ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యం : ట్రంప్
అబూజ : నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు(ఐఎస్) లక్ష్యంగా అమెరికా భారీగా దాడులు ప్రారంభించింది ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. ”నైజీరియాలో ఐఎస్ ఉగ్రవాదులపై యూఎస్ శక్తిమంతమైన దాడులు ప్రారంభించింది. ప్రధానంగా అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్నవారిపై ఇవి జరిగాయి. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించా. నా హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించను” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నట్టు ట్రంప్ తెలిపారు. ఈ హత్యాకాండ కొనసాగితే.. తమ దాడులు కూడా జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు దాడులు చేసి.. పలువురు ఉగ్రవాదులను అంతం చేశామని అమెరికాకు చెందిన సైన్యాధికారి పేర్కొన్నారు. నైజీరియాలోని ఐఎస్ అనుబంధ వర్గాలు, బోకో హరామ్ అనే తీవ్రవాద సమూహం నుంచి చాలా కాలంగా అభద్రతను ఎదుర్కొంటోంది. 2020లో అమెరికా తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో పేర్కొంది. క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడానికి నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్టు నవంబరులో ట్రంప్ పేర్కొన్నారు.



