Saturday, February 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తిరుగులేని పురాధీశుడు..

తిరుగులేని పురాధీశుడు..

- Advertisement -

ముఖ్యమంత్రిగా.. మున్సిపల్‌ మంత్రిగా రేవంత్‌ రెడ్డి ముద్ర
పురపాలికల్లో అధికార పార్టీ జయకేతనం..ఇదే జోష్‌తో పరిషత్‌, గ్రేటర్‌ ఎన్నికలకు…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‘తిరుగులేని పురాధీశుడు…’ అప్పుడెప్పుడో 20 ఏండ్ల క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి పత్రికల్లో ప్రచురితమైన వార్తలకు శీర్షిక ఇది. ఆనాటి మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడింది. మళ్లీ ఇప్పుడు, ఇన్నాండ్లకు అదే స్థాయిలో అధికార హస్తం పార్టీ మున్సి’పోల్స్‌’లో తన సత్తా చాటింది. ముఖ్యమంత్రిగా… మున్సిపల్‌ మంత్రిగా రేవంత్‌ రెడ్డి ఈ ఎన్నికల్లో తనదైన ముద్ర వేసి.. పార్టీని విజయతీరాలకు చేర్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవటంతోపాటు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయటం ద్వారా పార్టీ విజయంలో సీఎం కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌లో సహజసిద్ధంగా ఉండే అంతర్గత విబేధాలు, కుమ్ములాటలను నియంత్రించటం, నివారించటం పై మొదటి నుంచి దృష్టి సారించిన ఆయన… తోక జాడించిన నేతలపై ‘తనదైన’ వ్యూహాన్ని పన్ని వారి నుంచి సహాయ నిరాకరణ, ధిక్కారం లేకుండా చూసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి తదితరులను సైతం ఒకే తాటిపై నడిపించటం ద్వారా ఎక్కడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా చేసుకున్నారు. యధారాజా.. తధా ప్రజా అన్నట్టు క్షేత్రస్థాయి క్యాడర్‌ వరకూ ఇదే సూత్రం అమలైందని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీతోపాటు ఇప్పుడు పురపాలికల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగిందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రతీ పట్టణాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామంటూ సీఎం హామీ ఇవ్వటం కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును మరింత పెంచిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో భాగంగా… ప్రతి పట్టణానికి ఒక మాస్టర్‌ ప్లాన్‌ ప్రకటన, ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటు తదితరాంశాలపై సీఎం విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టణాల్లోని 30 లక్షల మంది పేదలకు రేషన్‌ కార్డులు, నిరుపేదలందరికీ సన్న బియ్యం, పట్టణాల్లో ప్రగతి పనులకు రూ. 17 వేల కోట్ల కేటాయింపు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న 7.5 లక్షల మంది విద్యార్థులకు 40 శాతం కాస్మొటిక్‌ చార్జీల పెంపు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటు, ఆర్టీసీలో ప్రతి మహిళకు ఉచిత రవాణా, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌, పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేం దుకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల పెంపు, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రగతి పనులకు మున్సిపల్‌ ప్రాంతాల్లోని ప్రజలు సంపూర్ణంగా ఆమోదం తెలిపారని గాంధీ భవన్‌ వర్గాలు వివరించాయి. అందుకే కాంగ్రెస్‌కు ఇంతటి ఘన విజయం దక్కిందని పేర్కొన్నాయి. అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్‌ ఎలక్షన్ల ఫలితాలు సీఎం రేవంత్‌ రెడ్డి చరిష్మాను మరింత పెంచాయి. ఈ జోష్‌లో అధికార పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల కు రంగం సిద్ధం చేయనుందని సమాచారం. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కాంగ్రెస్‌ త్వరలోనే ప్రకటించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -