పెరిగిపోతున్న ‘పనిచేయని’ ఖాతాలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రారంభించిన పలు ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. గత సంవత్సరంతో పోలిస్తే ఇలా మనుగడలో లేని ఖాతాల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం 21 శాతం ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగక పోగా ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికే వాటి సంఖ్య 26 శాతానికి పెరిగిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సెప్టెంబర్ నాటికి పీఎంజేడీవై పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 554.5 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. అయితే వీటిలో 142.8 మిలియన్ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొత్తగా 38 మిలియన్ల ఖాతాలు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా సెప్టెంబర్ చివరి నాటికి 13.2 మిలియన్ ఖాతాలు మాత్రమే ప్రారంభమయ్యాయి.బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 32 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33 శాతం ఖాతాల్లో లావాదేవీలు జరగలేదు. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో ఈ తరహా ఖాతాలు అతి తక్కువగా…అంటే కేవలం 8 శాతం మాత్రమే ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయని ఖాతాల దామాషా 2024 సెప్టెంబరులో 19 శాతం ఉండగా ఈ ఏడాది అదే నెలలో 25 శాతంగా ఉంది. ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఏ బ్యాంక్ ఖాతా అయినా రెండు సంవత్సరాలు అలాగే ఉంటే దానిని పనిచేయని లేదా నిద్రాణంగా ఉన్న ఖాతాగా రిజర్వ్‌బ్యాంక్ పరిగణిస్తుంది. ఈ విధంగా లావాదేవీలు జరగకుండా ఉన్న పదిహేను లక్షల పీఎంజేడీవై ఖాతాలను బ్యాంకులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మూసేశాయి. పీఎంజేడీవై పథకాన్ని 2014 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. బ్యాంకింగ్/పొదుపు-డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, నగదు జమ చేయడం, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలు సులభంగా పొందేందుకు ఈ ఖాతాలు ఉపయోగపడతాయి. జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలు, రుపే డెబిట్ కార్డు, డిపాజిట్లపై వడ్డీ, ప్రమాద-జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు ఉంటాయి. లబ్దిదారులకు నేరుగా ఖాతాలో సొమ్ము జమ అవుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం సహా రుణం పొందవచ్చు. ఆర్‌బీఐ డేడా ప్రకారం ప్రస్తుతం 75,315 మిలియన్ రూపాయల నిల్వ ఉన్న 55.5 పీఎంజేడీవై ఖాతాలు మనుగడలో లేవు. 480 మిలియన్ల రుపే కార్డులను ఖాతాదారులకు అందించాల్సి ఉంది.



