Tuesday, April 29, 2025
Navatelangana
Homeజిల్లాలుపహల్గాంలో ఉగ్రదాడి కిరాతకమైన చర్య

పహల్గాంలో ఉగ్రదాడి కిరాతకమైన చర్య

- Advertisement -

-సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా నాయకులు వి.ప్రభాకర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో అత్యంత క్రూరంగా దాడి చేసి 28మంది భారత పౌరులను చంపేయడం అత్యంత కిరాతకమైన చర్య అని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి. ప్రభాకర్ అన్నారు.పహల్గాంలో అమాయక హిందూ సోదరులపై ఉగ్రదాడిని పాశావీక, అనాగరికమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు.  సోమవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం తో కలిసి ఆయన మాట్లాడారు.జమ్మూ కాశ్మీర్ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుండి కుటుంబాలతో వస్తారన్నారు. అలాంటి ప్రదేశంలో మానవత్వం మరిచిన మతపిశాచకులు చేసిన దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  సాధారణ పర్యాటకులే లక్ష్యంగా ఆర్మీ యూనిఫాంలో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి, దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్టు, కాల్చి మరణహోమం చేసిన మత ఉన్మాదుల చర్యలను పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నామన్నారు. 28మంది పౌరులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రముఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులపై ఉగ్రవాదుల దాడిని యావత్ భారత్ ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు.ఈ దాడి తీవ్రమైన దిగ్భ్రాంతికరం, ఇది అమానవీయ చర్య, క్షమించరానిదన్నారు. ఉగ్రదాడులకు పాల్పడే వారిపై యావత్ దేశం ఐక్యంగా పోరాడుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి పరిస్థితి నెలకొల్పామని మోడీ గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఉగ్రవాదుల దాడి అంతర్గత సమాచార అందించే కేంద్రాల వైఫల్యంకు అద్దం పడుతుందన్నారు.

జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితి కొరకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.370 ఆర్టికల్ రద్దుచేసి రాష్ట్రాన్ని మొత్తాన్ని కేంద్రమే తన ఆధీనంలోకి తీసుకోవడం స్వేచ్ఛను హరించివేయడమే అవుతుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాన్ని నామమాత్రంగా చేసి వారి హక్కుల్ని కేంద్రమే స్వాధీనం చేసుకోవడం  అక్కడి ప్రజల్ని అవమాన పరచడమే అవుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్  పౌరుల ప్రాణాలకు పగడ్బందీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో మరణించిన వారికి కోటి రూపాయలు, గాయపడ్డ వారికి పది లక్షల నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి. కిషన్, ప్రజాపంథా పార్టీ కమ్మర్ పల్లి మండల కార్యదర్శి బషీరి అశోక్,  టియుసిఎల్ రాష్ట్ర నాయకురాలు వి.సత్యక్క  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు