Thursday, October 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిచెరగని ఉత్తేజం 'చేగువేరా'

చెరగని ఉత్తేజం ‘చేగువేరా’

- Advertisement -

చేగువేరా.. ఈ పేరు వినగానే కండ్ల ముందు ఆయన రూపం కనిపిస్తుంది. ఆకుపచ్చ సైనికదుస్తులు, తలపై మిలటరీ క్యాప్‌, దానిపై ఐదుకోణాల నక్షత్రం, సన్నని గడ్డం- మీసాలు, తేజోవంతమైన ముఖం. ఒకసారి హవానా చుట్టతో, మరోసారి తలమీద నక్షత్రం బొమ్మతో కనబడే చేగువేరా గురించి మాటల్లో చెప్పలేం. ఆయన జీవితాన్ని చదువుతుంటే వాయు వేగంతో అనేక జీవితాలు ఒకదాని తర్వాత ఒకటిగా సినిమా రీల్‌లా మారిపోతున్నట్లే అనిపిస్తుంది. సామ్రాజ్యవాదులు, వారి తొత్తుల చేతిలో హత్యగావించబడే నాటికి ఆయన వయసు 39 సంవత్సరాలు. విప్లవాన్ని రగిలించి, విప్లవం కోసం జీవించి, విప్లవంలోనే మరణించి, ప్రపంచ విప్లవాలకే వేగు చుక్కగా నిలిచాడు.

చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలా సెర్నా. ఆయన 1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రోజారియో పట్టణంలో జన్మించారు. చిన్నప్పటినుంచే పెట్టుబడిదారీ వర్గం, దోపిడీదారీ సమాజం గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. తల్లిదండ్రుల విప్లవ మార్గం చే పై ప్రభావం చూపింది. అదే బాటలో తాను పయనించాలనుకున్నాడు. అర్జెంటీనాలో పుట్టి లాటిన్‌ అమెరికా దేశాన్నంతటినీ తిరిగి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ఇంజనీరింగ్‌ విద్యలో చేరినా చేగువేరాను ఆనాటి అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తి కలిగించాయి. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పోరాటం ఆయన్ను ముందుకు కదిలేలా చేశాయి. వైద్యుడైతే ప్రజాసేవతో అందరినీ కలవొచ్చనుకున్నాడు. అంతే ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే వదిలి స్టెతస్కోప్‌ పట్టాడు. మొత్తం ఎనిమిది నెలలపాటు అర్జెంటీనా యాత్ర చేశాక చే ఆలోచనలో మార్పువచ్చింది. ప్రపంచానికి తాను ఏదో ఒకటి చేయాలను కున్నాడు. అంతే కర్తవ్యం దిశగా కార్యరంగంలోకి దూకాడు.

గ్వాటెమాలతో మొదలై..
లాటిన్‌ అమెరికా దేశాలు చూసేందుకని చేగువేరా 1953, జూలై 7న బ్యూనస్‌ ఎయిర్స్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరారు. అమ్మనాన్నలు చేకు వీడ్కోలు పలికారు. అతను వెళుతోంది డాక్టర్‌గా కాదు. సమాజానికి పట్టిన రోగానికి శాశ్వత చికిత్స చేసేందుకు. అందుకే చే విప్లవకారుని అవతారమెత్తాడు. గ్వాటెమాలలో కొన్నాళ్లపాటు రహస్య జీవితం గడిపిన చే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడాడు. తర్వాత సరిహద్దులు దాటి మెక్సికో వైపు అడుగులు వేశాడు. అక్కడే క్యూబా విప్లవ వీరులు ఫైడల్‌ కాస్ట్రో, రావుల్‌ కాస్ట్రోలతో పరిచయం ఏర్పడింది. తాను క్యూబా విముక్తి పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు చే. ఇందుకు కాస్ట్రో అనుమతి లభించింది. గ్రాన్మా అనే చిన్న పడవలో హవానా వైపు బయలుదేరిన ఇరవై మంది విప్లవీరుల బృందాన్ని శత్రు సైన్యం చుట్టుముట్టినా, తుపాకులతో కాల్చినా వెనుదిరగలేదు. బుల్లెట్‌ గాయాలతోనే శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటూ వారిని తరిమి కొట్టడంలో చే సాహసం అద్భుతం. ఉరిమే ఉత్సాహంతో ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విప్లవవీరులు హవానా చేరుకుని సంబరాలు చేసుకున్నారు.

క్యూబా కోసం..
అమెరికా కీలుబొమ్మ అధ్యక్షుడు బటిష్టా ఓటమిని ఒప్పుకున్నాడు. దేశం విడిచి వెళ్లాడు. ఫలితంగా 1959 జనవరి 1న ఫైడల్‌ కాస్ట్రో నాయకత్వాన ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. క్యూబాలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా ఫైడల్‌ కాస్ట్రో బాధ్యతలు తీసుకున్నారు. విదేశాంగ వ్యవహారాలతో పాటు. ఆర్థిక వ్యవస్థను పటిష్టంచేసే కర్తవ్యాన్ని చే కు అప్పగించారు కాస్ట్రో. అదే రోజు క్యూబా రాజ్యాంగం ప్రకారం చేగువేరాకు ఆ దేశ పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది. విదేశీ వ్యవహారాల్లో భాగంగా చేగువేరా 1959 జూన్‌ 12 నుంచి సెప్టెంబరు 14 వరకు పద్నాలుగు దేశాల రాజ్యాధినేతలతో చర్చలు జరిపారు. చే చర్చలు జరిపిన వారిలో భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీనే కాదు, ఈజిప్టు, ఇండోనేషియా, పాకిస్తాన్‌, యుగోస్లోవియా దేశాల అధ్యక్షులున్నారు. విదేశాల్లో తిరగడం, వాతావరణం అనుకూలించకపోవడం చే ఆరోగ్యంపై ప్రభావం చూపింది.

ఫలితంగా ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయం లోనే చేగువేరా గెరిల్లా యుద్ధం అనే పుస్తకాన్ని రాశారు.కమ్యూనిస్టు కంచుకోటలైన చైనా, రష్యా దేశాల్లో చేగువేరా పర్యటించారు. అక్కడి నేతలతో చర్చలు జరిపి కార్మికులు, కర్షకుల కోసం ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. క్యూబా లోనూ అలాంటి ప్రణాళికలు అమలయ్యేలా చూడాలని కాస్ట్రోను కోరడం విశేషం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చే 1964 డిసెంబర్‌ 11న క్యూబా ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో అడుగు పెట్టాడు. సభ్య దేశాల ప్రతినిధుల నుద్దేశించి ప్రసంగించారు. వచ్చిన అవకాశాన్ని అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టే సాహసం చేశారు. అటు తర్వాత చేగువేరా అల్జీరియా పర్యటించారు. ఆ పర్యటన ముగించుకుని వచ్చిన చే హవానాలో చివరిగా కాస్ట్రోను కలిశాడు. క్యూబా విముక్తితో తన పని పూర్తికాలేదని చెప్పారు. కాంగో విముక్తి పోరాటంలో పాల్గొంటానని వివరించారు. ఇందుకు కాస్ట్రో అభ్యంతరం చెప్పినా తన కర్తవ్య దీక్షను వీడేది లేదని పట్టుపట్టాడు. మరోమార్గం లేక కాస్ట్రో అతనికి అడ్డుచెప్పలేదు.

కాంగో విముక్తి కోసం చెగువేరా వెళ్లిన విషయం కాస్ట్రో, రౌవుల్‌ కాస్ట్రోతో పాటు కుటుంబ సభ్యులకే తెలుసు. చివరగా కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నాకే కాంగోలో అడుగుపెట్టారు చే. అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రహస్యంగా యుద్ధ తంత్ర వ్యూహాలు రచించాడు. ఇందుకు స్థానిక విప్లవకారుల సహకారం తోడైంది. కొద్దికాలంపాటు పోరాటం చేసినా.సైనిక నియంతల ఆగడాల ముందు విప్లవవీరుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. విప్లవవీరులు ఒక్కొక్కరుగా సైన్యం చేతికి చిక్కారు. మిగిలిన కొద్ది మందితో కలిసి చేగువేరా తిరిగి హవానా చేరుకున్నారు. అక్కడ జరిగిన విషయాలను కాస్ట్రోకు వివరించాడు చే. ఈసారి కాంగోకు బదులు తన కేంద్రంగా బొలీవియాను ఎంచుకున్నాడు.1966 అక్టోబరు 23న చేగువేరా తన జీవితంలోని చివరిగా కాస్ట్రోను రహస్యంగా కలిశారు. వేషం, భాష మార్చి ప్యాంట్‌, పొడవాటి షర్ట్‌తో ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఉరుగ్వే మీదుగా బొలీవియా చేరుకున్నారు. క్యూబా విప్లవవీరులు, బొలీవియా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, స్థానికుల సహకారం తోడైంది.

నేలకొరిగిన విప్లవ యోధుడు..
బొలీవియాలోని వాల్లె సెర్రానోలో గెరిల్లా దళాలను చుట్టుముట్టిన సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. చే వర్గం ధీటుగా తిప్పికొట్టే సాహసం చేసినా సైన్యాలదే పై చేయి అయింది. అమెరికా సైన్యం వద్ద శిక్షణ పొందిన బొలీవియా సైన్యం ధాటికి చే గెరిల్లా దళం నిలవలేకపోయింది. తన అనుచరులు ఒక్కొక్కరుగా నేలకొరగడం చేను కదిలించింది. అయినా ముందుకే దూకాడు. వందల సంఖ్యలో ఉన్న సైన్యం చే గువేరా కుడి మోకాలుపై కాల్చింది. మరో తూటా భుజం నుంచి దూసుకుపోయింది. తరువాత చేను పెడ రెక్కలు విరిచి కట్టి హెలికాప్టర్‌లో ఎక్కించారు. లా హిక్విరా ప్రాంతానికి ఆయనతో పాటు నలుగురు గెరిల్లా సభ్యులను తీసుకు వెళ్లారు. అక్కడి స్కూలు భవనంలో బంధించారు. సైనికాధికారి రోడ్రిగ్వెజ్‌ ఆదేశాలతో సార్జెంట్‌ టెరాన్‌ చే గుండెలపై గురి చూసి కాల్చాడు. అంతే విప్లవ వేగు చుక్క నేలకొరిగింది. ఎర్రపూల వనంలో విప్లవపువ్వు రాలింది.

ఎప్పుడు మరణం సమీపించినా స్వాగతం పలుకుతానన్న చేగువేరా మాటలు, క్యూబా ప్రజలనే కాదు, విప్లవ వీరుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. చేను చంపడం ద్వారా విప్లవాన్ని అంతం చేయాలనుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఆ జ్యోతి రగిలింది. విప్లవం ఉన్నంతకాలం ఆయన సాహసాలు, ఆశయాలు ఎప్పటికీ సజీవమే.క్యూబా, రష్యా, కొరియా, చైనా, వియత్నాం, పోలెండ్‌, రుమేనియా, చెక్‌ రిపబ్లిక్‌, అల్బేనియా, హంగేరి, మాసిడోనియా, బల్గేరియా, లాత్వియా, ఉక్రెయిన్‌, కజికిస్థాన్‌ వంటి దేశాల కమ్యూనిస్టు యోధులకు చేగువేరా పోరాటం ఆదర్శం. అందుకే చే జీవిత చరిత్రను తమ పాఠశాలల్లో పాఠాలుగా బోధిస్తోంది. అంతెందుకు భారత్‌లోని కేరళ రాష్ట్రంలో చేగువేరా చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జీవితాంతం ప్రజల బాగుకోసం పరితపించిన వేగుచుక్క కామ్రేడ్‌ చేకు విప్లవ వందనాలు.
(నేడు చేగువేరా 58వ వర్థంతి)

టి.నాగరాజు
9490098292

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -