Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంట్రాన్స్‌జెండర్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలి

ట్రాన్స్‌జెండర్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

– తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ పీపుల్స్‌
– అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మోనాలిసా డిమాండ్‌
– కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
– నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్‌

ట్రాన్స్‌జెండర్‌ బిల్లు -2026ను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ పీపుల్స్‌ అసోసియే షన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మోనాలిసా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్‌కే హల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్ల అస్తిత్వంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతూ..కొత్త చట్టం ప్రజాస్వామ్య విరుద్ధం.. సుప్రీంకోర్టు తీర్పులను ధిక్కరించే విధంగా ఉందని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులు హరించబడుతున్నాయని, హక్కులను కాలరాసే ఏ చట్టాన్నైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లో తిప్పికొట్టడం తమ హక్కు అని అన్నారు. ట్రాన్స్‌జెండర్‌ హక్కులను కాలరాస్తే.. కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. అతి త్వరలో మేధావులు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఆల్‌ ఇండియా ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ ప్రతినిధి రచన ముద్రబోయిన మాట్లాడుతూ.. కొత్త నిబంధనలు ట్రాన్స్‌జెండర్లపై వివక్షను మరింత పెంచేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గుర్తింపును తామే నిర్ణయించుకునే హక్కును ప్రభుత్వం పరిమితం చేయాలని చూస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వివాదాస్పద 2026 ట్రాన్స్‌జెండర్‌ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ట్రాన్స్‌జెండర్లకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రక్షణ కల్పించాలని కోరారు. సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ట్రాన్స్‌జెండర్లపై అణచివేతను అడ్డుకోవాలన్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కార్యకర్తలు రింకు, పప్పీ, సోనా రాథోడ్‌, అక్షర, నిత్య, వాసవి, శృతి, సిల్క్‌ అప్పు, అభి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -