వెనిజులా తీరంలో అటకాయింపు
కారకాస్ : అమెరికా సైనిక దళాలు శనివారం వెనిజులా తీరంలో మరో చమురు ట్యాంకర్‌పై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నాయి. ఆంక్షలను ఎదుర్కొంటూ వెనిజులాకు రాకపోకలు సాగిస్తున్న చమురు ట్యాంకర్లను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన విషయం విదితమే. వెనిజులా తీరంలో అమెరికా దళాలు చమురు ట్యాంకర్లను అటకాయించడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 10వ తేదీన స్కిప్పర్ అనే పేరున్న భారీ చమురు ట్యాంకర్‌ను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇరాన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణతో ఈ నౌకపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే తాజాగా అమెరికా స్వాధీనం చేసుకున్న ట్యాంకర్‌పై ఎలాంటి ఆంక్షలు లేవని అధికారి ఒకరు తెలిపారు.
దాడి సమయంలో నౌకలో ఉన్న సిబ్బంది ఎవరూ ప్రతిఘటించలేదని, ఈ నౌక పనామా పతాకంతో వెనిజులా చమురును సరఫరా చేస్తోందని, దాని గమ్యస్థానం ఆసియా అని ఆయన చెప్పారు. దాడికి అమెరికా తీర గస్తీ దళం నేతృత్వం వహించగా సైన్యం సాయపడింది. ఆయిల్ ట్యాంకర్ అంతర్జాతీయ జలాలలో ఉండగా దాడి జరిగింది. దాడికి సంబంధించిన దృశ్యాలతో కూడిన ఏడు నిమిషాల వీడియోను శనివారం సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. కాగా అమెరికా ప్రభుత్వ అంతర్జాతీయ ఉగ్రవాద చర్యలపై పోరాడేందుకు సహకరిస్తామని ఇరాన్ తెలిపిందని వెనిజులా విదేశాంగ మంత్రి యువాన్ గిల్ చెప్పారు. తాజా దాడి విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఐరాస భద్రతా మండలి సహా పలు సంస్థలకు, ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని వెనిజులా ఉపాధ్యక్షుడు రోడ్రిగుయెజ్ ఒక ప్రకటనలో వివరించారు.



