చేపట్టాలని, ఆశ వర్కర్ మరియు ఏఎన్‌ఎం ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోదకాలు మరియు నీటి కలుషితం వల్ల కలరా, డయేరియా నీళ్ల విరోచనాల వంటి వ్యాధులపై గిరిజన కుటుంబాలకు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలని, వీధులలో ఏర్పాటు చేసిన తోపుడు బండ్లపై ఆహార పదార్థాలు దుమ్ము దులితో ఉండటం వల్ల అలాంటి ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, మలేరియా, పచ్చకామెర్లు తదితర వ్యాధులు ప్రబలుతాయని, అలాగే భోజనం హౌటల్స్ మరియు దాబాల్లో మాంసాహారం, కుళ్ళిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని గిరిజనులకు తెలియజేస్తూ, అటువంటి నాసిరకమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా వైద్య సిబ్బంది గిరిజనులకు తెలియజేయాలని సూచించారు.