క్యూబా ప్రపంచపటంలో ఒక చిన్న ద్వీప దేశం. కానీ ఒలింపిక్ క్రీడా ప్రాంగణంలో అది ఒక అజేయ శక్తి. 1959 విప్లవం తర్వాత క్రీడలను విలాసంగా కాకుండా, సామాన్యుడి హక్కుగా మార్చిన తీరు అద్భుతం. ముఖ్యంగా బాక్సింగ్‌లో ప్రత్యర్థులను వణికించే ‘క్యూబన్ పంచ్’, వాలీబాల్ కోర్టులో వారి వేగం.. అథ్లెటిక్స్‌లో వారి పరుగు.. ఇవన్నీ ఒక దేశపు ఆత్మగౌరవానికి నిదర్శనాలు. అమెరికా వంటి అగ్రరాజ్యాలకు సైతం దీటుగా నిలబడి, పరిమిత వనరులతోనే పతకాల పంట పండించింది క్యూబా.
క్యూబాలో క్రీడలను ప్రోత్సహించిన వారిలో చె గువేరా ప్రథమస్థానంలో నిలువగా.. ఫిడెల్ కాస్ట్రో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లారు. చె గువేరా చెస్ ఇష్టమైతే- కాస్ట్రో బేస్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్ మక్కువ. 1959 నుంచి 2008 వరకు క్యూబా నాయకునిగా ఉన్న ఫిడెల్ కాస్ట్రో క్రీడలను ప్రజల జీవన శైలిలో ఒక భాగం చేశారు. ‘క్రీడలు ప్రజల హక్కు…’ అని నినదించి క్రీడలను క్యూబా సంస్కృతిలో అంతర్భాగం చేశారు.
బాల్యదశ నుంచే…
క్యూబాలో 45 రోజుల వయసున్న పసిపిల్లలకు వారి తల్లులు ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా మసాజ్, అవయవాల వ్యాయామం పరిచయం చేస్తారు. పిల్లలు చిన్నప్పుడే క్రీడల్లో పాల్గొనేలా ప్రభుత్వం ‘ఇండెర్’ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది క్రీడలు, విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతోపాటు అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో క్రీడల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. ‘ఐల్ ఆఫ్ యూత్’లో 27 ప్రత్యేక పాఠశాలలు ఎంపిక చేసిన యువతకు క్రీడల్లో తర్ఫీదునిస్తాయి. క్యూబాలోని ప్రతి పాఠశాల, జూనియర్ ఒలింపిక్ కార్యక్రమాల్లో పాల్గ్గొంటుంది. ప్రపంచస్థాయి క్రీడా శిక్షకులను ఎగుమతి చేసే అగ్రగామి దేశాల్లో క్యూబా ఒకటి. అంతర్జాతీయ పోటీల్లో 200కు పైగా పతకాలు గెలుచుకున్న తొలి చిన్న దేశంగానూ క్యూబా రికార్డుల్లోకెక్కింది.
అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలు
క్యూబా ప్రజలు బేస్‌బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, వాలీబాల్‌లను అమితంగా ఇష్టపడతారు. ఈ క్రీడాంశాల్లో అమెరికా వంటి దేశాలతో పోటీ పడి పతకాలను కొల్లగొట్టడం క్యూబా క్రీడాయోధులకు పరిపాటి.
బాక్సింగ్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు క్యూబా. ఆ దేశ బాక్సర్లు ఒలింపిక్స్‌లో సాధించినన్ని పతకాలు మరే దేశ బాక్సర్లు సాధించలేదు. అంతర్జాయతీయ వేదికలపై క్యూబా బాక్సర్లు అమెరికాతో తలపడిన ప్రతిసారీ దానిని ఒక ఆటగా కాక – సామ్రాజ్యవాదంతో పోరాటంలా స్ఫూర్తివంతంగా ఆడి విజయాలు సాధించేవారు. 2024 వరకు ఒలింపిక్స్‌లో క్యూబా ఒక్క బాక్సింగ్ విభాగంలో 37 స్వర్ణ పతకాలతోపాటు మొత్తం 73 పతకాలను కైవసం చేసుకుందంటే ఆ దేశం క్రీడలకు ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది. టియోఫిలో స్టీవెన్సన్, ఫెలిక్స్ సావోన్ మూడుసార్లు ఒలింపిక్స్ విజేతలుగా నిలిచారు. ఇలా ఒకదేశ బాక్సర్ మూడుసార్లు ఒలింపిక్స్‌లో ఛాంపియన్‌గా నిలవడం ఒక్క క్యూబా బాక్సర్లకే సాధ్యమైంది. వాలీబాల్ క్రీడలో క్యూబా ఆధిపత్యం ఇప్పటికీ అలానే ఉంది.
అమెరికా ఆర్థిక ఆంక్షల వల్ల క్యూబా క్రీడారంగంలోనూ అనేక కష్టాలను ఎదుర్కొంటుంది. అయినా శక్తిమేరకు ప్రపంచ పోటీలో నిలుస్తుంది. యూరప్ దేశాలు క్రీడలను వ్యాపార సరుకుగా మార్చి, క్రీడాకారులను కొనుగోలు చేసి తమ దేశాల పక్షాన ఆడించడం ఇటీవల బాగా పెరిగింది. క్యూబాకు చెందిన కొందరు క్రీడాకారులకు డబ్బు ఎరవేసి కొనుగోలు చేస్తున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా క్యూబా క్రీడాస్ఫూర్తి సోషలిస్టు వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనం.
– పఠాన్ మహాబాషా



