ఎస్కలేటర్ ఘటనపై ట్రంప్
తోసిపుచ్చిన యూఎన్
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కిన ఎస్కలేటర్ హఠాత్తుగా ఆగిపోయింది. దీనికి ట్రంప్ వీడియోగ్రాఫరే కారణమై ఉండవచ్చునని ఐరాస తెలిపింది. ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి వీడియోగ్రాఫర్ ఎస్కలేటర్‌పై వెనక్కి ప్రయాణించారని, పైకి చేరుకున్న తర్వాత అనుకోకుండా సేఫ్టీ ఫంక్షన్‌ను నొక్కి ఉండవచ్చునని ఐరాస ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనను ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ప్రథమ మహిళ సరిగా నిలబడకపోతే పడిపోయి ఉండేది’ అని నవ్వుతూ అన్నారు. అయితే ట్రంప్ దంపతులు ఎస్కలేటర్ ఎక్కగానే ఎవరో ఉద్దేశపూర్వకంగా దానిని ఆపేశారని శ్వేతసౌధం ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగంలో ఎస్కలేటర్ ఘటనను తేలికగా తీసుకున్న ట్రంప్ ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్కలేటర్ పనిచేయడం లేదని, టెలిప్రాంప్టర్ లోపభూయిష్టంగా ఉన్నదని ఆరోపించారు. ఈ సంఘటనను సాకుగా చూపి ఐరాసను పనిచేయని సంస్థగా ఆయన చిత్రీకరించారు. ‘ఐరాసలో నాకు లభించింది ఎస్కలేటర్ అనుభవం మాత్రమే. అది పైకి వచ్చేటప్పుడు మధ్యలోనే ఆగిపోయింది’ అని చెప్పారు. కాగా అమెరికా ప్రతినిధి బృందంలోని ఓ వీడియోగ్రాఫర్ ఎస్కలేటర్ పైభాగంలోని స్టాప్ మెకానిజాన్ని నొక్కారని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వివరించారు. ‘వ్యక్తులు కానీ, వస్తువులు కానీ ప్రమాదవశాత్తూ గేరింగ్‌లో చిక్కుకుపోకుండా భద్రతాపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వీడియోగ్రాఫర్ పొరబాటున దానిపై నొక్కి ఉండవచ్చు’ అని చెప్పారు. టెలిప్రాంప్టర్ పనిచేయడం లేదని ఐరాసలో ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే ట్రంప్ గుర్తించారు. దానిని ఆపరేట్ చేసే వారు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారంటూ చమత్కరించారు. అయితే అధ్యక్షుడి కోసం టెలిప్రాంప్టర్‌ను నిర్వహించేది శ్వేతసౌధమేనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఐరాస అధికారి ఒకరు చెప్పారు.
ఐరాస పనిచేయడం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES