Monday, July 14, 2025
E-PAPER
Homeజాతీయంఉప్పుతో ముప్పు..

ఉప్పుతో ముప్పు..

- Advertisement -

– దేశంలో మోతాదుకు మించి వినియోగం :ఐసీఎంఆర్‌
– తెలంగాణ, పంజాబ్‌లలో ఎన్‌ఐఈ అధ్యయనం
న్యూఢిల్లీ :
దేశంలో మోతాదుకు మించి ఉప్పు వినియోగం ఉంటోందని, దీని ప్రతికూల ఫలితాలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిలో ముప్పు మరింత పెంచుతోందని ఐసీఎంఆర్‌ కు చెందిన ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమిడ మాలజీ (ఎన్‌ఐఈ)’ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉప్పు వినియోగం తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అధ్యయనం చేయడంతో పాటు తక్కువ సోడియం ఉన్న ప్రత్యామ్నాయ ఉప్పుపై దృష్టి సారిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిబంధనల ప్రకారం.. ఓ వ్యక్తి రోజులో 5గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ, భారత్‌లో పట్టణ ప్రాంతాల ప్రజలు రోజుకు 9.2 గ్రాములు తీసుకుంటుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వినియోగం 5.6 గ్రాములుగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.


సోడియానికి బదులు..
ఉప్పులోని సోడియం క్లోరైడ్‌లో కొంతభాగాన్ని పొటాషియం లేదా మెగ్నీషియం లవణాలతో భర్తీ చేయడం ఆశాజనకంగా కనిపిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎన్‌ఐఈ సీనియర్‌ శాస్త్రవేత్త డా.శరణ్‌ మురళి పేర్కొన్నారు. సోడియం తక్కువ తీసుకోవడం.. రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌ తో బాధపడేవారికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. రక్తపోటు దాదాపు 7/4 ఎంఎంహెచ్‌జీ తగ్గుతుందని.. ఈ చిన్న మార్పు చాలా పెద్ద ప్రభావం చూపుతుందన్నారు.ఐసీఎంఆర్‌ సాయంతో తెలంగాణ, పంజాబ్‌లలో మూడేండ్ల వ్యవధితో కూడిన అధ్యయనాన్ని ఎన్‌ఐఈ ప్రారంభించింది. రక్తపోటు ఉన్న వ్యక్తుల్లో ఉప్పు తగ్గింపు ప్రభావాన్ని అంచనా వేయడం, దీనిపై కౌన్సిలింగ్‌ ఇవ్వడం వంటి లక్ష్యాలతో దీన్ని చేపట్టినట్టు డా.గణేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం అధ్యయనం తొలి ఏడాదిలో ఉందని, క్షేత్రస్థాయి సన్నద్ధత, అంచనాలపై పనిచేస్తున్నామని చెప్పారు. దీనిపై గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో కలసి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.


లభ్యత తక్కువే..
మార్కెట్‌లో తక్కువ సోడియం ఉప్పు (ఎల్‌ఎస్‌ఎస్‌) లభ్యత ధర ఎలా ఉందనే దానిపై చెన్నైలో 300 రిటైల్‌ దుకాణాల్లో ఎన్‌ఐఈ సర్వే చేపట్టింది. 28శాతం రిటైల్‌ దుకాణాల్లో, 52 శాతం సూపర్‌ మార్కెట్లలో లభ్యమవుతుండగా.. కేవలం 4శాతం చిన్న కిరాణా దుకాణాల్లోనే ఇది అందుబాటులో ఉన్నట్టు తేలింది. అంతేకాదు, సాధారణ ఉప్పు ధర 100గ్రాములకు రూ.2.7 ఉండగా.. ఎల్‌ఎస్‌ఎస్‌ ధర రూ.5.6గా ఉందని వెల్లడైంది. తక్కువ సోడియం కలిగిన ప్రత్యామ్నాయాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -