భారతదేశంలో ఒకప్పుడు విడ్డూరంగా కనిపించిన పరిణామాలు ఇప్పుడు ఎంత మామూలు వ్యవహారాలుగా తయారైనాయంటే అవి ఇంకెంత మాత్రం ఒకప్పటిలా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయడం లేదు. మన రిపబ్లిక్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత భావ ప్రకటనా స్వేచ్ఛకు రక్షణ కల్పించే 19వ అధికరణం సజీవంగా శక్తివంతంగా వుంది గనక ఇది మనకు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. పౌరుల హక్కులు పొందు పర్చడంలో మన రాజ్యాంగం ప్రపంచంలోనే పేరు పొందింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమనే కితాబు కూడా పొం దింది. అయితే ఈ రోజున ఆ పరిస్థితి ఇంకెంతమాత్రం లేదు. ఆరెస్సెస్ శూలంతో బీజేపీ నాయకత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ఆ పరిస్థితి సమూలంగా మారిపోయింది. ముఖ్యంగా మీడియా రంగంలో ఇది కనిపిస్తుంది.
రెండు మీడియా సంస్థలకూ అనేక యూ ట్యూబ్ చానళ్లకు ఇటీవలనే కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నోటీసులు పంపింది. 138 వీడియోలు, 83 ఇన్‌స్టాగ్రాం పోస్టులు తొలగించవల సిందిగా వాటిని ఆదేశించింది. ఇందులో అదానీ గ్రూపునకు సంబంధించిన విమర్శనాత్మక అంశాలు కూడా వుండటమే అప్రతిష్టాకరం. అదానీ సంస్థ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై ఆగేయ ఢిల్లీ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆ నోటీసు ఉటంకించింది. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసుల్లో ఎన్నడూ లేనంత వేగంగా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించిందన్నమాట.
అలా మొదలైంది..
ఈ ఏకపక్ష ఉత్తర్వు ఇచ్చే సమయంలో ఢిల్లీ కోర్టు క్షణమైనా ఆలోచించలేదు. ఈ విషయంలో జరిమానాకు గురైన జర్నలిస్టులు వారి వెబ్‌సైట్ల వైపు వాదనలు వినడానికే సిద్ధపడలేదు. ఈలోగా న్యాయ సంబంధమైన అధికారాలు కూడా గల సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజస్ బోర్డు (సెబీ) పెట్టుబడుల మార్కెట్ నిబంధనల ఉల్లంఘనపై వచ్చిన తీవ్ర ఆరోపణల విచారణకు వెనకడుగు వేసింది. వాటిపై నిజానికి చాలా వేగంగా దర్యాప్తు జరపాల్సి వుంటుంది. హిండెన్‌బర్గ్ నివేదిక ఆదానీ గ్రూపు తప్పులనే వాటిని బహిర్గతం చేసిన తర్వాత వాటిపై బాగా దఅష్టి పెరిగింది. అయినా సరే సెబీ అదానీలు ఎలాంటి తప్పు చేయలేదని ప్రకటించేసింది.
కథనాలు ఉపసంహరించుకోవాలని నోటీసులు అందుకున్న వారిలో న్యూస్ లాండ్రీ, వైర్ సంస్థలతో పాటు జర్నలిస్టులు రవీష్ కుమార్, అజిత్ అంజుమ్, ధఅవ్ రాఠీ, ఆకాశ్ బెనర్జీ (దేశ్‌భక్త్), పరంజరు గుహ ఠాకూర్దాలు వున్నారు. తన కంపెనీ తప్పులను బయటికి రాకుండా చేసుకోవడానికి మోడీ మిత్రుడైన గౌతం అదానీ పరువు నష్టం దావా వేయడమనేది ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు. మతతత్వ కార్పొరేట్ కూటమి వ్యవహరించే తీరు అలాగే వుంటుంది. అయినా ఇందుకు గురైన మీడియా సంస్థలూ వ్యక్తులూ కూడా తము రాసిన దాన్ని సమర్థించుకున్నారు. ఏ ఆధారం లేకుండా పరిశోధన జరపకుండా రాశారనే అభియోగాన్ని వారు తిరస్కరించారు.
ఇది పూర్తిగా అర్థం కావాలంటే మనం ఇండియాలో మీడియా పరివర్తనకు నేపథ్యమేమిటో చూడాలి. అదానీ ఎన్‌డిటివిని దాదాపు పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్న 2022 డిసెంబరు 30వ తేదీ ఒక పెద్ద మలుపు లాంటిది. అందుకోసం ఆంతకు ముందు ఒక బాకీదారుతో ఆ సంస్థ చేసుకున్న రుణ ఒప్పందంతో ముడిపడిన ఒక క్లాజును వారు ఉపయోగించుకున్నారు. అంతకు ముందు కూడా అంటే 2019 నాటికే రిలయన్స్ దేశవ్యాపితంగా 72 మీడియా చానళ్లను అదుపు చేస్తున్నట్టు ఒక నివేదిక చెబుతున్నది. బహుళ చానళ్ల విశ్వరూపంతో వున్నట్టు వారు సగర్వంగా అడ్వర్టయిజ్‌మెంట్లలో ప్రకటించుకున్నారు. ఈ విధంగా కార్పొరేట్ నియంత్రణలోకి చానళ్లు వెళ్లడం, వార్తా కథనాలను రూపురేఖలను శాసించే శక్తి వారి చేతుల్లో సమకూరడం వైవిధ్యానికీ, మీడియా సంపాదక స్వాతంత్య్రానికీ మరణశాసనంగా తయారైంది.
అసలు భయం అదే
189 భాషల్లో, మాండలికాల్లో ప్రచురితమయ్యే 22,000 వేల దినపత్రికలతో సహా 1,40,000 పైగా రిజిస్టర్డ్ వార్తాపత్రికలు నడిచే భారతదేశం ఈ రోజున ప్రపంచంలోనే మీడియాకు అతి పెద్ద మార్కెట్‌గా వుంది. 900 ఛానళ్లు వుండగా వాటిలో 350 24/7 వార్తాప్రసారం చేస్తున్నాయి. రేడియోలో వార్తా ప్రసారం అధికారం కేవలం ఆకాశవాణికే వున్నా 850 ఎఫ్.ఎం స్టేషన్లు పనిచేస్తున్నాయి. బ్రాండ్‌బ్యాండ్ మెరుపువేగంతో అందుబాటులోకి రావడం వల్ల డిజిటల్ వార్తా వేదికలు వెల్లువగా వచ్చేశాయి. వీటిలో అనేకం సంప్రదాయక మీడియా సంస్థలకు చెందినవి అయినప్పటకీ కేవలం డిజిటల్ మాత్రమే చేసేవి కూడా పెరిగిపోతూ దేశంలోని 82 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
జిల్లా కోర్టు ప్రత్యర్థి పక్షంగా ఇచ్చిన ఉత్తర్వులోని ఏకపక్ష ధోరణిని, సమాచారశాఖ దాన్ని ఆఘమేఘాల మీద అమలు చేయడాన్ని అర్థం చేసుకోవాలంటే వేగంగా మారిపోతున్న మీడియావరణాన్ని మనం అర్థం చేసుకోవాలి. గత కొంత కాలంగా ప్రభుత్వం డిజిటల్, సోషల్ మీడియా కంటెంటుపై పట్టు బిగించాలని అదే పనిగా ప్రయత్నిస్తున్నది. కార్పొరేట్ల యాజమాన్యంలోని మీడియా ప్రాబల్యం వహిస్తున్నప్పటికీ స్వతంత్ర వేదికల విస్త్రుతి, విశ్వసనీయత, పట్టుదల ప్రభుత్వానికి, కార్పొరేట్ దళారులకు కంపరం పుట్టిస్తున్నది.
అందువల్లనే రిలయన్స్ ఇండిస్టీస్, అదానీ గ్రూపు, బెన్నెట్ కాల్మన్, లివింగ్ మీడియా వంటివి అందరినీ కమ్మేసే స్థాయిలో ఉన్నా.. మరెన్నిటినో హస్తగతం చేసుకోవడం కోసం పరుగులు పెడుతున్నా స్వతంత్రమైన గొంతు వినిపించేవారిపై నిరతం దాడి కొనసాగుతూనే వుంది. విదేశీ పెట్టుబడులు భారత మీడియా రంగాన్ని మరింతగా మార్చేస్తున్నాయి. ఆయా వ్యవస్థలలోకి ప్రపంచీకరణ ప్రభావాలను జత చేస్తున్నాయి. బహుముఖ యాజమాన్యాల పద్ధతి సర్వసాధారణంగా తయారైంది. భిన్నత్వాన్ని, సంపాదక స్వాతంత్య్రాన్ని బలహీనపర్చే విధంగా ఆ యాజమాన్యం లోలోపలి పొరల్లోకి చొరబడుతున్నది. 2019లో అదానీ గ్రూపుపై వరుస కథనాల పరంపర ప్రచురించిన దైనిక్ భాస్కర్ హిందీ దినపత్రిక సంపాదకుడిని బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ విధంగా పత్రికా స్వాతంత్య్రంపై ప్రత్యక్ష దాడులతో పాటుగానే ఈ మార్పులు జరుగుతూ వస్తున్నాయి.
ఏకైక మార్గం
ఇవి చీకటి రోజులు. ఈనయా ఫాసిస్టు కాలంలో వార్తలు, సత్యం, సహేతుకతలను వధ్యశిలపై తెగనరకడం జరిగిపోతున్నది. డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ (ఎన్‌వైటి)పై 150 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. పత్రికా వ్యతిరేక దాడి వ్యూహంలో భాగంగా ట్రంప్ వేసిన ఈ కేసులకు తాము తలవంచబోమని ఎన్‌వైటి సిఇవో మెడ్రిత్ కోపిట్ లెవిన్ ప్రకటించడానికి కారణం అదే. అయితే ట్రంప్ ఇండియాలోని తన స్నేహితుడైన మోడీ అడుగుజాడలను అనుసరిస్తున్నాడని లెవిన్ వ్యాఖ్యానించడం ఇందులో కొసమెరుపు. అంతర్జాతీయంగా కూడా పత్రికలపై అణచివేత హింసాత్మక రూపం తీసుకున్నది. గాజాలో నెతన్యాహు ఐడిఎఫ్ యూదు జాత్యహంకార దళాలు కావాలనే మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నాయి. సత్యాన్ని సమాధి చేసేందుకు సాగిస్తున్న ఈ అంతులేని వలస రాజ్య వ్యూహంలో ఇప్పటికే 270 మంది జర్నలిస్టులు బలైపోయారు.
1988లో నోమ్ చోమ్‌స్కీ, ఎడ్వర్డ్ హెర్మన్‌లు సంచలనాత్మక రచన ‘మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్’ (అంగీకార సృష్టి) వెలువడిన తర్వాత కాలం నుంచి మనం చాలాదూరం వచ్చేశాము. ఆధునిక మీడియాలో ప్రాబల్యం వహించే ప్రచార నమూనా ఏ విధంగా బుర్రలను, చైత న్యాన్ని ఖరాబు చేసే సైద్ధాంతిక సాధనంగా పనిచేస్తుందో ఆ పుస్తకంలో విశ్లేషించి చూపారు. ఆ హెచ్చరికలు ఈ రోజున మరింత బిగ్గరగా కళ్లకు కట్టినంత స్పష్టంగా కనిపిస్తు న్నాయి. భిన్న భావాల పీక నులమడం, యాజమాన్యం కేంద్రీకరణ, దేశంలో స్వతంత్ర జర్నలిజంపై దాడులు చూస్తుంటే ప్రభుత్వాన్ని దాని కార్పొరేట్ భాగస్వాములనూ ఎంత ఆందోళన, నిస్పృహ ఆవరించాయో తెలుస్తుంది. స్వతంత్ర జర్నలిస్టుల తరహాలోనే ఈ ధోరణులను ప్రతిఘటించడం మన ముందున్న ఏకైక మార్గం.
(సెప్టెంబరు 24 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
వధ్యశిలపై సత్యం – ఊహించిన ప్రతీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES