కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌లకు దక్కని జాతీయ హోదా
రాష్ట్ర వినతులను పట్టించుకోని మోడీ సర్కార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశ పెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నీటి పారుదల రంగానికి రిక్తహస్తమే దక్కింది. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని పలు మార్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా కల్పించాలని కోరింది. ప్రాణహిత-చేవెళ్ల తుమ్మిడిహట్టి, ఎస్‌ఎల్‌బీసీ, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పునరుద్ధరించడం వంటి ప్రధాన పెండింగ్ ప్రాజెక్టులకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయినా మోడీ సర్కార్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర నీటిపారుదల రంగంపై ఏ మాత్రం కనికరం చూపలేదు. పీఎం సించాయి యోజన, పీఐబీపీ పథకాల ద్వారా ఎలాంటి నిధులను కేటాయంచలేదు. ఈ పథకాల ద్వారా చిన్న, మధ్యతరహా ప్రాజెక్ట్‌లకు కొత్తగా ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. గతంలో ఖమ్మం జిల్లా జగన్నాథపురంతో పాటు అదిలాబాద్‌లోని 5 ప్రాజెక్ట్‌లకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని గత రెండేండ్లుగా నిలిపేసింది. మొత్తంగా ఈ సారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నీటి పారుదల రంగానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు తప్ప ప్రత్యేకంగా కేటాయంపులు చేయలేదు.
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి
సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు
పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర నీటి పారుదల రంగానికి ప్రత్యేక కేటాయింపులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రాలకు ఇచ్చే వాటాలను 41 నుంచి 50 శాతానికి పెంచాలని చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదని అన్నారు. గతంలో మాదిరిగానే పన్పుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్ప ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణలోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాంచాలని కోరారు.



