నలుగురు మహిళా కూలీలు మృతి
పలువురికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఘటన
నవతెలంగాణ- మల్లాపూర్
వ్యవసాయ కూలీ పనికి వెళ్లిన మహిళా కూలీల ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన సుమారు 12 మంది మహిళా కూలీలు పసుపు రిక్కా పనికి వెళ్లారు. తిరిగి సాయంత్రం ట్రాక్టర్‌పై గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొగిలిపేట గ్రామానికి చెందిన మంగళరాపు లలిత(45), పెద్దిరెడ్డి గంగు(50), సంపంగి లక్ష్మి(35), రొడ్డ వైష్ణవి(15) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందగానే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంతో మొగిలిపేట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వ్యవసాయ కూలీల ట్రాక్టర్ బోల్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



