Wednesday, May 7, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం

- Advertisement -

– మామిడి రైతులకు అపార నష్టం
– నెలరోజులైనా కాంటాలు కాని వైనం
– తడిసిన ధాన్యం.. రైతులకు తప్పని పాట్లు
– విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
నవతెలంగాణ-పాలకుర్తి/పర్వతగిరి

ఆరుగాలం శ్రమించి పంటను పండించిన రైతన్నకు అడుగడుగునా పాట్లు తప్పడం లేదు. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురుగాలుల బీభత్సంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సోమవారం ఈదురుగాలులు, వడగండ్లు బీభత్సం సృష్టించాయి. దాంతో పాలకుర్తి మండలంలో మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని 85 ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. పాలకుర్తితో పాటు పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. అకాల వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తడవడంతో వాటిని ఆరపెట్టేందుకు రైతులకు ఇబ్బందిగా మారింది.
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం పోసి నెల రోజులు దాటినా కాంటాలు కావడం లేదని, మరో 20 రోజుల్లో వరి నారు పోసుకునే సమయం వస్తుందని, నేటికీ కాంటాలు కాకపోతే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వడ్లు మూడుసార్లు తడిసినా వాటి రక్షణకు కనీసం టార్పలిన్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో 15000 బస్తాల ధాన్యం నిల్వ ఉన్నాయని, వాటిలో కాంటాలు జరిగిన 5000 బస్తాలు కూడా ఉన్నాయని, అవన్నీ తడిసిముద్దయ్యాయని వాపోతున్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట డివిజన్‌లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం రాసులపై తాడిపత్రిలు కప్పి కాపాడేందుకు రైతులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పర్వతగిరి మండలంలో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. బలమైన గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్న సమయంలో ఈ అకాల వర్షం, గాలులు బీభత్సం సృష్టించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
పట్టాలు సరఫరా చేయాలి : నీలిమ, మహిళా రైతు, తొర్రూరు
ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు అవుతుంది. పట్టాలు ఇవ్వలేదు, అడిగితే లేవని చెప్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ధాన్యం తడిచింది. నెల్లికుదురు నుంచి ధాన్యం తీసుకొచ్చి తొర్రూరు గోదాముల్లో చేరుస్తున్నారు. కానీ తొర్రూరు రైతులకు గోదాములు ఇవ్వడం లేదు. కాంటాలు జరిగినప్పటికీ మిల్లులకు తరలించకపోవడంతో ఆ ధాన్యం కూడా తడిసిపోయింది.
త్వరగా కాంటాలు నిర్వహించాలి : చామకూరి ఐలయ్య, రైతు, తొర్రూరు
స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో పీఏసీఎస్‌ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి 1200 బస్తాల ధాన్యం తెచ్చి నెల రోజుల వుతుంది. ఇప్పటికే రెండుసార్లు ధాన్యం తడిచింది. మొత్తం సెంటర్‌లో రాత్రి కురిసిన వానకి 5000 బస్తాలు తడిసి ముద్దయినాయి. పట్టించుకునే వాడు లేడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -