మహారాష్ట్ర, కర్నాటక వాదనలూ వినాల్సి ఉంది
సివిల్ సూట్‌తో రావాలని సుప్రీంకోర్టు సూచన
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై రిట్ పిటిషన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ : పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు. పిటిషన్ ఉపసంహరణ నేపథ్యంలో కేసును డిస్పోజ్ చేసినట్టుగా ధర్మాసనం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు నీటిని తరలించే లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేవని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తన పిటిషన్‌లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోరుమల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలంగాణా ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. నల్లమల సాగర్ అంశంపై రిట్ పిటిషన్‌తో ముందుకు వెళ్లడం ప్రయోజనకరం కాదని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు రిట్ పిటిషన్ సరైన మార్గం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలతో పరిష్కారం పొందేందుకు ధర్మాసనం అనుమతినిస్తుందన్నారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తమ వాదనలు, అభ్యంతరాలను వినిపించాలంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. అదే సరైన న్యాయపరమైన మార్గమని అభిప్రాయపడ్డారు. గోదావరి నదీ జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ రిట్ పిటిషన్‌లో కర్నాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలను చేర్చలేదని, కానీ మీరు బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఆయా రాష్ట్రాలు కూడా వాటాదారులేనని పేర్కొన్నారని జస్టిస్ జోరుమల్య బాగ్చి అన్నారు.
ఈ అవార్డులో వాటాదారులు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదని, మహారాష్ట్ర, కర్నాటక కూడా ఉన్నాయని తెలిపారు. ఆ అవార్డుల ఉల్లంఘనకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ మీరు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఆయా రాష్ట్రాలను పార్టీలుగా చేర్చలేదని జస్టిస్ బాగ్చి అన్నారు. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. దీంతో తమ పిటిషన్ ఉపసంహరించుకుంటామని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. సివిల్ సూట్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ ఆఫ్ చేసినట్టు ఆయన ప్రకటించారు.అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలతో రిట్ పిటిషన్ వేశామని, గత సోమవారం కూడా విచారణ జరిగిందని అన్నారు.
ఈ సోమవారం కూడా అదనంగా మరికొన్ని వాదనలను తెలంగాణ ప్రభుత్వం తరపున వినిపించామని తెలిపారు. కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశమని, ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని అన్నారు. వాటిని సుప్రీంకోర్టు దష్టికి తీసుకెళ్లామని, స్టాప్ వర్క్ ఆర్డర్‌ను అమలు చేయడం లేదని తెలిపామని పేర్కొన్నారు. ఏపీకి 484.5 టీఎంసీలు కేటాయించారని, కానీ అంతకంటే ఎక్కువ నీళ్లు ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుతో ముందుకు వెళ్తుందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ముందు డిజైన్ చేసిన దానికంటే అదనంగా ఏమీ చేయడానికి వీల్లేదని వాదించామని, పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ ఫామ్‌కు అదనంగా మార్పులు చేయడానికి వీల్లేదని వాదనలు వినిపించామని తెలిపారు.



