యుద్ధ వార్తలను వక్రీకరిస్తున్నారని గగ్గోలు
లైసెన్సులు రద్దు చేస్తామని బెదిరింపు
వాషింగ్టన్ : మీడియా సంస్థలు ఇరాన్ యుద్ధ వార్తలను వక్రీకరిస్తున్నాయని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. అలాంటి సంస్థల ప్రసార లైసెన్సులను రద్దు చేస్తామని బెదిరించింది. మీడియా సంస్థలు విధిగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రసారాలు చేయాలని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మెన్ బ్రెండన్ కార్ హితవు పలికారు. లేకుంటే లైసెన్సులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మీడియా సంస్థలు తప్పుడు వార్తలను అందిస్తున్నాయని, లైసెన్సులను రెన్యువల్ చేసుకునే ముందు ఆ తప్పిదాలను సవరించుకునేందుకు అవకాశం ఉన్నదని చెప్పారు. కార్ గత సంవత్సరం ఏబీసీ ఛానల్‌ను, దాని పంపిణీదారులను పిలిపించి హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే.
ట్రంప్‌ను విమర్శిస్తూ ఆ ఛానల్‌లో వచ్చిన ఓ కార్యక్రమంపై ఆయన మండిపడ్డారు. కాగా కార్ తాజా ప్రకటనపై రాజకీయ నేతలు, భావ ప్రకటనా స్వేచ్ఛను కోరుకుంటున్న కార్యకర్తలు మండిపడ్డారు. కార్ వ్యాఖ్యలు సెన్సార్‌షిప్‌కు దారి తీస్తాయని విమర్శించారు. సౌదీ అరేబియాలో ఇరాన్ జరిపిన దాడిలో అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయంటూ ‘ఫేక్ న్యూస్ మీడియా’ తప్పుడు ప్రచారం చేసిందని ట్రంప్ కన్నెర్ర చేశారు. కొద్ది రోజుల క్రితం స్థావరంపై దాడి జరిగినప్పటికీ విమానాలు దెబ్బతినలేదని లేదా ధ్వంసం కాలేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇలాంటి వ్యతిరేక వార్తలను ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



