Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంట్రయల్‌ కోర్టు తీర్పు వ్యవస్థకే విరుద్ధం

ట్రయల్‌ కోర్టు తీర్పు వ్యవస్థకే విరుద్ధం

- Advertisement -

– అది ఒక్క నిమిషం కూడా రికార్డుల్లో ఉండటానికి వీల్లేదు
– లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ హైకోర్టు ముందు సీబీఐ వాదనలు
– కౌంటర్‌ దాఖలుకు ప్రతివాదులకు మూడు వారాల గడువు
– తదుపరి విచారణ ఏప్రిల్‌6కు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పు ఒక్క నిమిషం కూడా రికార్డుల్లో ఉండడానికి వీల్లేదని సీబీఐ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ కేసులో నిందితులందరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో పాటు, ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ (ఐఓ)పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడం వ్యవస్థకే విరుద్ధమని వాదనలు వినిపించింది. లిక్కర్‌ స్కాం వ్యవహారంలో సీబీఐ కేసులో ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ మంత్రి మనీష్‌ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా 23 మందికి రౌస్‌ ఎవెన్యూ కోర్టు(సీబీఐ స్పెషల్‌ కోర్టు) స్పెషల్‌ జడ్జి జితేంద్ర సింగ్‌ ఫిబ్రవరి 27న క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా… సీబీఐ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని, వందలాది పేజీలతో ఛార్జ్‌షీట్‌ తయారు చేసినా ఒక్క సాక్షి ప్రకటనను కూడా ఖచ్చితంగా చేర్చలేకపోయారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఐఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తన తీర్పులో స్పష్టం చేశారు.
ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఈ నెల 1న సీబీఐ దాదాపు 974 పేజీలతో ఢిల్లీ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సోమవారం మరోసారి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ ఎన్‌ హరిహరన్‌, ఇతరుల తరఫున పలువురు అడ్వొకేట్లు హాజరయ్యారు.

తొలుత జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ జోక్యం చేసుకొని… ఈ కేసులో సీబీఐ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం కోరుతున్నారా? అని ప్రారంభంలోనే ప్రశ్నించారు. ఇందుకు కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ… సీబీఐ అధికారి (ఐఓ)పై ట్రయల్‌ కోర్టు వ్యాఖ్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేసినట్టు నివేదించారు. అలాగే ఈ కేసు విచారణను ఇతర బెంచ్‌కి బదిలీ చేయాలన్న తమ విజ్ఞప్తిని… హైకోర్టు తిరస్కరించడంపై కూడా సుప్రీంలో రిట్‌ పిటిషన్‌ వేసినట్టు తెలిపారు. అలాగే ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ‘డిశ్చార్జ్‌’ (కేసు నుంచి విముక్తి) ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని నిందితుల తరఫు అడ్వొకేట్లు కోరారు.
దీనిపై సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ”ఇదొక అలవాటుగా మారింది. ఆరోపణలు చేయడం.. తర్వాత పారిపోవడం. ఇలాంటి వ్యాజ్యాలను ప్రోత్సహించకూడదు. ఆరోపణలు చేయడమే కొందరికి కెరీర్‌గా మారింది” అని వ్యాఖ్యానించారు. అలాగే, ట్రయల్‌ కోర్టు సీబీఐ దర్యాప్తును తప్పుబడుతూ ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ.. ”ఆ తీర్పు వ్యవస్థకే విరుద్ధం. అది ఒక్క నిమిషం కూడా రికార్డుల్లో ఉండటానికి వీల్లేదు” అన్నారు. ప్రతివాదులు కావాలనే విచారణను సాగదీస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి… ప్రతివాదులు తమ వాదనలు వినిపించేందుకు హక్కు ఉంటుందని తెలిపారు. అలాగే సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలన్న ఇతర ప్రతివాదుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రెండు వారాల గడువు ఇచ్చారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 6వ తేదీకి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -