Friday, March 20, 2026
E-PAPER
Homeజాతీయంప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు

ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు

- Advertisement -

యుద్ధం ఇలాగే సాగితే ప్రమాదం
యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ నీలకంఠ హెచ్చరిక

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభం ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయనుందని యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌, యాక్సిస్‌ కాపిటల్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ హెడ్‌ నీలకంఠ మిశ్రా హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ కొనసాగిస్తోన్న ఉద్రిక్తతలు వచ్చే నాలుగు వారాల పాటు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు 7 శాతం మేర అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ఇది కేవలం చమురు ధరల పెరుగుదల మాత్రమే కాకుండా నేరుగా ఇంధన కొరతకు దారితీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంధన సరఫరాలో 4 శాతం నుంచి 5 శాతం మేర అంతరాయం కలిగితేనే ప్రపంచ జీడీపీలోనూ 4 నుంచి 5 శాతం కోత పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి కంపెనీల వద్ద ఉన్న నిల్వలకారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ సరఫరా గొలుసులో ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని మిశ్రా పేర్కొన్నారు. ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌, వాహన తయారీ రంగాలు కీలక ముడిసరుకుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన గుర్తు చేశారు. గ్యాస్‌ కొరతతో సూరత్‌ టెక్స్‌టైల్‌ రంగంలో ఇబ్బందులు నెలకొన్నాయన్నారు.

ఇది కేవలం ఇంధనానికే పరిమితం కాకుండా మొత్తం ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఆర్థిక నష్టం విపరీతంగా పెరిగి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల నుండి ఒత్తిడి పెరిగినప్పుడే యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని మిశ్రా అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభం వల్ల కలిగే ఆర్థిక భారంతో అన్ని దేశాలు నష్టపోతాయని హెచ్చరించారు. అందుకే ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగకపోవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలకు ఏదైనా నష్టం వాటిల్లితే మాత్రం పరిస్థితి మరింత దిగజారి.. జీడీపీ రికవరీ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -