ఏ జాతి పురోగమనమైనా విజ్ఞాన వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. విజ్ఞానం పెంపొందకుండా, వ్యాప్తి చెంద కుండా సమాజ పురోగమనాన్ని ఊహించలేము. అలాంటి విజ్ఞానాన్ని ఆర్జించేందుకు విద్యార్థికి ప్రేరణనిచ్చే ఉపకరణం ఉపాధ్యాయుడు. విజ్ఞాన వ్యాప్తిలో బోధనకు కేంద్రమైన తరగతి గదిలో ఉపాధ్యాయుడిది నిర్ణయాత్మక పాత్ర. ఉపాధ్యాయుడి ధక్పథం తరగతిగది వాతావరణాన్ని సజిస్తుంది. విద్యార్థి జీవితానికి దిశానిర్దేశం చేయగల అద్భుతశక్తి ఉపాధ్యాయుడిది. చిన్నతనంలోనే భావిపౌరునికవసరమైన ప్రశ్నించే తత్వాన్ని, కొత్త విషయాల్ని నేర్చు కోవడంలో ఆసక్తిని, చేసే పనిలోశ్రద్ధ, కేంద్రీకరణ, తద్వారా ఆలోచించే, గ్రహించే, ఊహించే శక్తిని పెంపొందింప జేస్తాడు. ఆలోచనలను, భావాలను, నిజాయితీగా స్పష్టంగా తెలియజేసేందుకవసరమైన భాషను నేర్పడం లాంటివి ఉపాధ్యాయుడి ద్వారానే పరిపూర్ణ మవుతాయి. గురువు జ్ఞాని, బోధనా నైపుణ్యం కలవాడే ఉండాలి. అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి, జ్ఞాన దీప్తిని వెలిగించే ఉపాధ్యాయుడే సోషల్ ఇంజనీర్‌గా భావించబడతాడు. అతడే విద్యార్థికి స్ఫూర్తి ప్రదాత.అంకితభావం, సేవాతత్పరతతో నిర్వర్తించే వత్తి అయినందున ఉపాధ్యాయుడు దైవం కన్న మిన్నగా భావించ బడతాడు. ”గురువూ, గోవిందుడూ ఇద్దరూ ఎదురైతే మొదటగా గురువుకే మొక్కుతా” నంటాడు సంత్ కబీర్‌దాస్. అలాంటి ఉపాధ్యాయుడి గురించి స్వామి వివేకానంద ఆలోచనల్లో ”విద్య అంటే గురువుతో వ్యక్తిగత సంబంధం. ఉపాధ్యాయుడి వ్యక్తిగత జీవితం లేకుండా విద్యకు అర్థం లేదు”.
ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానాన్ని అందించే వ్యక్తిమాత్రమే కాదు. విద్యార్థులపై వ్యక్తిగత స్థాయిలో ప్రభావం చూపే మార్గదర్శి. అతని వ్యక్తిగత జీవితంలోని అనుభవాలు, విలు వలు, జీవనశైలి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, నైతికతకు పునాది వేస్తాయి. విమర్శనాత్మక ఆలోచన, పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయి.The conditions necessary for the teacher are purity, real thirst after knowledge and Preseverance . Purity in thought, speach and action absolutely necessary అనికూడా చెప్పారాయన. ప్రముఖ తత్వవేత్త జిడ్డుకష్ణమూర్తి ‘విద్యార్థి సజన శీలుడైన పౌరుడిగా తీర్చిదిద్దబడే క్రమంలో తన చుట్టూ పాటించబడే విలువలను, తాను పాటిస్తున్నాడా లేదా తేడాలున్నాయా? తాను ప్రభావితమవు తున్నాడా లేక ఇతరులను ప్రభావితం చేయగలుగు తున్నాడా అనే విషయాలను అవగాహన చేసుకుని పరీక్షించుకునుటలో ఆ విద్యార్థికి సహాయపడాలంటే ఉపాధ్యాయుడు తనను తాను పరీక్షించుకోవాలి. అప్రమత్తతో తన ఆలోచన, భావాలను లోతుగా గమనించుకోవాలి. తాను చేసే పనులను, ప్రతి స్పందనలను గమనించే జాగతస్థితి కలిగి ఉండాలి’. అంటూ ఉపాధ్యాయుడి వత్తి ఆదర్శాన్ని వివరిస్తారు. అయితే ఉపాధ్యాయులు స్వయం ప్రేరితంగా ఇలాంటి పరివర్తన పొందేందుకు తగిన వాతావరణం నేడు లోపించిందనే చెప్పాలి. ఉపాధ్యాయుడు మారుతున్న కాలానికనుగుణంగా అధ్యాపనం కోసం నిత్యవిద్యార్థిగా సాంకేతికతను అలవరచుకుని ఆధునిక గురువుగాతన పాత్ర పోషించాల్సి వస్తున్నది.
పూర్వము విద్యావ్యవస్థ ఆధునిక కాలానికి భిన్నంగా ఉండేది. గురుశిష్యుల మధ్య సంబంధాల్లో గురువుదే అగ్రస్థానంగా ఉండేది. విద్యార్థులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేని కాలం. విద్య లేదా జ్ఞానం పవిత్రమైన దని భావించబడినందున దానినెవ్వరూ అమ్మడానికి కానీ, కొనడానికి కానీ ఆస్కారం లేని కాలం. అంతేకాదు విద్యగడించడానికి వచ్చినవారికి ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేసేవారు. దీనికి ఉన్నతాదాయ వర్గాలు, ధనవంతులు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేవారు. కానీ నేడు విద్యను వ్యాపార వస్తువుగా చూడడం సాధారణమై పోయింది. పాలకులు బాధ్యతగా అందించాల్సిన ”విద్య” దశాబ్దాలానంతరమైనా ప్రాథమిక హక్కుగా చేసి ‘అందరికీ నాణ్యమైన విద్య’ అంటూ చెప్పుకుంటున్న ప్పటికీ అందించే విద్యలో అంతరాలు గోచరిస్తూనే ఉన్నాయి. విద్యారంగ విలువలు, గురుశిష్యుల సంబంధాలు సైతం తారుమా రయ్యాయి. సంపాదనే ధ్యేయమై పోతున్న కాలంలో సామాజిక స్పహ సైతం కొరవడుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. వినిమయ సంస్కతి మొత్తం సమాజాన్నే శాసిస్తున్న పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు దానికి అతీతుడుగా ఉండడం కష్టమైన పనే. ఆధునిక జీవన విధానాల ప్రభావం ఉపాధ్యా యునిపై సైతం ఉంటుందనేది వాస్తవం.
ఉన్నత విద్యార్హతలు కలిగి ఉపాధ్యాయ వత్తిని అభీష్టంతో కాకుండా అవకాశం, ఉపాధి అవసరాల రీత్యా చేపట్టినవారు తమకంటే తక్కువ విద్యార్హతలు, సర్వీసు కలిగిన ఉద్యోగులకుండే పదోన్నతులు, పైస్థాయి అధికార పోస్టింగులు చూస్తూ కొంత అసంతప్తికి గురిఅవుతున్న పరిస్థితులున్నాయి. దానికితోడు ఇద్దరు టీచర్లే ఐదు క్లాసులు, పద్దెనిమిది సబ్జెక్టులు బోధించాల్సిన పరిస్థితి, సబ్జెక్టు టీచర్లకొరత, వివిధ స్థాయిల్లో ఉన్న విద్యార్థులకనుగుణమైన బోధన, మండల, జిల్లాస్థాయి అధికారులు మాటిమాటికీ అడిగే విద్యార్థుల ఇత్యాది వివరములనందించే బోధనేతర పనులతో అష్టావధానంలాగా విసుగు కల్గించే పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఇక బోధనా పద్ధతులకు సంబంధించి ఉపాధ్యాయుల సరైన భాగస్వామ్యం లేకుండానే కేంద్ర,రాష్ట్రస్థాయిలో తీసుకొనే నిర్ణయాలు, తరగతిలో టీచరు స్వేచ్ఛాయుత బోధనకు ఆటంకాలుగా మారుతున్న వైనం షరామాములే. పాఠశాల భౌతిక పరిస్థితులు, మౌలిక సదు పాయాల సమస్యలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు పాలకులపై ఒత్తిడి కోసం సమాజాన్ని జాగతపరచడం అవసరం. విద్యలో సమాజ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించే పెడ ధోరణులకు అడ్డుకట్టవేయాలి. ఉపాధ్యాయుడు తన హోదాపట్ల సంతప్తికరమైన భావనతో బోధనకే అంకితమయ్యే పరిస్థితులు అవశ్యం. అప్పుడే మనం యేటా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవానికి సార్థకత!
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం)
పాపన్నగారి మాణిక్‌రెడ్డి
9440064726