– డబ్బుతో చట్టబద్ధమైన నివాస హోదా, అమెరికా పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు
– సంపన్నులు, బడా కంపెనీలకే ప్రయోజనకరం
– విదేశీ నిపుణులను ఆకర్షించడానికే : ట్రంప్
– చిన్న సంస్థలకు ఒరిగేదేం లేదు : విశ్లేషకులు
వాషింగ్టన్ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘గోల్డ్ కార్డ్ వీసా’ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం ఆవిష్కరించారు. ఇది పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి డబ్బు చెల్లించేందుకు ముందుకొచ్చే వ్యక్తులు, కంపెనీలకు తొలుత చట్ట బద్ధమైన హోదాను, చివరికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెట్టేందుకు ఉద్దేశించిన అత్యంత ఖరీదైన ఇమ్మిగ్రేషన్. మూడు దశాబ్దాల నాటి ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో అమెరికా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. వ్యక్తిగతంగా లక్ష డాలర్లు లేదా యాజమాన్యాల ద్వారా రెండు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడే విదేశీ యులకు అమెరికాలో శాశ్వత నివాసాన్ని కల్పిం చేందుకు ఈ కార్యక్రమం తలుపులు తెరుస్తుంది.
ట్రంప్ ఏమన్నారంటే…
‘అమెరికా ప్రభుత్వానికి చెందిన ట్రంప్ గోల్డ్‌కార్డ్ ఈ రోజు మీ ముందుకు వచ్చింది. అర్హులైన వారికి, తనిఖీలు పూర్తి చేసుకున్న వారికి పౌరసత్వం పొందేందుకు ఇది నేరుగా దారి చూపుతుంది. కాబట్టి చాలా ఉత్సాహంగా ఉంది. మన ఘనమైన అమెరికా కంపెనీలు తమ వద్ద ఉన్న వెలకట్టలేని నైపుణ్యాన్ని అట్టే పెట్టుకోవచ్చు’ అని ట్రంప్ సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో వ్యాఖ్యానించారు. అమెరికా యూనివర్సిటీలతో పాటు చైనా, భారత్, ఫ్రాన్స్ దేశాల విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అత్యంత నిపుణులైన పట్టభద్రుల సేవలు పొందడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ట్రంప్ తెలిపారు. ప్రపంచ శ్రేణి అభ్యర్థుల వీసా హోదా అనిశ్చితిలో ఉంటే వ్యాపారాలు దెబ్బతింటాయని ఆయన చెప్పారు. ‘అమెరికాలో చదువుకొని తిరిగి భారత్‌కో, చైనాకో, ఫ్రాన్స్‌కో వెళతామని నిపుణులు చెప్పాల్సిన అవసరం లేదు. వారి విషయాన్ని మేము చూసుకుంటాం’ అని గోల్డ్ కార్డును ప్రారంభించిన సందర్భంగా ట్రంప్ తెలిపారు.
విధివిధానాలు ఇలా…
స్పాన్సర్‌షిప్, లాటరీలు, ఎనిమిది లక్షల డాలర్లతో మొదలయ్యే ఈబీ-5 పెట్టుబడులు వంటి వివిధ మార్గాల ద్వారా ట్రంప్ గోల్డ్ కార్డ్ పొందవచ్చు. యాభై లక్షల డాలర్లు చెల్లించి గోల్డ్ కార్డును నేరుగా పొందవచ్చు. అప్పుడు సంప్రదాయ ప్రక్రియల అవసరం లేకుండా త్వరగా మంజూరు అవుతుంది. గోల్డ్ కార్డ్ దరఖాస్తుదారు ఈబీ-1 లేదా ఈబీ-2 వీసా కేటగిరీల కింద చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదా పొందుతారు. ఈ హోదాను లభ్యతను బట్టి అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ధృవీకరిస్తుంది. గోల్డ్ కార్డ్ ఉన్న వారు అమెరికా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వెలుపల సంపాదించే సొమ్ముకు కూడా పన్ను కట్టాలి. ప్రారంభ దరఖాస్తులో భార్య లేదా భర్త, 21 సంవ త్సరాల కంటే తక్కువ వయసున్న అవివాహితులైన పిల్లలను కూడా చేర్చవచ్చు. అయితే ప్రతి కుటుంబ సభ్యుడికీ తనిఖీ ఫీజు కింద పదిహేను వేల డాలర్లు, మిలియన్ డాలర్ల గిఫ్ట్ చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ గోల్డ్ కార్డ్ ఓ వీసా మాదిరిగా పనిచేస్తుంది. దేశ భద్రత, క్రిమినల్ కార్యకలాపాలను కారణంగా చూపి దానిని రద్దు చేయవచ్చు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులు స్పందించే తీరు, పత్రాల సమర్పణను బట్టి గోల్డ్ కార్డ్ పొందడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.
ఓ వైపు ఉక్కుపాదం… మరోవైపు స్వాగతం
ప్రపంచంలోని ‘అత్యంత ఉత్తమ వ్యక్తుల’ను ఆకర్షించడానికి ఈ గోల్డ్‌కార్డ్ దారి చూపుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా యూనివర్సిటీల నుంచి వచ్చిన సంపన్న పట్టభద్రులను ఆకర్షించ డమే కాకుండా అమెరికా ప్రభు త్వానికి ఆదాయాన్ని సమకూర్చే సాధనంగా ఇది ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవైపు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం మరోవైపు ఈ కొత్త కార్యక్రమం ద్వారా విదేశీ యులకు స్వాగతం పలుకు తోంది. విదేశాలలో జన్మించి అసాధారణ నైపుణ్యాన్ని కలిగిన వారిని అమెరికాలో నివసించేందుకు అనుమతిం చాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నారు.
ప్లాటినమ్ కార్డు వచ్చేస్తోంది
త్వరలోనే ట్రంప్ ప్లాటినమ్ కార్డు కూడా రాబోతోంది. ఈ కార్డు ఉన్న వారు అమెరికా వెలుపల పొందుతున్న ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా సంవత్సరానికి 270 రోజులు దేశంలో ఉండవచ్చు. దీని ఖరీదు యాభై లక్షల డాలర్లు. ఇమ్మిగ్రేషన్ తనిఖీ ఫీజు అదనం.
‘గోల్డ్ కార్డ్’ ఉంటే…
గోల్డ్ కార్డ్ బ్రాండ్ ఏదైనప్పటికీ అది గ్రీన్‌కార్డ్‌కు నకలే. అయితే ఇది మరింత మెరుగైనదని, బలమైన దారి చూపుతుందని ట్రంప్ చెబుతున్నారు. గోల్డ్ కార్డును పొందిన వారు అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసాన్ని పొందుతారు. అంటే వారు అమెరికాలో నిరవధికంగా నివసించవచ్చు. పనిచేయవచ్చు. చివరికి అమెరికా పౌరసత్వాన్ని కూడా పొందవచ్చు. ఈ కొత్త కార్డు పొందాలంటే అవసరమైన ఫీజు చెల్లించి, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకుంటే చాలు. విదేశీ పౌరులు అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టి తద్వారా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు లేదా గ్రీన్‌కార్డ్ హోల్డర్లు కావడానికి వీలుకల్పిస్తున్న ఈబీ-5 కార్యక్రమానికి ఇది భిన్నంగా ఉంటుంది.
ఇమ్మిగ్రేషన్ తనిఖీలు తప్పనిసరి
గోల్డ్ కార్డ్ కోసం ప్రతి దరఖాస్తుదారు పదిహేను వేల డాలర్ల తనిఖీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, వారి నేపథ్యమేమిటో తెలుసుకుం టామని వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ చెప్పారు. అర్హులైన నిపుణులు మాత్రమే అమెరికాలో శాశ్వత నివాసం పొందేలా చూసేందుకే పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. గోల్డ్ కార్డ్ పొందే వారికి ఇన్వెస్టర్లు కానీ, యాజమాన్యాలు కానీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరమేమీ లేదు. కార్డుల లభ్యతకు వార్షిక పరిమితులు కూడా ఏవీ ఉండవు. ఫలితంగా కంపెనీలు అనేక కార్డులు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఒక్కో కార్డు ఒక ఉద్యోగికే వర్తిస్తుంది.
సంపన్నులు, బడా సంస్థల కోసమే…
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ కార్యక్రమం రాజకీయ ఉద్రిక్తతలను పరిష్కరించ లేదని, వాటి నుంచి తప్పించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌ను మాగా ఉద్యమకారులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గోల్డ్ కార్డును చూస్తుంటే ఖరీదైన క్రెడిట్ కార్డు గుర్తొస్తోంది. కార్డుపై ట్రంప్ చిత్రాన్ని, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా పతాకాన్ని ముద్రించారు. అయితే ఈ కార్డుకు అనేక పరి మితులు ఉన్నాయి. దీని దీర్ఘకాలిక ప్రభావంపై అనేక ప్రశ్నలు తలెత్తు తున్నాయి. ఉద్యోగ కల్పనతో సంబం ధం లేకుండా గోల్డ్ కార్డును పొందవచ్చు. వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారికి తక్కువ ఖర్చుకు సంబంధించి గోల్డ్ కార్డ్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. ప్రతి కార్పొరేట్ కార్డ్ ఒక ఉద్యోగికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎంతమంది ఉద్యోగులను నియ మించుకుంటే ఖర్చు అంత పెరుగు తుంటుంది. విదేశాలలో జన్మించిన నిపుణులను కంపెనీలోనే అట్టి పెట్టుకోవాలని భావించే యాజమాన్యాలు అనేక మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్యక్రమం కేవలం సంపన్నులకు, బాగా డబ్బున్న కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతుంది. నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న చిన్న చిన్న సంస్థలకు దీనివల్ల ఒరిగే దేమీ ఉండదు. ఎందుకంటే అవి గోల్డ్ కార్డులపై పెద్ద మొత్తాలను వెచ్చించలేవు. లక్షలాది డాలర్లు వెచ్చించి విదేశీ పట్టభద్రులను తీసుకోగలిగిన బడా సంస్థలకే ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంటుంది.



