వరుణుడు కరుణించి ప్రకతి పులకించి జాతికి మెతుకునిచ్చి బతుకు నిలిపే అమ్మలకు మొక్కులు తీర్చడం..
అనాది విశ్వాసాలకు ఆధునిక శైలులను సొంతం చేసుకుని నేటికి ప్రజల గుండెల్లో శాశ్వతాక్షరాలుగా, అమ్మ దేవతలుగా వెలుగొందుతున్నవి తెలంగాణ బోనాలు…
ఆషాఢం, శ్రావణమాసంలో నెలరోజులపాటు జరిగే ఈ పండుగ జూన్ 26న గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పణతో అంకురార్పణ జరిగింది. బోనాలనేవి తెలంగాణ ప్రాంతానికే ఓ ప్రత్యేకత. ప్రజల జీవన సంస్కతి అర్థం చేసుకునేందుకు దోహదం చేస్తుంది. అమ్మతల్లికి పెట్టె నైవేద్యాన్నే బోనంగా పిలుస్తారు. పేదలకు నిరంతరం బువ్వ దొరకాలని, పంటలు పండాలని, వానలు కురువాలని కొత్తనీళ్లతో వచ్చే రోగాల నుండి రక్షించాలని మొక్కులు తీర్చుకునే పండుగ. ”కరువొచ్చినా.. కాలమైనా… చేనుకొచ్చిన పురుగు శెరిగిపోయంగ, బువ్వలేని తల్లి బోనమండింది. బోనాల పండుగ నా తెలంగాణ..శివసత్తులాట నా తెలంగాణ” అన్న కవి వాక్కు.
బోనం కుండంటే భూమి మట్టితత్వం, శ్రమతత్వం ప్రతిజీవి కూడా పంచభూతాల్లోనే కలిసిపోయే ప్రకృతి హెచ్చరిక. శ్రామికజనులైన కుమ్మరోళ్ల ఇంటి నుండి కొత్తకుండ, సున్నం, జాజు, పట్టీలు, పసుపు, కుంకుమ, బెల్లం బువ్వ, పచ్చిపులుసు నైవేద్యాన్ని బహుఇష్టంతో నిష్టగా పూజిస్తారు పేద తల్లులు. కష్టాలు కన్నీళ్లు దరిదాపుల్లోకి రాకుడదని అమాయక అవ్వలు అచరిస్తున్న ఓ తంతు. తల మీదకి బోనం ఎత్తుకున్నామంటే? గుండెల మీదున్న బాధలు బరువును దించుకున్నట్టు. సార సీసాలు, కల్లు కుండలు, బెల్లంసాక, యాపమండలు, గుగ్గిలం పొగలు, ధూప, దీప నైవేద్యాలు, తొట్టెలు ‘గుడి చుట్టూ’ ఎడ్ల బండ్లు, ప్రదక్షిణలు. మొక్కార్తిలో బోనాలంటే? మొగుళ్లంటే సంబరాలు, ఈడొచ్చిన పిల్లలకు జోడు కుదరాలని, పాడిపంటలు కాపాడాలని అమ్మకు ముక్కు పోగులని, ఏడు దొంతుల తొట్టెలని మొక్కుకుంటారు. చెయ్యెత్తు కోడి పుంజులు, కొమ్ములు తిరిగిన పొట్టేల్లు, అమ్మకు ముడుపులు, బైండ్లోళ్ల జమిడిక చప్పుళ్లు, డప్పుల మోతలు, పోతరాజులు, శివసత్తులు ఓ పెద్ద కోలాహలం. ఎన్నడు కలవని ఆడబిడ్డలు బోనాలతో కలుస్తారు. ఊరూరా ముచ్చట్లు, ఆత్మీయ ఆలింగనాలు, గుడిగోపురం లేని గావురాల తల్లికి శ్రామికజన పెద్దలైన కుమ్మరోళ్లు ముదురాజు వృత్తిదారులే.ఇక్కడ పూజారులు మద్యం, మాంసమే అమ్మకు ఇష్టంగా ఆరబోస్తారు.
మేకను గావు (నోటితో కొరికి) పట్టి అమ్మకు పెట్టిన బువ్వ అందరూ అనందంగా తినటం. ‘బతుకులోని బాధలన్నీ ఇగ అమ్మకు చెప్పుకున్నాం’ అన్న ఒక భరోసా. ఆ రోజు పల్లెంత ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ పల్లె నుంచి పట్నం దాకా అడుగడుగునా అనేక మంది గ్రామదేవతలు దర్శనమిస్తారు. వ్యవసాయ సీజన్‌లో పంటలను రక్షించుకునే తాపత్రయంలో జరుపుకునే పండుగ. బువ్వ లేనోళ్లకు బువ్వ పుట్టాలని బోనమెత్తే ఒక బహుళ సమిష్టి సంస్కతికి దండిగా టెంకాయలు కొట్టి సాంబ్రాణి పొగలతో మొక్కులు తీర్చుకున్నారంటే ఏరు వాకకు ఎతమేసినట్టుగా అంతా శుభమే జరుగుతుందన్న విశ్వాసం. ఇదంతా ఆదినుంచి వస్తున్న తంతు. అంబరాన్ని తాకే సంబరం. ఊరు ఊరంతా బాగుండాలనే మట్టి మీది ఒట్టేసి పబ్బతికోరే బోనాల పండుగ. జనమంతా ఉత్సాహాంగా ఉత్సవంగా.. జరుపుకునే జనజాతర.
రుతు కాలగమనాల పరంగా వ్యాధులకు, రోగాలకు అనువైన సమయం. వేసవి ముగిసి తొలకరి వర్షాలు విస్తారంగా పడే ఈ కాలంలో జంతువులు, మనుష్యుల దేహాలు, ఆరోగ్యాలు, అస్తవ్యస్థతకు లోనవుతాయి. భూమి నుండి అనేక క్రీములు, పురుగులు పుట్టుకొస్తాయి. అందుకే దీన్ని ఈగ కాలమంటారు. అమ్మతల్లి (రఎaశ్రీశ్రీ జూశీఞ), గత్తర (విరోచనాలు), ఆటలమ్మ (షష్ట్రఱషసవఅ జూశీఞ)వంటివి పట్టి పీడిస్తాయి. వచ్చే రోగాల నుండి నయం కావాలని పసుపు, బెల్లం, నీరు, బియ్యం కలిపిన అన్నం తింటారు. పసుపు యూరిట్ బయో టిక్స్ రోగ కారకాలను నాశనం చేస్తాయి. వేపరెమ్మలు, శరీరాలనిండా పసుపు ఆరోగ్యానికి స్వాంతన చేకూరుస్తుంది. అందుకే ఆ కాలంలో తమ గ్రామం లేదా తెగను సంరక్షించేందుకు తమదైన ప్రత్యేక గ్రామీణ ప్రతీకలతో కూడిన దేవతలను పూజించటం ఆరంభించారు.
కాలాలను అధిగమించి తరాలను దాటి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. దీనికి సజీవ తార్కాణమే బోనాలు. పక్కా శూద్రుల పండుగ. పూజారి ఉండడు, వేద మంత్రాలు, శ్లోకాలు కనపడవు. తెల్లబట్టపరిచి పటం వేసి బైండ్లలు జమ్మిడిక వాయిస్తూ కథలు చెప్తారు. స్త్రీలను గౌరవించే సాంప్రదాయం బోనాల్లో, బతుకమ్మ పండుగల్లో ప్రధానంగా పాల్గొనేది మహిళలే. పూజలందుకునేది కూడా స్త్రీ దేవతలే కావడం ఓ విశేషం. శిగాలు, పునకాలు సాధారణంగా ఎవరికి వస్తాయి? అని మనం పరిశీలిస్తే పేదరికంతో, బాధలతో ఇబ్బందులు పడే శూద్ర స్త్రీలు, ప్రధానంగా యాదవ స్త్రీలు, నిరక్షరాస్యులు మాత్రమే శిగాలు ఉగుతారు. అగ్రకులాల స్త్రీలు ఊగినట్లు దాఖలాల్లేవు.
నేడు అమ్మతల్లుల పండుగల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. నేడు గుడులన్నీ అగ్రహారాలు ఆక్రమించాయి. బోనం కుండకు బదులు బిందెలు అవి ఇత్తడివి కాకుండా బంగారు పూత పూసిన బోనం ఒక ”స్టేటస్ సింబల్”గా మారింది. రాయివిగ్రహానికి బదులు గుడిగోపురాలు వెలిశాయి. పూజారులు లేని చోట బ్రాహ్మణులు వచ్చారు. ఇప్పుడు మంత్రాలు, శ్లోకాలు, యజ్ఞలు పుట్టాయి. శిష్ట సంప్రదాయం చుట్టుముట్టింది. ప్రతిగుడికి ఒక ఛైర్మన్‌తో కార్యవర్గం ఏర్పడింది. వనరులన్ని ఆధిపత్య వర్గాల చేతుల్లోకి మారాయి. శ్రమ జీవుల పండుగ సైతం మతపరంగా, గుడులన్నీ పెట్టుబడి వ్యాపార కేంద్రాలుగా విస్తరించాయి. మార్పు లేకుండా మానవ సమాజం లేదు. ప్రతి మార్పు ప్రజలకు ఉపయోగపడాలి.
బోనాల జాతరలో ఒక శాస్త్రీయతతో పాటు సాంస్కతికంగా ”భక్తి పూర్వకంగా” ఆరోగ్యపరంగా ఆరాధన క్రతువుల్లో అంతర్గతంగా దాగి ఉన్నది. ఇదంతా లోకకల్యాణం, సకలజన సంక్షేమం, శ్రమైక జీవన సౌందర్యం. వ్యవస్థలో అందరికి అన్నం దొరికితే అమ్మ తల్లుల అవసరం అంతగా పెరిగేది కాదేమో! కొమ్మ చెక్కితే బొమ్మ.. కొలిచి మొక్కితే అమ్మ” కాదంటే ఏదీ లేదు. ఇది ఊరుమ్మడి ఉత్సవం. ఇది ఒక శ్రమ సంస్కృతి. శ్రామికలోకమంతా జరుపుకునే పండుగ. స్త్రీ మూర్తిని గౌరవించేదిగా,స్త్రీని మహిషాసురవర్ధినిగా, మహాశక్తిగా, మహాతల్లిగా పూజించే బోనాల పండుగకు శరణార్ధి.
భూపతి వెంకటేశ్వర్లు
9490098343