Friday, January 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరెండు చమురు నౌకలపై అమెరికా దాడి

రెండు చమురు నౌకలపై అమెరికా దాడి

- Advertisement -

ఒక దానిపై రష్యా పతాకం
రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తత

వాషింగ్టన్‌/మాస్కో : అమెరికా సైన్యం బుధవారం రెండు చమురు నౌకలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుంది. వీటిలో ఒకటి కొన్ని వారాలుగా అమెరికా దళాలను ముప్పుతిప్పలు పెడుతూ తప్పించుకుంటోంది. మరో నౌక వెనిజులాకు చెందిన రెండు మిలియన్‌ బ్యారళ్ళ ముడి చమురును రవాణా చేస్తోంది. అమెరికా, ఇతర దేశాల ఆంక్షలను ఉల్లంఘించి ‘ఘోష్ట్‌ ఫ్లీట్‌’ పేరిట రష్యా, ఇరాన్‌, వెనిజులా తరఫున చమురును రవాణా చేస్తున్న నౌకల సముదాయంలో ఈ రెండూ భాగంగా ఉన్నాయి. వీటిలో ఒక దానిపై రష్యా పతాకం కన్పిస్తోంది. ఇదిలావుండగా ఇప్పటి వరకూ పట్టుబడిన నౌకల నుండి స్వాధీనం చేసుకున్న యాభై మిలియన్‌ బ్యారళ్ళ చమురును విక్రయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. వెనిజులాకు సంబంధించి దీర్ఘకాలిక, విస్తృత వ్యూహాన్ని అనుసరిస్తామని ఆయన చెప్పారు.

చట్టవిరుద్ధం : రష్యా
రష్యా పతాకంతో ఉన్న ‘మరినెరా’ (బెల్లా-1) నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా చర్య చట్టవిరుద్ధమని, అది అంతర్జాతీయ సముద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తోందని రష్యా ఆరోపించింది. స్వేచ్ఛాయుత నౌకా ప్రయాణాన్ని అమెరికా అడ్డుకుంటోందని మండిపడింది. మరో దేశంలో చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసుకున్న నౌకలపై చర్యకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. రష్యన్‌ సమాఖ్య పతాకంతో ప్రయాణించేందుకు గత సంవత్సరం డిసెంబర్‌ 24న నౌకకు తాత్కాలిక పర్మిట్‌ జారీ అయిందని తెలిపింది. ఈ పర్మిట్‌ రష్యా, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే ఉన్నదని పేర్కొంది. అమెరికా దళాలు అంతర్జాతీయ జలాలలో నౌకను స్వాధీనం చేసుకున్నాయని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. నౌకతో సంబంధాలు తెగిపోయాయని చెప్పింది. తమ జాతీయ పతాకంతో నౌక ప్రశాంతంగా ప్రయాణం సాగిస్తోందని, అమెరికా జలాలకు దూరంగా ఉన్నప్పటికీ అమెరికా, నాటో సైన్యాల నుంచి హెచ్చరికలు అందాయని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.

ఆంక్షలు ఉల్లంఘించినందునే : అమెరికా
ఆంక్షలను ఉల్లంఘించినందునే ఉత్తర అట్లాంటిక్‌లో స్కాట్లాండ్‌-ఐస్‌లాండ్‌ మధ్య నౌకను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఏ దేశానిదో తెలియని, ఆంక్షలు ఎదుర్కొంటున్న డార్క్‌ ఫ్లీట్‌ మోటార్‌ ట్యాంకర్‌ను కరేబియన్‌లోని అంతర్జాతీయ జలాలలో స్వాధీనం చేసుకున్నామని, అక్కడ అది అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దానిని అమెరికాకు తరలిస్తున్నామని మరో ప్రకటనలో వివరించింది. అయితే ఆ నౌకలో చమురు లేదు. కానీ అది గతంలో వెనిజులా నుంచి ముడి చమురును తీసుకొని రావడానికి వెళ్లింది. ఆ నౌక గత రెండు వారాలుగా అమెరికా దళాలను ఏమారుస్తూ ప్రయాణిస్తోంది.

బ్రిటన్‌ సహకారం
అమెరికా ప్రభుత్వ, సైనిక అధికారుల కథనం ప్రకారం…తాజాగా పట్టుబడిన రష్యా నౌకను 2024లో అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టింది. గత నెలలో నౌకలో ప్రవేశించేందుకు అమెరికా కోస్ట్‌ గార్డ్‌ దళాలు ప్రయత్నించగా అందులోని సిబ్బంది నిరాకరించారు. ఆ తర్వాత నౌక అట్లాంటిక్‌ను దాటి పేరు మార్చుకుంది. రష్యాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. నౌక పైన రష్యా పతాకాన్ని చిత్రించారు. అమెరికా ఆపరేషన్‌లో సహకరించినట్లు బ్రిటీష్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ధృవీకరించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే చర్య తీసుకోవడం జరిగిందని తెలిపింది. కాగా నౌకను అమెరికా స్వాధీనం చేసుకునే సమయంలో దాని సమీపంలోనే జలాంతర్గామిని, యుద్ధ నౌకలను రష్యా మోహరించింది. దీంతో ఘర్షణ జరగవచ్చంటూ భయాందోళనలు రేకెత్తాయి. ఇదిలావుండగా తమ ఆంక్షలను ఉల్లంఘించిన నౌకలపై దాడులు కొనసాగుతాయని, వాటిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -