Friday, February 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏప్రిల్‌ లేదా మేలో రాష్ట్రంలో సర్‌

ఏప్రిల్‌ లేదా మేలో రాష్ట్రంలో సర్‌

- Advertisement -

అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా మిస్‌ కావొద్దు
పోలింగ్‌ స్టేషన్‌కు ఒక బీఎల్‌ఏను నియమించాలి : రాజకీయ పార్టీలకు సీఈవోసుదర్శన్‌రెడ్డి సూచన
నోటిఫికేషన్‌ తర్వాత పరిమితంగా సమయం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ప్రత్యేక సుదీర్ఘ సవరణ ‘సర్‌’ కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ఏప్రిల్‌ లేదా మేలో తెలంగాణ సహా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని వివరించారు. సర్‌ ను దృష్టిలో ఉంచుకుని అంతకు ముందే బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)ను నియమించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. గురువారం హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో బలమైన సమన్వయం ఈ ప్రక్రియకు కీలకమని స్పష్టం చేశారు. బీఎల్‌ఏలను సాధ్యమైనంతవరకు ఆయా పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలోని స్థానికుల నుంచే ఎంపిక చేయాలనీ, వారు బూత్‌ లెవల్‌ అధికారులతో (బీఎల్‌ఓలు) సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఓటర్ల జాబితా సవరణ సమయంలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమస్యల పరిష్కారం కోసం ప్రతి పోలింగ్‌ బూత్‌కు కనీసం ఒక బీఎల్‌ఏ తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్‌ నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత సమయం పరిమితంగా ఉండటంతో రాష్ట్రంలో ముందస్తు సన్నాహక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ సన్నాహక చర్యల్లో భాగంగా 2025 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను 2002 సర్‌లో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్‌టాప్‌ మ్యాపింగ్‌ చేపట్టామని అన్నారు. అనంతరం ఫీల్డ్‌ స్థాయి మ్యాపింగ్‌ కొనసాగుతుందనీ, పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించి ధృవీకరించేందుకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సర్‌ సమయంలో ప్రతి పోలింగ్‌ ప్రాంతాన్ని బీఎల్‌ఓలు మూడు నుంచి నాలుగు సార్లు సందర్శిస్తారని వివరించారు. మొదటి సందర్శనలో ఎన్‌న్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తారని అన్నారు.

తదుపరి సందర్శనల్లో ముందుగా అందుబాటులో లేని కుటుంబాలను కవర్‌ చేస్తారని చెప్పారు. సన్నాహక దశలో మ్యాపింగ్‌ కాకపోయిన ఓటర్లు కూడా సర్‌ సమయంలో తమ వివరాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రను మరోసారి గుర్తు చేస్తూ అన్ని పోలింగ్‌ స్టేషన్‌లకు బీఎల్‌ఏల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. బూత్‌ స్థాయిలో సమర్థవంతం పాల్గొని సమన్వయాన్ని బలోపేతం చేసి, ఫిర్యాదులను తగ్గించి, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చేయడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సీఆర్‌ఓ హరిసింగ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -