నవతెలంగాణ – దుబ్బాక
గోడలకు తేమ వస్తే తాను బాగు చేస్తానని చెప్పి నమ్మబలికి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై దాడికి పాల్పడి ఆమె మెడలోంచి బంగారు పుస్తెలతాడును చోరీ కి పాల్పడ్డ నిందితుడిని భూంపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దుబ్బాక లోని సీఐ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ పీ. శ్రీనివాస్ వెల్లడించారు. భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట కు చెందిన వ్యాపారి కంకణాల శంకరయ్య భార్య రాజమణి (75)ని ఈనెల 6న ఇదే గ్రామానికి చెందిన జూకంటి మల్లారెడ్డి అని వ్యక్తి.. వ్యాపారి ఇంట్లోకి చొరబడి గోడలకు తేమ వస్తే తాను బాగు చేస్తానని ఎక్కడ తేమ ఉందో చూపించాల్సిందిగా రాజమణిని అడిగాడు.
ఇంటిని చూపిస్తున్న క్రమంలో ఆమెను వెనకనుంచి తోసేసి పక్కనే ఉన్న తక్కెడ బాటుతో రాజమణి తలపై బలంగా కొట్టాడు. ఆమె మెడలో నుంచి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించాడు. వ్యాపారం ముగించుకొని రాత్రికి ఇంటికి వచ్చిన కంకణాల శంకరయ్య.. ఇంట్లో తన భార్య రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి భీతిల్లాడు. భార్యను లేపి విచారించగా ఇదే గ్రామానికి చెందిన జూకంటి మల్లారెడ్డి తనను కొట్టి పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడంటూ భర్తతో చెప్పింది. స్థానికుల సాయంతో ఆమెను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది.
బాధితురాలి భర్త శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు మల్లారెడ్డిని పోతారెడ్డిపేటలో గురువారం అరెస్టు చేశారు. నిందితునిపై హత్యాయత్నం, దొంగతనం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సీఐ వెల్లడించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది రాంజీ, పలువురున్నారు.