అసెంబ్లీలో హోం శాఖ పై
మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత సక్రమంగా నిర్వహించబడుతున్నాయని, మతపరమైన పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి హోం శాఖ బడ్జెట్ డిమాండ్లపై చర్చకు సమాధానమిస్తూ, తెలంగాణ పోలీసుల సమగ్ర పనితీరును ఆయన వివరించారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బోనాలు, గణేష్ నిమజ్జనం, రంజాన్, మొహర్రం వంటి భారీ పండుగలతో పాటు మేడారం జాతరను కూడా పటిష్ట బందోబస్తుతో విజయవంతంగా పూర్తి చేశామని, వరదల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వేలాది మందిని రక్షించిన పోలీసుల సేవలు అమోఘమని కొనియాడారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని, ఇందులో దేవ్ జి, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలు ఉన్నారని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు డిజిపి ఎదుట లొంగిపోవడం రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. లొంగిపోయిన వారిలో ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారన్నారు. రాష్ట్ర రాజధాని విస్తరణకు అనుగుణంగా ‘ఫ్యూచర్ సిటీ కమిషనరేట్’ను ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం తెలిపారు. సైబర్ నేర బాధితుల కోసం ‘సి-మిత్ర’ వర్చువల్ హెల్ప్ డెస్క్, మహిళల భద్రత కోసం ‘టీ-సేఫ్’ యాప్ వంటి వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామన్నారు. మిస్ వరల్డ్ కార్యక్రమం, గ్లోబల్ సమ్మిట్, మెస్సి పాల్గొన్న ఫుట్‌బాల్ మ్యాచ్ వంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌లకు పటిష్ట భద్రత కల్పించామని గుర్తుచేశారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం రూపొందించిన ‘వెరీ ఫాస్ట్ యాప్’కు జాతీయ గుర్తింపు లభించిందని శామీర్ పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ ఉత్తమ స్టేషన్‌గా నిలిచిందని ప్రకటించారు. పోలీసు సిబ్బంది పిల్లల కోసం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ప్రారంభించామని, 30 వేల మంది సిబ్బందిని గ్రాడ్యుయేట్లుగా మార్చేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కోసం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని, పర్యాటకుల కోసం కొత్తగా ‘టూరిస్ట్ పోలీస్’ విభాగాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశంసించిందని మంత్రి గుర్తు చేశారు.
అగ్నిమాపక శాఖను ‘తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ’గా మారుస్తూ ఆధునీకరించామన్నారు. 147 ఫైర్ స్టేషన్ల ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడామని, భారీ భవనాల కోసం 104 మీటర్ల హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌లను సేకరిస్తున్నామని చెప్పారు. జైళ్ల శాఖలో ‘మిషన్ పరివర్తన’ ద్వారా ఖైదీల సంస్కరణకు పెద్దపీట వేస్తున్నామని, 22 మార్చి నాడు సిద్దిపేటలో నూతన జిల్లా జైలును ప్రారంభించామని తెలిపారు. ఖైదీల్లో మత్తు అలవాట్లను మాన్పించేందుకు ‘నివృత్తి’ కేంద్రాలను, చదువుకునే వారి కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని, మాజీ సైనికులు 100శాతం వైకల్యం కలిగిన సైనికుల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. పేద ఖైదీలకు బెయిల్, జరిమానాల చెల్లింపులో సహాయం చేసే పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులది అగ్రస్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



