Monday, July 28, 2025
E-PAPER
Homeఆటలుఇక తేలేది టైబ్రేకర్‌లోనే

ఇక తేలేది టైబ్రేకర్‌లోనే

- Advertisement -

హంపి, దివ్య రెండో గేమ్‌ సైతం డ్రా
ఫిడె మహిళల చెస్‌ ప్రపంచకప్‌
ఫిడె మహిళల చెస్‌ ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతుంది. ప్రపంచ మహిళల చెస్‌ కిరీటం భారత్‌ ఖాతాలో పడినా.. ఆ ఘనత దక్కించుకునే రేసులో వెటరన్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి, యువ గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌లు బటుమిలో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. క్లాసికల్‌ ఫార్మాట్‌లో జరిగిన తొలి రెండు గేముల్లో హంపి, దివ్య సమవుజ్జీలుగా నిలిచారు. దీంతో చాంపియన్‌ను టైబ్రేకర్‌లో తేల్చనున్నారు. సోమవారం టైబ్రేకర్‌లు జరుగుతాయి.
బటుమి (జార్జియా) : ఫిడె మహిళల చెస్‌ క్వీన్‌ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. భారత వెటరన్‌ గ్రాండ్‌మాస్టర్‌, తెలుగు తేజం కోనేరు హంపి, భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌లు ప్రపంచ చెస్‌ ప్రపంచకప్‌లో అమీతుమీ తేల్చుకుంటున్నారు. శనివారం జరిగిన తొలి గేమ్‌లో అటు హంపి, అటు దివ్యలు పొరపాటు చేసినా.. ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో ఇద్దరూ ఎంతో జాగ్రత్తగా ఎత్తులు వేశారు. తెల్ల పావులతో ఆడిన కోనేరు హంపి.. ఓ సమయంలో దివ్య నుంచి క్వీన్‌ ట్రేడ్‌ను తిరస్కరించినా.. ఆఖరుకు డ్రా ఆఫర్‌ను అంగీకరించింది. క్లాసికల్‌ ఫార్మాట్‌లో జరిగిన తొలి రెండు గేములు డ్రాగా ముగిశాయి. 1-1తో హింపి, దివ్య సమవుజ్జీలుగా నిలిచారు. చెస్‌ ప్రపంచకప్‌ విజేతను తేల్చేందుకు గేమ్‌ ఫార్మాట్‌ టైబ్రేకర్‌కు మారనుంది. వరుసగా ఏదేని రెండు టైబ్రేకర్లలో పైచేయి సాధించిన గ్రాండ్‌మాస్టర్‌ అంతిమ విజేతగా నిలువనుంది.
34 ఎత్తుల్లోనే..
తొలి గేమ్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో విజయం సాధిస్తే టైటిల్‌ సొంతం చేసుకునే అవకాశం ముందుండగా.. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌లు ఆచితూచి ఆడారు. తీవ్ర ఒత్తిడిలోఎవరూ రిస్క్‌ తీసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో రెండో గేమ్‌ సాదాసీదాగా సాగింది. టెక్ట్స్‌బుక్‌ ఫార్మాట్‌ తరహాలో సాగిన మ్యాచ్‌లో తెల్ల పావులతో ఎత్తులు వేసిన కోనేరు హంపి.. 34 ఎత్తుల తర్వాత దివ్య దేశ్‌ముఖ్‌ డ్రా ప్రతిపాదనకు సమ్మతించింది. దీంతో ఇరువురు చెరో అర పాయింట్‌ ఖాతాలో వేసుకున్నారు. క్వార్టర్‌ఫైనల్‌ నుంచి మేటీ గ్రాండ్‌మాస్టర్లను మట్టికరిపించి టైటిల్‌ పోరుకు చేరుకున్న దివ్య దేశ్‌ముఖ్‌ అండర్‌డాగ్‌ ట్యాగ్‌తో సీనియర్‌ జీఎం హంపిని ఒత్తిడిలో పడేసేందుకు ప్రయత్నిస్తుంది. సెమీఫైనల్లో సహచర భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికను టైబ్రేకర్‌లోనే ఓడించిన దివ్య దేశ్‌ముఖ్‌.. మరి ఫైనల్లో ఏం చేస్తుందో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -