Wednesday, December 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆస్ట్రేలియా ఉగ్రదాడికి హైదరాబాద్‌తో లింకులు

ఆస్ట్రేలియా ఉగ్రదాడికి హైదరాబాద్‌తో లింకులు

- Advertisement -

సాజిద్‌ అక్రమ్‌ టోలిచౌకీ కాలనీవాసిగా గుర్తింపు
దేశంలో ఉగ్రచర్యల్లో సాజిద్‌కు సంబంధాల్లేవు : డీజీపీ శివధర్‌రెడ్డి

నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
ఆస్ట్రేలియాలో నరమేధానికి పాల్పడ్డ ఐసీస్‌ ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలున్నట్టు తేలింది. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు. సాజిద్‌ అక్రమ్‌ టోలిచౌకీలోని కాలనీ వాసి అనీ, హైదరాబాద్‌లోనే బీ.కామ్‌ వరకు చదివిన సాజిద్‌ అక్రమ్‌ 1998లో స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడ్డారని ఆయన తెలిపారు. అనంతరం ఇటలీకి చెందిన మహిళను వివాహమాడిన సాజిద్‌ అక్రమ్‌కు ఒక కొడుకు, కూతురు ఉన్నారని తెలిపారు. కాగా గత 25 ఏండ్లలో కేవలం 6 మార్లు మాత్రమే హైదరాబాద్‌కు సాజిద్‌ అక్రమ్‌ వచ్చి వెళ్లారని డీజీపీ తెలిపారు. 2017లో తండ్రి చనిపోయినప్పుడు అతను రాలేదనీ, తర్వాత 2022లో ఆస్తిపరమైన వివాదాలను చక్కదిద్దుకోవడానికి వచ్చిపోయాడని డీజీపీ వివరించారు.

సిడ్నీలోని బీచ్‌ వద్ద 14వ తేదీన సాజిద్‌ అక్రమ్‌ కుమారుడు నవీద్‌ అక్రమ్‌తో కలిసి జరిపిన కాల్పుల్లో 15 మంది విహార యాత్రకు వచ్చిన వారు చనిపోగా, మరో 25 మంది వరకు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆస్ట్రేలియా పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్‌ అక్రమ్‌ మరణించగా, నవీద్‌ అక్రమ్‌ తీవ్రంగా గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సాజిద్‌ అక్రమ్‌కు 1998 కంటే ముందు హైదరాబాద్‌లో ఎలాంటి నేర చరిత్ర లేదనీ, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అతనికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్టు దాఖలాలు లేవని తమ విచారణలో తేలిందని శివధర్‌ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాక ఇక్కడ తమ కుటుంబ సభ్యులెవ్వరితోనూ సంబంధాలు పెట్టుకోలేదనీ, కేవలం ఆస్తిపరమైన వ్యవహారాలు మాత్రమే చూసుకున్నాడని ఆయన అన్నారు. అయినప్పటికీ సాజిద్‌ అక్రమ్‌కు సంబంధించి తెలంగాణలో ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. మరోవైపు సాజిద్‌తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని అతని సమీప కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -